– జగన్ బినామీ సంస్థగా టిడిపి నేతలు ప్రకటించిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్
– షిరిడీ సాయి సంస్థ నుంచి 2024 జనవరిలో ఎన్నికల ముందు రూ.40 కోట్ల ఎన్నికల బాండ్లనుఅందుకున్న టీడీపీ
– మళ్లీ షిర్డిసాయికే కట్టబెట్టడం వెనక మతలబేమిటి?
– విద్యుత్ అవినీతి ఒప్పందాలు, సంస్కరణల విషయాల్లో బిజెపి, టిడిపి, వైసిపి, జనసేనకు ఎటువంటి తేడా లేదు
– అదానీతో విద్యుత్ ఒప్పందాలపై విచారణ ఏదీ?
– నాడు రద్దు చేయాలని టీడీపీ కోర్టుకెక్కలేదా?
– వైసీపీ చట్టవిరుద్ధ చర్యకు కూటమి చట్టబద్ధత కల్పించడం సిగ్గుచేటు
ఇది షాకుల కాలం. నాసిరకం విద్యుత్ నిలువునా చంపేస్తోంది. నాణ్యత పేరుతో ఇచ్చే విద్యుత్ సామాన్యులకు తాకకుండానే షాక్ కొడుతోంది. అదానీలను అందలమెక్కించే అవినీతి పాలకులు రాష్ట్ర ప్రజలను ‘స్మార్ట్’గా దోచేస్తున్నారు. విద్యుత్ బిల్లులు పెరిగాయని జనం గగ్గోలు పెడుతున్నా పాలకులు చార్జీలను తగ్గించకపోగా…వాయిదాల పద్ధతిలో మెత్తగా భారాలను మోపేందుకు కొత్త దారులను ఎంచుకుంటున్నారు.
కొత్త టారిఫ్‌పై విద్యుత్ నియంత్రణ మండలి (ఇ.ఆర్.సి) మొక్కుబడి విచారణ తంతు ముగించింది. తుది ఆదేశాలు త్వరలో ఇస్తారు. మున్ముందు ప్రజలకు మరిన్ని షాకులిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీనిని ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలి.
వాస్తవమిదీ…
వైసిపి ఐదేళ్ల పాలనలో దఫదఫాలుగా రూ.32 వేల కోట్ల విద్యుత్ భారం మోపింది. తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం 19 నెలల్లోనే రూ. 20,136 కోట్లకు పైగా భారాన్ని జనం నెత్తిన మోపింది. చార్జీలు పెంచినట్లు కనపడదు. కానీ ట్రూఅప్, ఎఫ్‌పిపిసిఎ (ఫ్యూయల్ పవర్ పర్చేజింగ్ కాస్ట్ అడ్జస్ట్మెంట్) పేరుతో సర్దుబాటు చార్జీలు మోపటం సర్వసాధారణంగా మారింది. నాటి చంద్రబాబు ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశపెట్టింది.
2022-23, 23-24 ఆర్థిక సంవత్సరాల్లో బిల్లులు కట్టిన వారి నుంచి మరల ఇప్పుడు రూ.15,485 కోట్లు అదనంగా సర్దుబాటు చార్జీలు వసూలు చేస్తోంది. ప్రతి నెలా గడిచిన నెల వినియోగంపై యూనిట్‌కు 40 పైసలు చొప్పున సర్దుబాటు చార్జీలు వసూలు చేసే విధానాన్ని వైసిపి ప్రవేశపెట్టగా, కూటమి ప్రభుత్వం ప్రతి నెలా చార్జీలపై యూనిట్‌కి 40 పైసలు అదనంగా వసూళ్లు కొనసాగిస్తున్నది.
ఈ విధంగా ఈ 19 నెలల్లో సుమారు రూ.4,650 కోట్లు ఈ పేరుతో ప్రజల నుంచి దోచుకుంది. 24-25 సంవత్సరంలో ముందుగానే అదనంగా వసూలు చేసిన రూ.2,787 కోట్ల నుంచి రూ.923 కోట్లు వెనక్కి ఇచ్చేయాలని నియంత్రణ మండలి ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాల ప్రకారం అడ్డగోలుగా ముందుగా వసూలు చేసిన 40 పైసల్లో 13 పైసలు ప్రజలకు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీనినే గొప్ప తగ్గింపుగా ప్రభుత్వం ప్రచారం చేయడం హాస్యాస్పదం.
చార్జీలపైనా పన్నులే!
