Suryaa.co.in

Entertainment Telangana

మంచు మనోజ్‌ చెప్పేవన్నీ అబద్దాలే

లెటర్‌తో షాక్ ఇచ్చిన తల్లి నిర్మల

మంచు మోహన్ బాబు ఫ్యామిలీలో మరో భూకంపం వచ్చింది. ఇప్పటి వరకు మోహన్ బాబు, విష్ణు మాత్రమే మనోజ్‌కు వ్యతిరేకంగా ఉన్నారని ప్రచారం ఉంది. ఇప్పుడు తల్లి కూడా ఆయనకు సపోర్ట్ చేయడం లేదని స్పష్టమైంది. శనివారం బర్త్‌డే రోజు తన కుటుంబంపై హత్యాయత్నం జరిగిందని మనోజ్ ఆరోపించారు. కానీ ఇదంతా అబద్దమని అతని తల్లి నిర్మల లెటర్ రాయడం సంచలనంగా మారింది.

పది రోజుల క్రితం మంచు ఫ్యామిలీలో మొదలైన ఇంటింటి రామాయణం సీరియల్ ఇంకా కొనసాగుతూనే ఉంది. రోజుకో ట్విస్ట్‌ టర్న్‌లతో నిండి ఉంటోందీ వివాదం. ఇప్పటి వరకు మంచు మోహన్ బాబు, మనోజ్‌, విష్ణు వెర్షన్ మాత్రమే వింటూ వచ్చిన జనాలకు ఇప్పుడు తన వాయిస్‌ కూడా వినిపించేశారు మనోజ్ తల్లి నిర్మల. పూర్తిగా మనోజ్‌ వైఖరిని తప్పుపడుతూ ఆమె ఓ లెటర్ రాశారు. బర్త్‌డే రోజు ఇంట్లో జరిగిన విషయాలపై నిర్మల క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు పోలీస్‌లకు ఆమె ఓ లేఖ రాశారు.

“డిసెంబరు 14వ తేదీన తన పుట్టినరోజు సందర్భంగా పెద్ద కుమారుడు విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్‌ని బయట పెట్టి, విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లెయింట్ ఇచ్చినట్టు తెలిసింది.

నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతో ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్‌ ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని వాళ్ళు కూడా ‘మేమిక్కడ పని చేయలేమని’, వాళ్ళే మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు.“ అని ఆలేఖలో పేర్కొన్నారు.

ఒంటరైన మనోజ్‌

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మంచు మనోజ్ ఒంటరి అయినట్టు స్పష్టమవుతుంది. ఇప్పటి వరకు తండ్రి, అన్నతోనే విభేదాలు ఉన్నాయని అనుకున్నారు. ఇప్పుడు ఆయనకు తల్లి సపోర్ట్ కూడా లేదని ఈ లేఖతో స్పష్టమవుతుంది. ఇప్పుడు మనోజ్ ఎలా స్పందిస్తారో అన్న చర్చ నడుస్తోంది. వివాదం మొదలైనప్పుడు ఈ గొడవంతా అన్నదమ్ముల మధ్యే అనుకున్నారు. అయితే వివాదంపై మోహన్ బాబు స్పందిస్తూ మనోజ్‌కు వ్యతిరేకంగా ఓ వాయిస్ మెసేజ్‌ విడుదల చేశారు. అందరి కంటే ఎక్కువ ప్రేమతో చూశానని అన్నారు. అయినా ఇలా చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇప్పుడు తల్లి కూడా మనోజ్‌దే తప్పని తేల్చి చెప్పారు.

LEAVE A RESPONSE