– మేనక నుంచి కవిత వరకూ..
( మార్తి సుబ్రహ్మణ్యం)
వ్యక్తుల ఇమేజ్‌పై నడిచే ప్రాంతీయ పార్టీలకు ఆ కుటుంబాలే చివరకు భారమవుతున్న అనుభవం దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బిడ్డ కవిత వంతు వచ్చింది.
బీఆర్ఎస్లో మూడుముక్కలాట మొదటినుంచీ నడుస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ రెక్కల కష్టంతో శూన్యం నుంచి అద్భుతాలు సృష్టించిన బీఆర్ఎస్కు, కర్త-కర్మ-క్రియ కేసీఆరేనన్నది నిష్ఠుర నిజం. ఉద్యమం జరుగుతుండగా కొడుకు కేటీఆర్ అమెరికాలో ఉద్యోగం చేసుకునే సమయంలో, కేసీఆర్‌కు బాసటగా నిలిచిన వ్యక్తి హరీష్‌రావు. పార్టీ అధినేత కేసీఆర్‌కు మేనల్లుడు. ఆయన కేసీఆర్ టీడీపీలో మంత్రిగా ఉన్నప్పటినుంచే కేసీఆర్ వద్ద పనిచేసేవారు.
నాటి నుంచి నేటి వరకూ కేసీఆర్ చేయి విడవకుండా ఆయనతో కలసి నడుస్తున్న హరీష్.. కేటీఆర్ రంగప్రవేశం చేయకముందు వరకూ పార్టీలో నెంబర్ టూగా ఉండేవారు. పార్టీలో అనేక సమస్యలు పరిష్కరించే ట్రబుల్ షూటర్ అవతారమెత్తారు. కేసీఆర్‌కు పార్టీ సమావేశాలు, కార్యాలయానికి ఎక్కువగా హాజరయ్యే అలవాటు లేదు. చివరకు పార్టీ వ్యవస్థాపక దినోత్సవం, పంద్రాగస్టున కూడా ఆయన గైర్హాజరీలో, సీనియర్ నేత నాయని నర్శింహారెడ్డి జెండా ఆవిష్కరించేవారు.
కేసీఆర్ సీఎం అయిన తర్వాత బేగంపేటలోని మంత్రుల క్వార్టర్స్‌ను కూల్చి, ప్రగతిభవన్ పేరిట ఖరీదైన బంగ్లా నిర్మించారు. అయినప్పటికీ, ఎక్కువగా ఫాంహౌస్‌లోనే గడిపేవారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు, నియోజవకవర్గ నాయకులు ఎక్కువగా మంత్రి కేటీఆర్‌ను కలిసేవారు. ఆ క్రమంలో హరీష్‌రావు ప్రాధాన్యం తగ్గించేశారు. చివరకు పార్టీ పత్రికలోనూ ఆయనకు ప్రాధాన్యం ఇవ్వలేదు.
కేటీఆర్ హవా సాగుతున్న సమయంలో, కేసీఆర్ కుమార్తె కవిత రంగ ప్రవేశంతో కుటుంబరాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి. ఆమెకు రాజ్యసభ, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టారు. ఆ క్రమంలో కవిత కూడా ఒక పవర్ సెంటర్‌గా మారడంతో, పార్టీ-ప్రభుత్వంలో మూడుస్తంభాలాట మొదలయింది. కేటీఆర్, హరీష్ కంటే కవిత దూకుడుగా వెళ్లేవారు. ఆ దూకుడే ఆమెను లిక్కర్ కేసులో జైలుకు వెళ్లేలా చేసింది.
