ఈరోజుల్లో డబ్బుని పేదోడూ
కళ్ళ చూడ్డం లేదు..
పెద్దోడూ చూడ్డం లేదు..
ఉన్నోళ్లది అంతా ఆన్లైనే కదా..!
ఆన్ లైన్లో మోసపోడానికి
కూడా క్యూ లైన్లో నించునే
జనాన్ని ఏమనాలి?
నాలుగు రాళ్లు ఎనకేసుకోవాలని
తాపత్రయపడితే
కిడ్నీలో నలభై రాళ్ళు చేరాయి.
దేవుడు మనిషికి ఇచ్చింది
ముప్పై రెండు పన్నులే..
సర్కార్లు అంత కంటే ఎక్కువ
పన్నులే బిగిస్తున్నాయి..
ఏ దేశంలో అయినా
డబ్బు పేరు కరెన్సీ..
మన దేశంలో మాత్రం
లక్ష్మీ దేవి..లచ్చిం తల్లి..
ధన మూలం ఇదం జగత్..
అదెక్కువైతే విధం చెడుత్..
మంది ఎక్కువైతే
మజ్జిగ పలచన..
సొమ్ము ఎక్కువైతే
అందరూ చులకన..
మనందరం
పన్నులు చెల్లిస్తేనే బడ్జెట్..
పంచేసే పాలకులకే క్రెడిట్..
నన్ను కొట్టి నీకు
నిన్ను కొట్టి నాకు
ఇవ్వటమే ఉచితం..
ప్రధాని ఎవరైనా
పంచిపెట్టే విధానమే ప్రధానం..
మోడీజీ ప్రధాని కాగానే
పెద్ద నోట్లు రద్దు..
కాలం గడిచిన కొద్దీ
బడాబాబులు బ్యాంకులకు..
ఇతర ఆర్థిక సంస్థలకు
రాసిన ప్రామిసరీ నోట్లు
కూడా రద్దు..
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286