Suryaa.co.in

Telangana

రైతు ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలు

-వరదలతో నష్టపోయిన రైతులకు భరోసా ఇవ్వని సర్కార్
-పంట నష్టాన్ని ఎందుకు అంచనా వేయడం లేదు?
-పంటల బీమా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వం
-పంట నష్టపరిహారం ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి
-సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

గోదావరి వరద ముంపుతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోకపోవడంతో అప్పుల పాలైన రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఇటీవల గోదావరి వరదలు పోటెత్తడంతో తెలంగాణలో సుమారుగా 13 లక్షల ఎకరాలకు పైగ పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, వరి, తదితర పంటలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు.

పంట నష్టం జరిగిన రైతులకు భరోసా ఇచ్చే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంతోనే రైతులు మానసిక స్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. నిర్మల్‌ జిల్లా ముధోలుకు చెందిన రైతు మంగారపు లక్ష్మణ్‌ అకాల వర్షాలతో తాను వేసిన పంట పూర్తిగా నీటి పాలు కావడంతో తీవ్రంగా నష్టపోయి, సాగు పెట్టుబడికి చేసిన అప్పులు తీర్చడానికి మార్గం లేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుందన్నారు. గోదావరి తీరం వెంబడి సాగు చేసిన రైతులు వరద ముంపు వల్ల తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రాకపోవడంతో నిర్మల్ జిల్లాలోని లక్ష్మణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు గానే మిగత రైతుల దుస్థితి తెలంగాణలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

గోదావరి వరదలు వచ్చి పంటలు మునిగిపోయి 15 రోజులు అవుతున్న ఇప్పటివరకు రైతులకు నష్టపరిహారం ఇస్తామని ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతోనే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు నష్టం జరిగినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో స్పందించి రైతులను ఆదుకునే వారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు.

పంట నష్టాన్ని ఎందుకు అంచనా వేయడం లేదు?
గోదావరి వరదలు ముంచ్చేత్తడంతో పాటు అకాల వర్షాలకు తెలంగాణలో జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వం క్షేత్రస్థాయిలోకి అధికారులు పంపించి ఎందుకు అంచనా వేయడం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రభుత్వానికి సూచన చేసి పది రోజులు అవుతున్న పట్టించుకోకపోవడం కెసిఆర్ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకి నిదర్శనమని పేర్కొన్నారు. తెలంగాణలో ఆకస్మిక వరదల వల్ల జరిగిన పంట నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కేంద్రానికి నివేదిక ఇవ్వకపోవడం నిర్లక్ష్యమేనని మండిపడ్డారు.

వ్యవసాయ శాఖ అధికారులను తక్షణమే క్షేత్రస్థాయిలోకి పంపించి పంట నష్టపరిహారం అంచనా వేయించి నివేదికను కేంద్రానికి అందజేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, పంట నష్ట బీమా పథకం అమలు చేయకుండా రైతులను ఆగం చేయడం సరికాదన్నారు. పంటల బీమా పథకాన్ని కూడా వెంటనే ప్రభుత్వం అమలు చేసి రైతులను ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టం నుంచి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE