– రాష్ట్ర వ్యాప్తంగా విచారణ
– అధికారులను ఆదేశించిన లంకా దినకర్
– సమీక్షా నివేదికను సీఎం చంద్రబాబుకు అందజేత
అమరావతి: అనకాపల్లి కలెక్టరేట్ లో 24 మే 2025న జరిగిన ‘లాక్ పతి దీదీ’ సమీక్షలో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు 2022 సంవత్సరం నుండి నకిలీ డ్వాక్రా సంఘాల పేరుతో 3 కోట్లకు పైగా అనకాపల్లి లో తీసుకున్నారని తెలిపారు. ఆ గ్రూపులతో పేర్లు ఉన్న మహిళలు ఆ రుణాలు తీర్చలేక, కొత్త రుణాలు వారికి రాక ఇబ్బందులు పడుతున్నారని ఆ సమావేశంలో నా దృష్టికి తెచ్చి, ఈ అంశం పైన కఠిన చర్యలు అవసరమని ఆదేశించారని ’20 సూత్రాల ఛైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం 2019 – 24 మధ్య డ్వాక్రా గ్రూపుల రుణాల అవకతవకల పైన సెర్ప్, మెప్మా అధికారులతో సచివాలయంలోని తమ ఛాంబర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దినకర్ మాట్లాడారు.
ఒక్క అనకాపల్లి లో 3 కోట్లు వరకు నకిలీ రుణాలు తీసుకుంటే, రాష్ట్ర వ్యాప్తంగా స్వయం సహాయక గ్రూపులను చూపి ఏంత మొత్తం నకిలీ రుణాలు తీసుకున్నారనే అనుమానం వచ్చి 13 జూన్ 2025 న సెర్ప్ సీఈఓ, మెప్మా ఎండీ లకు రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ గ్రూపుల పేరుతో అక్రమంగా రుణాల సేకరణ ఏంత జరిగింది, వాటిపైన తీసుకున్న చర్యల వివరాలు కోరామన్నారు. దినకర్ తెలిపిన వివరాలివి.
వైస్ జగన్ ప్రభుత్వంలో 2019 -24 మధ్య గ్రామీణ ప్రాంత నకిలీ గ్రూపులతో 37.51 కోట్లు రూపాయిలు పక్కదారి పట్టగా, అందులో 10.65 కోట్లు రికవరీ చేసినట్టు, రికవరీ చేయవలసిన నిల్వ మొత్తం 26.86 కోట్లుగా లెక్కలు అధికారులు తెలిపారు. అనకాపల్లి జిల్లా అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం 6 గ్రామాలకు 53 గ్రూపులకు రుణాలలో 2.86 కోట్లు దుర్వినియోగంకాగా 22 లక్షలు రికవరీ అయింది. రికవరీ చేయవలసిన నిల్వ మొత్తం 2.65 కోట్లుగా లెక్కలు తేల్చారు. కానీ రాష్ట్రంలోని సెర్ప్ అధికారులు సమర్పించిన లెక్కలు అనకాపల్లి జిల్లా అధికారులు సమర్పించిన లెక్కల మధ్య అంతరం ఉన్న దృష్ట్యా, అన్ని జిల్లాల అధికారుల నుండి లెక్కలు తెప్పించి రాష్ట్రంలో సెర్ప్ అధికారుల వద్ద ఉన్న లెక్కలతో సరిపోల్చి సమాచారం ఇవ్వమని ఆదేశించారు. కాగా, ఈ సమావేశం నివేదికను దినకర్ సీఎం చంద్రబాబు నాయుడుకు అందించారు.