కవిత జైలుకు వెళ్లడంతో కేసీఆర్ మానసికంగా దెబ్బతినాల్సి వచ్చింది. ఆ మధ్య కాలంలో పార్టీ కార్యకలాపాలు కూడా మందగించాయి. తర్వాత కోలుకుని ఎదురుదాడి ప్రారంభించారు. అది వేరే విషయం. కవిత అరెస్టు, జైలు పరిణామాలతో పార్టీ ఇమేజీ భారీగా డామేజీ అయింది. బెయిల్‌పై బయటకొచ్చిన కవిత హటాత్తుగా తన సొంత దారిలో పయనించి, పార్టీకి ఇబ్బంది కలిగించే నిర్ణయాలు తీసుకోవడం, తెలంగాణ జాగృతి పేరుతో సొంత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం, మీ చుట్టూ ద్రోహులున్నారంటూ తండ్రికి రాసిన లేఖ లీకవడం, సింగరేణిలో పార్టీ వైఖరికి భిన్నంగా వ్యవహరించడం, చివరకు కాళేశ్వరం అవినీతికి హరీష్‌రావు, సంతోష్‌రావు బాధ్యుడంటూ, కాంగ్రెస్ ప్రభత్వం చేసిన ఆరోపణలను ధృవీకరించడంతో కవిత ధిక్కారపర్వం పరాకాష్ఠకు చేరినట్లయింది.
దీనితో ముందు పార్టీకి చెందిన సోషల్‌మీడియా గ్రూపులనుంచి, కవిత పీఏల నెంబర్లను తొలగించింది. మరుసటిరోజు ఆమెను సస్పెండ్ చేసింది. కవిత ఆరోపించిన మాజీ ఎంపి సంతోష్‌రావు పార్టీ అధినేత కేసీఆర్‌కు స్వయంగా షడ్డకుడి కుమారుడే. కాగా ఈ పరిణామంతో పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కవిత.. సొంత పార్టీ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
దేశంలో తొలుత కుటుంబ రాజకీయాలు పరాకాష్టకు చేరి బయటకు వచ్చిన మహిళ మేనకాగాంధీ. దేశాన్ని సుదీర్ఘకాలం శాసించిన ఇందిరాగాంధీ కోడలయిన మేనక.. తన తోడికోడలు సోనియాతో విబేధించి, బయటకు వచ్చారు. ఆ తర్వాత సంజయ్ విచార్‌మంచ్ పార్టీ స్ధాపించారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన ఆమెకు కేంద్రమంత్రి పదవి కూడా దక్కింది. ఆమె కుమారుడు వరుణ్‌గాంధీ కూడా ఎంపీగా ఎన్నికయ్యారు.
తమిళనాడులో సీఎం ఎంజి రామచంద్రన్కూ కుటుంబపోటు తప్పలేదు. ఆయన సినిమా సహచరి జయలలితతో, భార్య జానకీ రామచంద్రన్ కు పొసగకపోవడం.. పార్టీ పెత్తనం జయలలిత చేతిలోకి వెళ్లే సమయంలో ఎంజీఆర్ మృతి చెందటం, జానకీ రామచంద్రన్ ప్రవేశంతో పార్టీ రోడ్డున పడింది. అయితే చివరకు అన్నాడిఎంకెను స్వాధీనం చేసుకున్న జయలలిత మృతి చెందేవరకూ పార్టీని శాసించారు.
ఇక తెలుగునాట తెలుగుదేశం కథ అందరికీ తెలిసిందే. టీడీపీని స్థాపించి, తన చరిష్మాతో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చింది ఎన్టీరామారావు అయినప్పటికీ, పార్టీని వ్యవస్థాగతంగా తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దింది మాత్రం ఆయన అల్లుడు చంద్రబాబునాయుడు మాత్రమేనన్నది నిష్ఠుర నిజం. మామపైనే పోటీ చేస్తానని చెప్పి, అప్పట్లో కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్న చంద్రబాబు టీడీపీ ప్రభంజనంలో ఓడిపోయిన తర్వాత టీడీపీలో చేరారు.
తన ప్రతిభ, చురుకుదనం, లౌక్యం, రాజనీతితో ఎన్టీఆర్ మనసుగెలిచిన చంద్రబాబు.. పార్టీ కార్యకర్తలకు గుర్తింపుకార్డులు, సభ్యత్వాలు, శిక్షణాశిబిరాలు, కంప్యూటరైజేషన్ వంటి వినూత్న కార్యక్రమాలకు తెరలేపారు. అప్పట్లో ఎన్టీఆర్ మరో అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా పార్టీలో చక్రం తిప్పేవారు. అయితే ఆయన చంద్రబాబునాయుడు అంత దూకుడు స్వభావం ఉన్నవారు కాదు. వ్యూహకర్త కాదు. ఫలితంగా ఎన్టీఆర్‌ను ఎవరు కలిసేందుకు వచ్చినా అల్లుడుగారిని కలవండి అని చెప్పేస్థాయికి చంద్రబాబు ఎదిగారు.
