Suryaa.co.in

Andhra Pradesh

ప్రతి ఇళ్లూ, కార్యాలయం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలి

– సోలార్ విద్యుత్ ఉత్పత్తితో వినియోగదారుడు అదనంగా ఆదాయం పొందే అవకాశం
– కేంద్ర కార్యక్రమాలైన పిఎం సూర్యఘర్, కుసుమ్ పథకాల ద్వారా గరిష్ట లబ్ది పొందాలి
– ప్రతి ప్రభుత్వ కార్యక్రమం విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రంగా మార్చాలి:- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– రాష్ట్రంలో సౌరవిద్యుత్ కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

అమరావతి : రాష్ట్రంలోని ప్రతీ ఇళ్లూ, ప్రతీ కార్యాలయం సౌరశక్తిని ఒడిసిపట్టి విద్యుత్ ఉత్పత్తి – వినియోగంలో స్వావలంభన సాధించే దిశగా అడుగులు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రం సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కావాలని, సౌర విద్యుత్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన ప్రణాళికలు సత్వరం అమల్లోకి తేవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రానికి ఉన్న ప్రత్యేక వాతారవణ పరిస్థితుల కారణంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తిరుగులేని ఫలితాలు సాధించవచ్చని సిఎం అన్నారు.

సోలార్ విద్యుత్ తో కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి… సోలరైజేషన్ కార్యక్రమంలో నిర్థేసించుకున్న లక్ష్యాలను సాధించాలని ముఖ్యమంత్రి సూచించారు. తమ ఇళ్లపై సోలార్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా వినియోగదారుడు తమకు అవసరమైన విద్యుత్ ను ఉచితంగా పొందడమే కాకుండా….తాను వినియోగించుకోగా మిగలిన విద్యుత్ తో అదనంగా ఆదాయం పొందే పరిస్థితి రావాలని ముఖ్యమంత్రి అన్నారు. దీని కోసం ప్రజలను చైతన్య పరిచి…కేంద్ర కార్యక్రమాలైన పిఎం సూర్యఘర్, కుసుమ్ పథకాలను వారికి చేరువ చేయాలన్నారు.

రాష్ట్రంలో సౌరవిద్యుత్ కు ప్రోత్సాహంలో భాగంగా చేపట్టిన సోలరైజేషన్ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సచివాలయంలో చంద్రబాబు సమీక్ష చేశారు. ప్రజల ఇళ్లపై సౌరవిద్యుత్ ఉత్పత్తి, 100 శాతం సౌర విద్యుత్ గ్రామాలు ఏర్పాటు, ఎస్ సి, ఎస్ టి ఇళ్లపై 100 శాతం సోలార్ విద్యుత్ పరికరాల ఏర్పాటు, పూర్తిస్థాయి సోలరైజేషన్ లో భాగంగాకుప్పాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని చేపట్టే పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అదే విధంగా ప్రభుత్వ కార్యాలయాలకు పూర్తి స్థాయిలో సౌరవిద్యుత్ వినియోగంలోకి తెచ్చే అంశంపైనా అధికారులు సాధ్యాసాథ్యాలను వివరించారు. కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

భారీ ఎత్తున కేంద్ర సబ్సిడీ :
పీఎం సూర్య ఘర్ – ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి 13న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఏడాదిలో కోటి గృహాలు ఈ పథకం పరిథిలోకి తేవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకోగా, 30 లక్షల ఇళ్లలో ఈ పథకాన్ని మన రాష్ట్రంలో అమలు చేయాలని లక్ష్యం పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ అమర్చుకునే గృహ విద్యుత్ వినియోగదారులకు కేంద్రం భారీగా సబ్సిడీ ఇస్తోంది. 1 కిలో వాట్‌కి ఎస్‌ఆర్టీ (సోలార్ రూఫ్ టాప్ ) కి రూ. 50 వేలు ఖర్చు అవుతుండగా, రూ. 30 వేలు సబ్సిడీ రానుంది. అలాగే 2 కిలో వాట్లకు వ్యయం రూ. 1 లక్ష కాగా సబ్సిడీ రూ. 60 వేలు, 3 కిలో వాట్లకు పెట్టుబడి రూ. 1 లక్షా 45వేలు కాగా రూ. 78 వేలు సబ్సిడీ రూపంలో కేంద్రం ఇస్తుంది.

రాష్ట్రంలో 6 లక్షల మంది రిజిస్ట్రేషన్ :
రాష్ట్రంలో ఈ పథకానికి తమ సమ్మతి తెలుపుతూ ఇప్పటివరకు 6,33,045 మంది గృహ విద్యుత్ వినియోగదారులు రిజిష్టర్ చేసుకున్నారని అధికారులు తెలిపారు. వీరిలో పిఎం సూర్య ఘర్ పథకానికి 70,110 ధరఖాస్తు చేయగా, 4,961 గృహాలపై ఇప్పటికే సోలార్ ప్యానల్స్ అమర్చడం పూర్తయ్యింది.