విద్యుత్ సుంకం (ఎలక్ట్రిసిటీ డ్యూటీ) పేరుతో ప్రతి యూనిట్‌కు ఆరు పైసల చొప్పున సుంకం వసూలు చేస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం…వ్యాపార, వాణిజ్య, పరిశ్రమలు అన్ని కేటగిరీలపై ఒకేసారి ఈ సుంకాన్ని 100 పైసలకు పెంచడం ద్వారా రూ.6 వేల కోట్లు అక్రమంగా వసూలు చేసింది. దీనిని తప్పు పట్టిన హైకోర్టు…బకాయిలతో సహా వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది. కూటమి సర్కార్ ఈ తప్పును సరిచేయకపోగా, దీనిని కొనసాగిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు కూడా మొట్టికాయలు వేయడంతో కొద్ది నెలలు దీనిని ఆపినట్లే ఆపి, ఈ శాసన సభ సమావేశాల్లో చట్ట సవరణ చేసి 100 పైసలు వసూలుకు నిర్ణయించింది.
కోర్టు ఆదేశాల ప్రకారం వినియోగదారులకు తిరిగి చెల్లించవలసిన రూ. 6 వేల కోట్లు చెల్లించనేలేదు. కూటమి ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా వేల కోట్ల రూపాయల భారం మోపే చట్ట సవరణ చేసింది. గతంలో వైసిపి ప్రభుత్వం చేసిన చట్టవిరుద్ధ చర్యకు, కూటమి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించడం సిగ్గుచేటు. ఈ చట్ట సవరణపై వైసిపి మౌనం దాల్చింది. టిడిపి, వైసిపి, బిజెపి అన్ని పార్టీలదీ ఒకటే వైఖరని మరోసారి రుజువైంది.
ఈ నిలువు దోపిడీ అప్పుడు, ఇప్పుడు కొనసాగుతూనే ఉంది. 2021 నుండి ఈ పెంపుదల వర్తించే విధంగా చట్ట సవరణ చేయడంతో ఇప్పటివరకు న్యాయస్థానం ఆదేశాలతో సుంకం చెల్లించని సంస్థలు, వ్యక్తులు బకాయిలతో సహా ఇప్పుడు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అనేక వ్యాపారాలు, పరిశ్రమలు మూతబడి ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది.
ఇవి భారాలు కావా?
కస్టమర్ చార్జీలు, ఫిక్స్డ్ చార్జీలు, సర్ చార్జీలు, పెనాల్టీలు ఇలా రకరకాల రూపాల్లో అదనపు వసూళ్లు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. మధ్య, మధ్యలో అదనపు లోడ్ సాకుతో వేల రూపాయల డెవలప్మెంట్ చార్జీలు వసూలు చేయటం సర్వసాధారణంగా మారింది. విద్యుత్ కొనుగోలు వ్యయం తగ్గించామని, అవినీతిని అరికట్టామని, సమర్థత పెంచామని గొప్పగా చెప్పుకునే కూటమి ప్రభుత్వం ఆ సొమ్మంతా ఏమైందో చెప్పదు. చార్జీలు తగ్గించదు. కళ్ళకు కనపడకుండా భారాలు మోపుతోంది.
ముందుంది మరింత ముప్పు
సర్దుబాటు చార్జీలు, విద్యుత్ సుంకం వంటి భారాలకు స్మార్ట్ మీటర్లు తోడవుతున్నాయి. స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టాలని ప్రతిపక్షంలో ఉండగా పిలుపునిచ్చిన కూటమి నేడు అదానీ స్మార్ట్ మీటర్లను అడ్డగోలుగా బిగిస్తున్నది. స్మార్ట్ మీటర్లు బిగించిన వారికి భారం పెరిగిందని పలువురు గగ్గోలు పెడుతున్నారు. ప్రీపెయిడ్ విధానం ద్వారా సెల్‌ఫోన్ తరహాలో ముందుగానే బిల్లులు చెల్లించే విద్యుత్ విధానం ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు జరిగిపోతున్నాయి.
ఒక్కొక్క స్మార్ట్ మీటర్‌కు రూ.8 వేల నుండి రూ.14 వేల వరకు ఖర్చు అవుతుంది. ఆ మొత్తాన్నీ వాయిదాల పద్ధతిలో వినియోగదారుల నుండి వసూలు చేస్తారు. విద్యుత్ వినియోగించే సమయాన్ని బట్టి అదనపు చార్జీలు వసూలు చేసే టైమ్ ఆఫ్ ది డే (టి.ఒ.డి) విధానం మరింత విస్తృతం చేశారు. భవిష్యత్తులో దాదాపు ప్రతి వినియోగదారుడి నుండి పగలొక రేటు, రాత్రి ఒక రేటు వసూలు చేస్తారు. దోచుకోవటానికి ఇది మరో మార్గం.
