రైతు పరిస్థితి దుర్భరం…
ఎడారుల్లా మారుతున్న పొలాలు…
కరువుతోనే రాయలసీమ జిల్లాల్లో వలసలు
ఎకరాకు రూ.లక్ష పంట నష్ట పరిహారం ఇవ్వాలి
– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
రైతుకు నష్ట పరిహారం, చిక్ బళ్లాపూర్ మ్రుతులకు రూ.25 లక్షల సాయం కోసం సీఎంకు లేఖ
విజయవాడ : రాష్ట్రంలో అన్నదాత పరిస్థితి దుర్భరంగా మారిందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ వదిలి పొలం బాట పట్టాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సూచించారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాలలోని కొన్ని ప్రాంతాల పొలాలు ఎడారిని తలపిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈమధ్య కాలంలో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు ప్రాంతాల్లో తాను పర్యటించిన సందర్భంగా రైతాంగం ఎదుర్కొంటున్న కష్టాలు చూసి తనకు కన్నీళ్లు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలూరు ప్రాంతంలో నాలుగున్నర ఎకరాల వేరు శనగ రైతు తనతో మాట్లాడుతూ… ఎకరాకు సుమారు రూ.40 వేలు పెట్టుబడి పెట్టినా చిల్లిగవ్వ చేతికందలేదని… వర్షాభావంతో పంట మొత్తం నష్టపోయినట్లు వెల్లడించాడని పీసీసీ అధ్యక్షులు తెలిపారు.
ఆలూరు ప్రాంతంలోనే సుమారు 20 మంది వరకు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఎకరాకు రూ.లక్ష పంట నష్ట పరిహారాన్ని రైతన్నలకు అందజేయాలని కాంగ్రెస్ పార్టీ తరుపున తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. సుమారు 40 లక్షల ఎకరాల్లో ఇంత వరకు సాగు వేయలేదన్న విషయాన్ని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
దేశానికే కాకుండా వ్యవసాయాధారిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అన్నదాత వెన్నుముక అని గుర్తు చేశారు. సీఎం ప్రజల్లోకి రావాలని ముఖ్యంగా రైతులను నేరుగా కలుసుకుని వారి కష్టాలు తెలుసుకోవాలని కోరారు. ఆత్మహత్యలకు పాల్పడకుండా అన్నదాతల్లో.. మనోధైర్యం నింపాలని విజ్నప్తి చేశారు.
చిక్ బళ్లాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన 13 మంది బాధిత కుటుంబీకులకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరుపున పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు సానుభూతి వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడిన తరుపున మరణించిన వారికి నష్ట పరిహారం ఇవ్వడానికి వారు అంగీకరించినట్లు తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మ్రుతుల కుటుంబాలకు రూ.25 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని, వారితో పాటు రైతులకు కూడా ఎకరానికి రూ.లక్ష పంట నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ ముఖ్యమంత్రికి రాసిన లేఖను ఆయన విడుదల చేశారు.
వైసీపీ ప్రభుత్వం చివరి దశలో అయినా.. రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం పని చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన విభజన చట్టంలోని ప్రత్యేక హాదా, రాయలసీమ లాంటి వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటివి అమలైతే… యువతకు ఇక్కడే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించేవని స్పష్టం చేశారు. వలసలు వెళ్లాల్సిన అవసరం ఉండేది కాదని చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కోరారు.