– అవినీతి జరిగితే 14400కు కాల్ చేయండని సీఎం చెప్పడం హాస్యాస్పదం
– ఇది గిట్టని ఉద్యోగస్థులను భయపెట్టటానికే
– సిండికేట్ చేసి కమీషన్ల కోసం ఒక సిమెంటు బస్తా ధర రూ.200 నుంచి రూ.400కు పెంచింది నిజంకాదా?.
– వరదలు సంభవించినప్పుడు రాక, తరువాత వచ్చాక ఏం లాభం?
– మాజీ మంత్రి పీతల సుజాత
ఎప్పుడూ లేనిది కొత్తగా కోనసీమ జిల్లాల్లో మీడియా మిత్రులను చూసి నవ్వడం, వారి నాయకులను ఆప్యాయంగా మాట్లాడటం దేనికి సంకేతమో చెప్పాలి. మీడియాను చూస్తేనే మైండ్ బ్లాక్ అయి ప్రెస్ మీట్ లు పెట్టడానికే భయపడి, మూడు సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటికి రాని సీఎం, నేడు మీడియాతో ముచ్చటించడం ఆశ్చర్యంగా ఉంది. కోనసీమలో మీడియాతో మాట్లాడిన విషయాలు బహిరంగపరచాలి. దొంగలుపడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగాయి అనే సామెతలా వరదలు సంభవించినప్పుడు రాక, తరువాత వచ్చాక ఏం లాభం?
ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు వరద ప్రాంతానికి వెళ్లి వారికి అందించాల్సిన సహాయాన్ని అందించి వచ్చాక సీఎం వెళ్లారు. ఇప్పుడు కళ్లు తెరిచారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి కదలడానికే మనసు ఒప్పదు. సీఎం వచ్చినప్పుడు ఎలా మెలగాలో ప్రజలకు ఎలా ట్రైనింగ్ ఇచ్చారో సోషల్ మీడియాలో చూశాం. జగన్ పరిపాలన ఘోరంగా ఉంది. అవినీతి జరిగితే 14400కు కాల్ చేయండని సీఎం చెప్పడం హాస్యాస్పదం. ఇది గిట్టని ఉద్యోగస్థులను భయపెట్టటానికే.
మీ తాడేపల్లి ప్యాలెస్ లో జరుగుతున్న అవినీతిపై, మీ మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిపై ఏ నెంబర్ కు కాల్ చేయాలి? శాండ్, ల్యాండ్, వైన్, మైన్ మాఫియా అవినీతి అధికంగా ఉంది. ముందు మీరు మారి, ఆ తర్వాత మీ గ్యాంగ్ ను మార్చాలి. ఉద్యోగస్థులు వ్యతిరేకమయ్యారనే అక్కసుతో 14400 టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినట్లున్నారు. ఎవర్ని భయపెట్టడానికి ఈ యాప్ లు? ప్రజా సమస్యలను పరిష్కరించడానికి యాప్ లు తేవాలి. ప్రజలకు ఏ కష్టమొస్తుందో, మహిళలకు ఏ బాధలున్నాయో, ఏ వేధింపులకు గురవుతున్నారో వాటి కోసం యాప్ లు తేవాలి.
వాళ్లని రక్షించడానికి యాప్ లు తేవాలి. కక్షపూరితంగా ఉద్యోగస్థుల్ని టార్గెట్ చేస్తున్నారు. 151 మంది మీ ఎమ్మెల్యేల అవినీతిపై మా దగ్గర సాక్ష్యాలున్నాయి. మీరు జ్యుడిషియల్ వేయడానికి సిద్ధమా? మద్యం రేట్లు పెంచడంవల్ల మహిళల బతుకులు అన్యాయమైపోతున్నాయి. అన్ని సమస్యల పరిష్కర వేదికగా 1100 టోల్ ఫ్రీ నెంబర్ చంద్రబాబునాయుడు పెట్టారు. కక్షపూరితంగా ఉద్యోగస్థులను టార్గెట్ చేసుకొని 14400 పెట్టారు. సిమెంటు కంపెనీలను సిండికేట్ చేసి కమీషన్ల కోసం ఒక సిమెంటు బస్తా ధర రూ.200 నుంచి రూ.400కు పెంచింది నిజంకాదా?. దీనిపై జ్యుడిషియల్ విచారణకు సిద్ధమా? బాక్సైట్, ల్యాటరైట్ ద్వారా అవినీతి మైనింగ్ చేసి రూ.15వేల కోట్లు లూటీ చేసిన మాట వాస్తవం కాదా? దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీకి సిద్ధమా? మీ అబద్ధపు మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.
మద్యం రేట్లు విపరీతంగా పెంచి మీ బినామీలతో రూ.15వేల కోట్లు దోచింది నిజం కాదా? దీనిపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించగలరా? ప్రతి యేడాది చంద్రబాబునాయుడు తన కుటుంబ ఆస్తుల్ని బహిరంగపరుస్తున్నారు, సీఎం ఇంతవరకు తమ ఆస్తుల వివరాలు ప్రకటించలేదు, ప్రకటించే దమ్ముందా? మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. వైసీపీ నాయకులు తమ అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ఉద్యోగస్థుల అక్రమాలు అరికడతామంటున్నారు, సీసీ కెమెరాలు పెడతామని ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు.
మన్యంలోని బైడికలొద్దు లో భారతి సిమెంట్ కోసం వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో లాటరైట్, బాక్సైట్ లో రూ.15వేల వరకు లూటీ జరిగింది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశాలను కూడా ధిక్కరించి నేడు అక్రమ మైనింగ్ కంటిన్యూగా జరుగుతోంది. దీనిపై మీరు జ్యుడిషియల్ వేయడానికి సిద్ధమా? రేషన్ బియ్యం మాఫియా ద్వారా రూ.4వేల కోట్లు దోచేసింది వాస్తవం కాదా? గంజాయి, డ్రగ్స్ ద్వారా రూ.20 వేల కోట్లు దోచేసింది వాస్తవం కాదా? యువత భవిష్యత్తును నాశనం చేస్తూ ప్రజలకు ఇవన్నీ తెలియదనుకోవడం మీ అవివేకం.
14400 యాప్ క్రియేట్ చేయడాన్నిబట్టి ఇది అవినీతిని అరికట్టే బ్రహ్మాస్త్రం కాదు అనేది రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైంది. దీని ద్వారానే మీరు అవినీతికి బాటలు వేశారు. మాయమాటలు చెబితే వినేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. వైసీపీనే అక్రమాల పుట్ట. భయపెట్టాలని చూస్తే ఎవరూ భయపడరు. ముందు మీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎవరినీ ఎంతో కాలం మభ్యపెట్టలేరు. అన్నాహజారే వారసుల్లా నీతులు మాట్లాడుతున్నారు. ముందు మీరు సీబీఐ విచారణకు హాజరై, కేసులు ముగించుకొని ఆతర్వాత ఇతురులకు నీతులు చెప్పాలని మాజీ మంత్రి పీతల సుజాత పేర్కొన్నారు.