పార్టీ అభివృద్ధి కోసం బాబు కూడా అంతే కష్టపడేవారు. అసెంబ్లీలో కాంగ్రెస్‌పై ఎదురుదాడికి ఆయనే నాయకత్వం వహించేవారు. ఆ క్రమంలో టీడీపీలో బాబు నెంబర్‌టూ స్థాయికి ఎదిగారు. ఆ సమయంలో ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడంతో టీడీపీ కుటుంబ కథ కొత్త మలుపు తిరిగింది. పార్టీ-ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చే సుకోవడంతోపాటు, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులను పార్టీనుంచి సాగనంపేందుకు లక్ష్మీపార్వతి చేసిన ప్రయత్నాలు, చివరకు టీడీపీని చీలిపోయేందుకు కారణమయ్యాయి.
ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసిన సమయంలో ఆయన తన అల్లుడు చంద్రబాబును పార్టీ నుంచి బహిష్కరిస్తే, దానికి ప్రతిగా ఎమ్మెల్యేలంతా చంద్రబాబునాయుడు ఎమ్మెల్యేలు టీడీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఫలితంగా టీడీపీ కూడా చంద్రబాబు పరమయిపోయింది. అప్పుడు ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించుకోవడం ఎన్టీఆర్‌కు అనివార్యమయింది. ఆ సంక్షోభ సమయంలో ఎన్టీఆర్ పెద్దల్లుడు దగ్గుబాటి, కొడుకు హరికృష్ణ సైతం బాబుకు బాసటగా నిలిచారు.
తర్వాత హరికృష్ణకు మంత్రి పదవి ఇచ్చినప్పటికీ, ఆయన బాబుపై అసంతృప్తితో బయటకు వచ్చి, అన్న తెలుగుదేశం పెట్టుకున్నారు. తోడల్లుడు దగ్గుబాటి కూడా దూరమయ్యారు. ఆ తర్వాత దగ్గుబాటి తన తోడల్లుడు బాబుపై ఆరోపణలు చేయడంతోపాటు, తాను రాసిన పుస్తకంలోనూ బాబును విమర్శించారు.
అయితే తాజాగా ద గ్గుబాటి-బాబు కలసిన ఓ కార్యక్రమంలో గతాన్ని మర్చిపోవాలంటూ బాబును పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి మాత్రం జగన్ శిబిరంలో ఉంటూ బాబుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
ఏపీలో ఎన్టీఆర్ కుటుంబం మాదిరిగా వైఎస్ కుటుంబం కూడా చీలిపోయింది. తన అన్న జగన్ అరెస్టయిన తర్వాత వదిన భారతీ కోరిక మేరకు పాదయాత్ర చేసి, జగన్ అధికారంలోకి వచ్చేందుకు షర్మిల కారణమయ్యారు. అటు బావ బ్రదర్ అనిల్ కూడా క్రైస్తవులను వైసీపీ వైపు మళ్లించి జగన్ సీఎం అయ్యేందుకు ప్రధాన ప్రధాన పాత్ర పోషించారు.
తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత, భార్య ఒత్తిడి మేరకు అన్న కోసం పాదయాత్ర నిర్వహించిన షర్మిలను.. అన్న జగన్, వదిన పక్షం వహించి చెల్లి-తల్లిని విస్మరించారు. షర్మిల రాజ్యసభ సీటు అడిగితే వదిన అడ్డం పడి.. కుటుంబం నుంచి రాజకీయాల్లో ఒకరే ఉండాలన్న సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి, చెల్లి ఆశలకు గండికొట్టారు.