కుప్పం నియోజకవర్గంలో 100% సౌర విద్యుత్ లక్ష్యం :
కుప్పం నియోజకవర్గంలో 50,314 ఇళ్లు సౌరవిద్యుత్ అమర్చేందుకు అనుకూలంగా ఉండగా, 50,312 ఇళ్ల యజమానులు తమ అంగీకారం తెలిపారు. దీంతో కుప్పం నియోజవర్గంలో 2 కోట్ల 66 లక్షల 15 వేల 521 చదరపు అడుగుల విస్తీర్ణంలో సోలార్ రూఫ్ టాప్ విద్యుత్ ఉత్పత్తికి అవకాశం లభిస్తుంది. పీఎంఎస్జీఎంబీవై కింద చేపట్టిన కుప్పం రెస్కో ప్రాజెక్టుకు మొత్తం రూ. 286 కోట్లు వ్యయం అవుతుంది. ఇందులో రూ. 172 కోట్లు కేంద్రం నుంచి సబ్సిడీ రూపంలోనే వస్తుంది. మిగిలిన రూ. 114 కోట్లను లబ్ది దారులు రుణంగా పొందే అవకాశం ఉందని అధికారులు వివరించారు.

ప్రభుత్వ భవనాలకు సోలార్ విద్యుత్ :
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలపైనా సౌర పలకలు ఏర్పాటు చేయడం ద్వారా ప్రభుత్వానికి 100 మెగావాట్లకు సుమారు రూ.349 కోట్ల నుంచి రూ. 379 కోట్ల వరకు విద్యుత్ బిల్లుల రూపంలో ఆదా కానుంది. లక్ష యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో 2,186 ప్రభుత్వ కార్యాలయాలను సోలార్ రూఫ్ టాప్స్ కోసం గుర్తించడం జరిగింది. 19,53,369 చదరపు మీటర్ల పరిథిలో సౌర విద్యుత్ పలకలు ఏర్పాటు చేస్తే ఏడాదికి 2,62,252 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందుకు రూ. 262.25 కోట్లు వ్యయం కానుంది. ఎన్టిపిసి విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టనుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరుపున జీఏడీ లేదా ఆర్ధిక శాఖ గ్యారెంటీ ఇవ్వాలని నిర్ణయించారు.

పేద ఎస్సీ, ఎస్టీ గృహాలకు ప్రాధాన్యత :
పేద ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు గృహానికి నెలకు ప్రస్తుతం 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం కింద 20.38 లక్షల గృహ వినియోగదారులు లబ్దిపొందుతున్నారు. ఇప్పుడు ఈ గృహాలకు పీఎంఎస్జీఎంబీవై కింద సోలార్ రూఫ్ టాప్ ప్యానెల్స్ అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. అయితే 81% గృహాలకు సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసేందుకు వెసులుబాటు లేదు. మిగిలిన 19% గృహాలకు ఫస్ట్ ఫేజ్ కింద పీఎంఎస్జీఎంబీవై పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది ఉందని అధికారులు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.

పిఎం కుసుమ్ స్కీం పథకం :
పిఎం కుసుమ్ స్కీం పథకం కింద రాష్ట్రంలో 14, 94, 453 వ్యవసాయ విద్యుత్ పంపు సెట్లకు సోలార్ ప్యానల్స్ అమర్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కుసుమ్ పథకం ద్వారా ఫేజ్ 1 కింద 3572 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు.

మోడల్ సోలార్ విలేజ్ :
రాష్ట్రంలో మొత్తం 132 గ్రామాలను సోలార్ విలేజస్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ గ్రామాల్లో 100 శాతం ఇళ్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తాయి. సోలార్ గ్రామాలకు కేంద్రం రూ. 1 కోటి సాయం కింద ఇవ్వనుంది.

అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పథకం అమలుపై వేగంగా ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యుత్ బిల్లల భారం నుంచి విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఆదాయం ఆర్జించే అవకాశాన్ని ప్రజలకు కల్పించవచ్చని సిఎం అన్నారు. కేంద్ర పథకాలను వేగంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 55 వేల ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని అధికారులు తెలపగా….వీటిలో ట్రాన్స్ పోర్ట్ వాహనాలకు, వ్యక్తిగత వాహనాలకు విరివిగా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ వాహనాలకు తీసుకునే విద్యుత్ టారిఫ్ లను కూడా నిర్ణయించాలని అధికారులకు సూచించారు.

LEAVE A RESPONSE