– ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ , ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ
అమరావతి: సంక్రాంతి పండుగ సందర్భంగా అక్రమ మద్యం పై పటిష్ట నిఘా ఏర్పాటు చేసినట్లు ఎక్సైజ్, ప్రొహిబిషన్ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. శుక్రవారం రాష్ట్ర స్థాయులో ఎక్సైజ్, ప్రొహిబిషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప కమిషనర్లు, అసిస్టెంట్ కమిషనర్లు (ఎన్ఫోర్స్మెంట్), జిల్లా ఎక్సైజ్ అధికారులు , స్టేషన్ హౌస్ అధికారులను భాగస్వామ్యం చేసి భద్రతా చర్యలను చర్చించి మార్గదర్శకాలను జారీ చేశారు.
ఆటంకం రహిత మద్యం సరఫరా: డిప్యూటీ కమిషనర్లు ఏ పి ఎస్ బి సి ఎల్ డిపోలను ఉపయోగించి, లైసెన్సీలకు ఇండియన్ మేడ్ లిక్వర్, బీర్ నిత్యం అందుబాటులో ఉంచాల్సి ఉంటుంది. మద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా సమర్థవంతమైన నిల్వ నిర్వహణ చేయాలి.
నిల్వల పర్యవేక్షణ, నాణ్యత నిర్ధారణ: అన్ని డిపోలలో నిల్వలు చక్కగా అందుబాటులో ఉన్నాయా అనే విషయాన్ని 24 గంటలు పర్యవేక్షించాలి. సరఫరాదారులతో సమన్వయం చేసి నిల్వలు తక్షణమే నింపి తగినంత స్టాక్ అందుబాటులో ఉంచాలి. పండుగ సమయంలో నాణ్యమైన మద్యం అందుబాటులో ఉండటం చాలా అవసరం.
నాటుసారా తయారీపై దాడులు: గ్రామాల్లో దాడులను పెంచి, నాటుసారా తయారీ, అమ్మకం, వినియోగాన్ని నివారించాలి. ప్రజల సమావేశాలు జరిగే ప్రదేశాలలో నకిలీ మద్యం, కల్తీ తాటి కల్లు విక్రయాలను అడ్డుకోవడానికి ప్రత్యేక దృష్టి పెట్టాలి.
సరిహద్దు నిఘాను బలపరచడం: సరిహద్దు మొబైల్ ప్యాట్రోలింగ్ పార్టీలను, ఎక్సైజ్ చెక్ పోస్ట్‌లను పూర్తి స్థాయిలో ప్రారంభించి, ఆపరేషన్లను ముమ్మరం చేయాలి. పొరుగు రాష్ట్రాల నుండి పన్ను చెల్లించని మద్యం, నకిలీ ఉత్పత్తుల ప్రవాహాన్ని నిరోధించడానికి సరిహద్దుల్లో నిఘా పెంచాలి.
స్మగ్లింగ్ నివారణ చర్యలు: స్టేషన్ హౌస్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు మద్యం స్మగ్లింగ్ మార్గాలపై నిఘా పెట్టి దాడులు జరపాలి. కల్తీ తాటి కల్లు అమ్మకాలను అరికట్టాలి. తాటి కల్లు దుకాణాలను నియంత్రించి, మందుల కల్తీ జరుగుతోందా అనే దానిపై గట్టి పర్యవేక్షణ చేయాలి.
తాటి కల్లు నాణ్యత పరిశీలించేందుకు క్రమం తప్పకుండా శాంపిలింగ్ టెస్టులు నిర్వహించాలి.
నార్కోటిక్ డ్రగ్స్ , సైకోట్రోపిక్ నియంత్రణ : పండుగ సమయంలోఎన్ డి పి ఎస్ పదార్థాల వినియోగం, పంపిణీపై గట్టి పర్యవేక్షణ అవసరం. పంపిణీ, వినియోగాన్ని అడ్డుకోవడానికి ఇతర సంస్థలతో సమన్వయం జరగాలి.