పోనీ కంపెనీల్లో ఏమైనా చెల్లికి జగన్ న్యాయం చేశారా అంటే అదీ లేదు. తన వాటా నుంచి చిల్లి గవ్వ కూడా ఇచ్చేది లేదంటూ ఎన్సీఎల్టీకి వెళ్లి, తల్లి-చెల్లిని నిర్దయగా కోర్టులో నిలబె ట్టారు. అంతకుముందు కడప వైసీపీ ఎంపీ అభ్యర్ధి అవినాష్‌రెడ్డికి ప్రత్యర్ధిగా, వివేకానందరెడ్డి బిడ్డ డాక్టర్ సునీతను షర్మిల నిలబె ట్టారు. ఆ ఎన్నికల్లో తన కొడుకు జగన్ పార్టీ అభ్యర్ధి అయిన అవినాష్‌రెడ్డికి కాకుండా, తన కూతురు నిలబెట్టిన సునీతను గెలిపించాలని వైఎస్ భార్య విజయలక్ష్మి ఒక వీడియో విడుదల చేసి, షర్మిల బిడ్డలు ఉన్న లండన్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం పీసీసీ చీఫ్‌గా ఉన్న షర్మిల తన అన్న జగన్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. జగన్ సీఎం అయిన మూడేళ్ల తర్వాత, తల్లి-చెల్లికి తాడేపల్లి పాలెస్ ద్వారాలు మూసుకుపోయాయి. ఎప్పుడయినా తల్లి… తన కొడుకును చూస్తుందంటే అది వైఎస్ సమాధి ఉన్న ఇడుపులపాయలోనే. తాజాగా అది కూడా లేదు. వైఎస్ సమాధి వద్ద ప్రార్ధనలు చేసిన తర్వాత జగన్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన విజయమ్మ వైపు, కొడుకు జగన్ కనీసం చూసి మాట్లాడకపోవడం సోషల్‌మీడియాలో రచ్చవుతోంది.
ఇక తమిళనాడులో డిఎంకె అధినేత, సీఎం కరుణానిధి బహు భార్యా బాధితుడు. ఆ క్రమంలో భార్యల సంతాన ం, వారి బంధువులు డిఎంకెపై పట్టు కోసం ప్రయత్నించారు. ప్రధానంగా స్టాలిన్ పెత్తనంపై తిరుగుబాటు జండా ఎగరేసిన కరుణానిధి మరో తనయుడు ఆళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఆళగిరికి రెండు జిల్లాల్లో పట్టు ఉండేది. అన్నాడిఎంకె అధినేత్రి జయలలిత నెచ్చలిగా ఉన్న శశికశను కూడా, జయలలిత మరణానంతరం పార్టీ నుంచి బహిష్కరించారు. జయలలిత బతికున్నప్పుడు అదే ఆన్నాడిఎంకె నేతలు శశికళను వంగి వంగి సలాములు కొట్టేవారు.
యుపిలో ములాయం సింగ్ సమీప బంధువు శివపాల్‌యాదవ్‌ను, ఆయన త నయుడు అఖిలేష్ యాదవ్ బహిష్కరించారు. బీహార్‌లో లాలూ కుటుంబసభ్యుడైన తేజ్ ప్రతాప్యాదవ్, యుపిలో అప్నాదళ్ నుంచి అనుప్రియపటేల్ను పార్టీ నుంచి బహిష్కరించారు.
కరుణానిధి మాదిరిగానే కర్నాటకలో మాజీ ప్రధాని దేవెగౌడ కూడా, బహుభార్యా బాధితుడే. దానితో కుమారస్వామిని ఎదిరించిన మరో కొడుకు రేవణ్ణను బహిష్కరించారు. దేవెగౌడ భార్యల తనయులు, కుమార్తెలు ప్రతి ఎన్నికల్లోనూ టికెట్ల కోసం రచ్చ చేసి, ఆయనకు తలనొప్పులు సృష్టిస్తుంటారు. హ ర్యానాలో చౌతాలా కుటుంబ సభ్యుడైన దుష్యంత్ చౌతాలా, మహారాష్ట్రంలో శివసేన థాకరే కుటుంబానికి చెందిన రాజ్‌థాకరే, శరద్‌పవార్ పార్టీని చీల్చి బీజేపీతోజతకట్టిన అజిత్ పవార్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఈ విధంగా దేశంలోని ప్రాంతీయ పార్టీలకు కొడుకుల నుంచో, కూతుళ్ల నుంచో, అలుళ్ల నుంచో, భార్యల నుంచో ప్రమాదం పొంచి వస్తూనే ఉంది.