-బాధిత రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
-సీతారాంపురంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-రైతులకు భరోసానిస్తూ ఓదార్చిన మంత్రి దయాకర్ రావు
సీతారాంపురం (దేవరుప్పుల), మే 2ః ఆకాల వర్షాలు రైతులను ఆగం చేశాయని, అనేక మంది రైతులు పంటలు నష్టపోయారని, వారిని ఆదుకోవడానికే కేంద్రం కాదన్నా, వద్దన్నా, సిఎం కెసిఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని, ఇప్పుడు ధాన్యం కూడా తడవడం రైతులకు ఆశనిపాతంగా మారిందని, అయితే, నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తడిసిన ధాన్యం రైతులకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసానిచ్చారు.
దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో ఆకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని మంత్రి మంగళవారం పరిశీలించారు. రైతులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని లోతట్టు ప్రాంతంలో పెట్టడం పట్ల సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని, వచ్చిన ధాన్యాన్ని వెంట వెంట కొనుగోలు చేసి, గోదాములకు తరలించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.