– బిజెపి రాష్ట్ర నేత చల్లా వెంకటేశ్వర రావు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పధకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను పూర్తి చేయడంలో వైకాపా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని బిజెపి రాష్ట్ర నేత చల్లా వెంకటేశ్వర రావు విమర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పధకం క్రింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 21,32,432 ఇళ్లు మంజూరు చేస్తే నేటికి కేవలం 8,64,743 ఇళ్లును మాత్రమే పూర్తి చేశారని తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా బిజెపి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి 2,46,430 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు కేవలం 62,886 ఇళ్లు మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. ఈ పథకం మార్చి 2024 తో ముగిసిపోతుందని, కానీ ఇప్పటి వరకు నాలుగవ వంతు ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని చల్లా వెంకటేశ్వర రావు తెలిపారు.
ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం ద్వారా శ్రీకాకుళం జిల్లాకు 6,498 ఇళ్లు మంజూరు చేయగా ఇప్పటి వరకు 2,522 మాత్రమే పూర్తి చేశారని తెలిపారు. కేంద్ర మార్గదర్శకాలకు విరుద్ధంగా ఇళ్లకు వైయస్సార్ పేరు పెట్టినందుకు సుమారు 5300 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు ఆగిపోయాయని, వెంటనే కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఇళ్లకు పెట్టిన బోర్డులను మార్చి పేదలకు సహకరించాలని కోరారు.