Suryaa.co.in

Editorial

తెలంగాణలో ‘ఫ్యాన్‌’.. షి‘కారు’

– కేసీఆర్‌కే జైకొట్టిన వైసీపీ
– మళ్లీ బీఆర్‌ఎస్‌ రావాలన్న పోసాని మురళి
-పోసాని వ్యాఖ్యలు సొంతవా? పార్టీవా?
– ఇప్పటిదాకా ఖండించని వైసీపీ నాయకత్వం
– ఏపీ ఎఫ్‌డిసి చైర్మన్‌గా ఉన్న పోసాని
– కారెక్కితే సెటిలర్లు సేఫ్‌గా ఉంటారని కితాబు
– కేసీఆర్‌ పాలనలో వారిపై ఒక్క దాడి కూడా జరగలేదన్న ప్రశంస
– కేసీఆర్‌ను తెలంగాణ గాంధీ అని కితాబు
– పవన్‌ వ్యాఖ్యలపై పోసాని ఫైర్‌
– వైరల్‌ అవుతున్న పోసాని వీడియో
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ ఎన్నికల్లో అధికార బీఆర్‌ఎస్‌కు పక్క రాష్ట్ర అధికార పార్టీ దన్ను దొరికింది. వైసీపీ నేత, సినీ నటుడు, ఏపీఎఫ్‌డీసీ చైర్మన్‌ పోసాని మురళీకృష్ణ బీఆర్‌ఎస్‌ మళ్లీ గెలవాలని ఆకాంక్షి స్తూ విడుదల చేసిన వీడియో, గ్రేటర్‌లో బీఆర్‌ఎస్‌కు ఊరటనిచ్చింది. తెలంగాణ గాంధీ అంటూ కేసీఆర్‌ను పొగిడిన పోసాని వీడియో సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది. ఆ సందర్భంగా పోసాని.. జనసేన దళపతి పవన్‌ కల్యాణ్‌పై చేసిన విమర్శలు ఆసక్తికరంగా మారాయి.

రానున్న తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు, మరోసారి కేసీఆర్‌ను గెలిపించాలని వైసీపీ నేత పోసాని మురళీకృష్ణ ఇచ్చిన పిలుపుతో, బీఆర్‌ఎస్‌కు వైసీపీ నుంచి అధికారికంగానే మద్దతులభించినట్టయింది. ఈ ఎన్నికల్లో బీజేపీకి జనసేన మద్దతునిస్తుండగా, టీడీపీ మాత్రం ఎన్నికల బరి నుంచి నిష్ర్కమించింది. దానితో సెటిలర్ల ఓట్లు ఎవరికి పోలవుతాయన్న చర్చ ఆసక్తికరంగా సాగుతోంది.

చంద్ర బాబు అరెస్టు నేపథ్యంలో కమ్మవర్గం ఓట్లు, కాంగ్రెస్‌కు పోలవుతానయన్న ప్రచార నేపథ్యంలో.. అదే కమ్మ వర్గానికి చెందిన వైసీపీ నేత పోసాని తెరపైకొచ్చి, కేసీఆర్‌ను గెలిపించాలంటూ వీడియో విడుదల చేయడంతో, ఈ ఎన్నికల్లో వైసీపీ మద్దతు బీఆర్‌ఎస్‌కు లభించినట్లయింది. అయితే పోసాని పిలుపు కమ్మవర్గంపై ఎంత ప్రభావితం చేస్తాయన్నది చూడాలి.

నిజానికి వైసీపీ ఈ విషయంలో ఇప్పటిదాకా ఎలాంటి అధికార ప్రకటన చేయలేదు. కేసీఆర్‌తో జగన్‌కు అత్యంత సన్నిహిత సంబంధాలున్నప్పటికీ, ఈ ఎన్నికల్లో వైసీపీ ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. కర్నాటక ఎన్నికల్లో వైసీపీ నేతలు, ఒక సీనియర్‌ మంత్రి, పలువురు ఎమ్మెల్యేలు.. కర్నాటక సరిహద్దు జిల్లాలు, బెంగళూరు నగరంలో బీజేపీకి అనుకూల ప్రచారం నిర్వహించడం చర్చనీయాంశమైంది. తెలంగాణ ఎన్నికల్లో మాత్రం వైసీపీ నేతలు ఇంకా రహస్యంగా కూడా ప్రచారంలో ఉన్నట్లు కనిపించలేదు.

