– అరెస్టు చేస్తానంటే చేసుకో
– గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా.
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాలు
హైదరాబాద్ : 50 లక్షల రూపాయల లంచం డబ్బులతో దొరికిన నీకు అన్నీ కుట్ర లాగానే కనిపిస్తాయి. మీ అల్లుడి కంపెనీ కోసం లాక్కుంటున్న భూములకు వ్యతిరేకంగా రైతుల చేస్తున్న పోరాటం కుట్రగానే కనిపిస్తుంది. మీ అన్న బెదిరింపులకు లొంగని రైతన్నల ధైర్యం కుట్రగానే కనిపిస్తుంది.
ఇద్దరు వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్న కుట్రలాగానే అనిపిస్తుంది. ప్రజలు సోషల్ మీడియాలో తమ బాధలు పోస్ట్ చేస్తే కుట్రగానే కనిపిస్తుంది. పేద గిరిజన రైతులకు అండగా నిలబడితే అది కుట్రగానే అనిపిస్తుంది. 9 నెలలపాటు నీ అపాయింట్మెంట్ కోసం వేచి చూసి, నీ బెదిరింపులన్ని తట్టుకొని, చివరికి ఎదిరిస్తే అది నీకు కుట్ర లాగానే అనిపిస్తుంది.
పేద రైతన్నల కుటుంబాల మీద అర్ధరాత్రి దాడులు చేసి, అక్రమంగా అరెస్టు చేసి, వారిని చిత్రహింసలకు గురిచేసినప్పుడు నేను ప్రశ్నిస్తే కుట్రలాగానే అనిపిస్తుంది. ప్రతినిత్యం భయంతో బతికే నీకు ఇవన్నీ కుట్ర లాగానే అనిపిస్తాయి. ప్రతిక్షణం నువ్వు భయాన్ని శాసిస్తూ ఆ భయం లోనే బతుకుతున్నావు. గొంతులేని వారికి గొంతుకు అయినందుకు… పేద రైతన్నల పక్షాన నిలబడినందుకు అరెస్టు చేస్తానంటే చేసుకో. తెలంగాణ రైతన్నల పక్షాన నిలబడి, తలెత్తుకొని గర్వంగా జైల్లోకి నడుచుకుంటూ వెళ్తా.