– ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు
రాయదుర్గం : రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ చేస్తున్న మంచిని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఇంటికి ఒక్కరు ప్రచారకర్తగా పని చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అభిప్రాయపడ్డారు. రాయదుర్గంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల వైకాపా విధ్వంసకర పాలనలో రాష్ట్రం చాలా వెనకబడిపోయిందన్నారు. చంద్రబాబు నిరంతర శ్రమ, కృషితో ఇప్పుడిప్పుడే అభివృద్ధి పట్టాలెక్కుతుందన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్ సిక్స్ హామీలను ఏడాదిన్నరలోనే అమలు చేశామన్నారు. ఇదే నేపథ్యంలో అభివృద్ధిలోనూ రాష్ట్రం శరవేగంగా ముందుకు దూసుకుపోతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబు లదే ఆ ఘనతని మెచ్చుకున్నారు. ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ పారిశ్రామికవేతల సదస్సులో రాష్ట్రానికి సుమారు రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఘనత వారిదే అన్నారు.
దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో చేపట్టడం ఓ రికార్డుని పేర్కొన్నారు. కూటమి ప్రగతి యజ్ఞాన్ని జీర్ణించుకోలేని జగన్ అండ్ కో కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోందన్నారు. మరి ముఖ్యంగా చంద్రబాబు, లోకేష్ బాబులపై అసత్య ఆరోపణలు, నిందనలువేస్తూ ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తపరిచారు.