పంచాయతీలు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థలకు మంచినీటి సరఫరా, వీధి లైట్ల నిర్వహణ, రైల్వేలు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు, పౌర సదుపాయాలపైనా భారాలు వేయడానికి పాలకులు వెనకాడటం లేదు. ఆయా విభాగాలకు సైతం ఫక్తు వ్యాపార ధోరణితో యూనిట్‌కు రూ.6.65 నుంచి రూ.7.89 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ఈ భారాలన్నింటిని భరించాల్సింది పరోక్షంగా ప్రజలే.
తప్పులు పాలకులవి…శిక్ష ప్రజలకా…?
ప్రభుత్వ సంస్థలు, స్థానిక సంస్థలు, బడా కంపెనీలు మాత్రం సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లించవు. కొందరు పూర్తిగా ఎగ్గొడతారు. వీళ్ల బకాయిలు రూ.15,137 కోట్లకు పైగా ఉన్నాయి. ఇందులో బడా కంపెనీల బకాయిలు 42 శాతం ఉన్నాయి. సామాన్యులు బిల్లులు చెల్లించకపోతే ఫీజులు పీకే ప్రభుత్వం.. బడా సంస్థల నుంచి ఎందుకు చార్జీలు వసూలు చేయదు? స్థానిక సంస్థలు, ప్రభుత్వ సంస్థల బకాయిలను ప్రభుత్వమే చెల్లించాల్సి ఉన్నా ఎందుకు పట్టించుకోదు?
ఏనాడూ ప్రభుత్వం సకాలంలో సబ్సిడీ బకాయిలు ఇవ్వటం లేదు. రూ.11,549 కోట్ల సబ్సిడీ బకాయిలు పేరుకుపోయాయి. దీంతో విద్యుత్ సంస్థలు రుణాల ఊబిలో కూరుకుపోతున్నాయి. దీనిని మళ్లీ జనం నుంచే సర్దుబాటు చార్జీల రూపంలో వడ్డీలతో సహా వసూలు చేస్తారు.
నలువైపుల నుంచి నిలువు దోపిడీ
2000 సంవత్సరంలోనే విద్యుత్ సంస్కరణలకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. చౌకైన, నాణ్యమైన, నిరంతరాయమైన విద్యుత్తు అని ఆశపెట్టారు. 25 ఏళ్లలో సామాన్యులకు బిల్లులు తగ్గలేదు. కార్పొరేట్ల జేబులు నిండుతున్నాయి. పాలక పార్టీల నేతలు బాగుపడ్డారు. కేంద్రంలోని బిజెపి ఈ విధానాలను దేశమంతా దూకుడుగా అమలు చేస్తున్నది. విద్యుత్ చట్టానికి సవరణలు చేస్తోంది. విద్యుత్ ప్రైవేటీకరణకు పూనుకుంటున్నది.
క్రాస్ సబ్సిడీ తగ్గించాలని ఆదేశాలు ఇస్తున్నది. ఈ విధానాలను రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం అడ్డగోలుగా అమలు చేస్తోంది. కేంద్రం ఆదేశాలకు లొంగి, అదానీ అవినీతికి దాసోహమని వైసిపి ప్రభుత్వం ఆ సంస్థతో 25 సంవత్సరాల పాటు ఏడు వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసే అక్రమ ఒప్పందాన్ని చేసుకున్నది. దీనివలన లక్షా రూ.20 వేల కోట్ల వరకు భారం పడుతుందని స్వయంగా చంద్రబాబు ప్రకటించారు. ఈ ఒప్పందం రద్దు చేయాలని హైకోర్టులో నాడు టిడిపి నేతలు కేసు వేశారు. ఈ అవినీతి ఒప్పందాన్ని రద్దు చేయకపోగా దీనిపై కనీసం విచారణ చేయటానికి కూడా చంద్రబాబు, పవన్ సిద్ధం కావడం లేదు.
వైసీపీ, అదానీ అవినీతిని కూటమి కొనసాగిస్తోంది. ఈ భారం భవిష్యత్తు తరాలపై పడుతుంది. కూటమి ప్రభుత్వం యాక్సిస్ తదితర సంస్థల నుంచి 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు రూ.4.60 చెల్లించే తాజా అడ్డగోలు ఒప్పందాలను చేసుకున్నది. ఈ ఒక్క ఒప్పందం వలనే రూ.14,186 కోట్ల భారం భవిష్యత్తులో పడుతుందని అంచనా. ఈ అక్రమ ఒప్పందాల దోపిడీని అరికట్టాలి.