ఈ నేపథ్యంలో వైసీపీ నేత పోసాని రంగంలోకి దిగి, మరోసారి కేసీఆర్‌ ప్రభుత్వం రావాలంటూ వీడియో విడుదల చేశారు. అయితే దానిని వైసీపీ ఇంతవరకూ ఖండించలేదు. స్వాగతించలేదు. పోసాని వివరణ కోరలేదు. ఆ ప్రకారంగా వైసీపీ వ్యూహాత్మక మౌనం ప్రకారం.. బీఆర్‌ఎస్‌కు వైసీపీ మద్దతునిస్తున్నట్లుగా భావించక తప్పదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

కేసీఆర్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రా వాళ్ల మీద దాడులు జరుగుతాయన్న ప్రచారం చేశారని పోసాని గుర్తు చేశారు. ‘‘మరి ఇప్పటిదాకా ఒక్కరిపైనయినా ఒక్క రాయి వేశారా? నీ ఇంటి మీద గానీ, మీ అన్నయ్య ఇంటిమీద గానీ, అల్లు అరవింద్‌ ఇంటిపైగానీ ఒక్క రాయి వేశారా? అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటున్నారు కదా? మా కమ్లోళ్లను, మీ కాపులను గానీ ఇక్కడ ఉండవద్దని కేసీఆర్‌ ఎప్పుడైనా చెప్పారా? మీ రాజకీయ స్వార్ధం కోసం హైదరాబాద్‌లోని వాళ్లను ఎందుకు ప్రమాదంలో పడేస్తున్నావు’’ అంటూ పవన్‌పై, పోసాని విమర్శలు సంధించడం చర్చనీయాంశమయింది.

మరో మెట్టెక్కి, కేసీఆర్‌ను తెలంగాణ గాంధీగా అభివర్ణించడం సంచలనం సృష్టించింది. ‘ఆయన సరిహద్దుగాంధీ అయితే కేసీఆర్‌ తెలంగాణ గాంధీ’ అని కీర్తించారు. ఆంధ్రావారిని కేసీఆర్‌ బిడ్డల్లా చూసుకుంటున్నారని, ఇప్పటివరకూ తెలంగాణ వారి వల్ల నష్టపోయిన ఆంధ్రా బాధితులెవరైనా ఉన్నారా? కేసీఆర్‌ ఎవరిరైనా ఇక్కడినుంచి వెళ్లిపొమ్మనారా?’ అని ప్రశ్నించారు.

‘‘కేసీఆర్‌ ఏం పాపం చేశారు పవన్‌ కల్యాణ్‌? పది ఓట్ల కోసం ఏపీ-తెలంగాణకు ఫిట్టింగుపెట్టి, మీ కాపులను నమ్మించేందుకు అబద్ధాలు ఆడవద్దంటూ.. జనసేనాధిపతి పవన్‌కు పోసాని చేసిన హెచ్చరిక, సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. చంద్రబాబును ‘మగవగలాడి’గా అభివ ర్ణించిన పోసాని.. బాబుకు కులం-మతంలేదని, అధికారమే పరామవథి అని విమర్శించారు.

కేసీఆర్‌ను తెలంగాణ ఆత్మగా పొగిడి.. ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్‌ రావాలన్న పోసాని వ్యాఖ్యలపై ఇప్పటిదాకా వైసీపీ స్పందించకపోవడం గమనార్హం. అది పోసాని అభిప్రాయమా? వైసీపీ అభిప్రాయమా అన్నది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. సహజంగా అయితే ఆ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం. పార్టీతో సంబంధం లేదని రాజకీయ పార్టీలు ఒక్కోసారి తప్పించుకుంటాయి.

కానీ వైసీపీలో అలాంటి అవకాశం ఏమాత్రం ఉండదు. ఆ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు తావు ఉండదు. పార్టీకి సంబంధించిన ఏ విషయమైనా విజయసాయిరెడ్డి, లేదా సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే వెల్లడిస్తుంటారు. జగన్‌ అనుమతి మేరకు, ఆయనతో చర్చించిన తర్వాతనే ఏ అంశంపైనయినా స్పందిస్తారు. అందుకు విరుద్ధంగా మాట్లాడే వారిపై వేటు వేస్తారు. పార్టీ అధినేత-సీఎం జగన్‌ సైతం, ఎప్పుడూ పార్టీకి సంబంధించిన విషయాలు వెల్లడించిన దాఖలాలు లేవు.

మరి పోసాని విషయంలో అటు సజ్జల గానీ, ఇటు విజయసాయిరెడ్డి గానీ… వీరిద్దరూ కాకపోతే క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ గానీ ఇప్పటిదాకా స్పందించకపోవడ మే ఆశ్చర్యం. పోసాని చిన్న-సన్న కార్యకర్తేమీ కాదు. ఏపీఎఫ్‌డిసికి చైర్మన్‌. ఆయనను నియమించింది జగన్‌ అన్నది విస్మరించకూడదు. ఆ ప్రకారంగా వైసీపీ నాయకత్వ వ్యూహాత్మక మౌనం ప్రకారం.. కేసీఆర్‌ మళ్లీ రావాలన్న పోసాని వ్యాఖ్యలకు, జగన్‌ అనుమతి ఉందని అర్ధం చేసుకోకతప్పదని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

LEAVE A RESPONSE