అదానీకి దాసోహం
మన రాష్ట్రంలో కూడా విద్యుత్ రంగాన్ని అదానీ కబళిస్తున్నారు. విదేశాల నుండి బొగ్గు సరఫరా, తన పోర్టులు ద్వారా రవాణా, బొగ్గు లారీల ద్వారా రవాణా కాంట్రాక్టు, సోలార్ విద్యుత్ సరఫరా, స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టులు మొత్తం అదానీవే. మొత్తం ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగం అదానీ పరం అవుతున్నది. విద్యుత్ అవినీతి ఒప్పందాలు, సంస్కరణల విషయాల్లో బిజెపి, టిడిపి, వైసిపి, జనసేనకు ఎటువంటి తేడా లేదు. వీరందరిదీ ఒకటే దారి. వినియోగదారులను దోచుకునే పద్ధతులు మాత్రమే వేరు.
అందరి అవినీతి వాటాలు
జగన్ బినామీ సంస్థగా టిడిపి నేతలు ప్రకటించిన షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ సంస్థ నుంచి 2024 జనవరిలో ఎన్నికల ముందు రూ.40 కోట్ల ఎన్నికల బాండ్లను టిడిపి అందుకున్నది. అవినీతిలో వాటాలు పంచుకున్నది. వీరు అవినీతిని అరికట్టగలరా? చార్జీలు తగ్గించగలరా? కూటమి ప్రభుత్వం విదేశీ, స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు విద్యుత్ యూనిట్‌కి రెండు నుంచి మూడు రూపాయల వరకు తగ్గిస్తూ రాయితీలు ప్రకటించింది.
చిన్న, చిన్న బడ్డీ కొట్లు, కిరాణా షాపులు నడుపుకునే వారికి మాత్రం యూనిట్‌కి రూ.3 నుంచి రూ.9 వరకు వసూలు చేస్తున్నారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకపోగా విద్యుత్ భారాలు మోపుతున్నారు. విద్యుత్ భారాలు భరించలేక పలు పరిశ్రమలు మూతపడుతున్నాయి. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తుకు ఎసరు పెట్టాలని కేంద్రం ఒత్తిడి చేస్తున్నది. ఎస్సీ, ఎస్టీ తరగతులు, క్షౌర వృత్తిదారులు, చేనేత కార్మికులకు రాయితీ పెంచామని ప్రకటనలే తప్ప అమలు అరకొరగానే ఉన్నది.
మారాల్సింది విధానాలు
కేంద్రం చేస్తున్న విద్యుత్ సంస్కరణలను, ప్రైవేటీకరణను అడ్డుకోవాలి. తక్షణం కూటమి ప్రభుత్వం వేసిన రూ. 15,485 కోట్ల సర్దుబాటు చార్జీలు రద్దు చేయాలి. యూనిట్‌కి 40 పైసలు అదనపు వసూళ్లు ఆపాలి. విద్యుత్ సుంకం పెంచుతూ చేసిన చట్ట సవరణ రద్దు చేయాలి. అదాని సంస్థలతో చేసుకున్న సోలార్ ఒప్పందాలు రద్దు చేయాలి. ఇతర బడాసంస్థల ఒప్పందాలను పున:సమీక్షించాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. చార్జీల భారాలను తగ్గించాలి.
విద్యుత్ సంస్కరణలపై సిపిఎం నికరంగా పోరాడుతోంది. కొందరు మేధావులు..ట్రాన్స్ఫార్మర్లు ఇతర అవినీతిని ఎండగడుతున్నారు. మంచిదే. అయితే ప్రభుత్వ రంగంలో ఉండటం వల్లే ఇది జరిగిందని..ప్రైవేటీకరణ జరిగితే అవినీతి పోతుందని భ్రమ పడుతున్నారు. అదాని, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వంటి సంస్థలకు కొన్ని కాంట్రాక్టులు అప్పజెప్తేనే ఇంత అవినీతి జరిగితే, మొత్తం ప్రైవేటీకరణ చేస్తే దొంగల దోపిడీనే అవుతుంది. దొంగ చేతికే తాళాలు ఇస్తే దోపిడీ ఆగదు. అందుకే సమస్యకు మూలాన్ని గమనించాలి. భారాలు, తక్షణ ప్రమాదాలకు తోడు ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలి.
– సిహెచ్. బాబూరావు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు