– నిరుద్యోగ సమస్యలపై బాబు ను కలిసిన నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్
అమరావతి: వైసీపీ అధికారంలోకి రాకముందు ఏటా 6,500 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదల చేయకుండా మోసం చేసిందని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిఖీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో 6500 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి అందులో 6100 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా కోర్టు వివాదాలను సృష్టించి వాటిని నిలిపివేసింది.
రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిసిన షేక్ సిద్దిక్.. త్వరితగతిన పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేసి, మెగా పోలీస్ నోటిఫికేషన్ ఇచ్చి పోలీస్ నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు. గ్రూప్ 2 మెయిన్స్ ను రెండు నెలలు వాయిదా వేయాలని, డిప్యూటీ డిఇఓ గ్రూప్ వన్ మెయిన్స్ కి 1:100 రేషియోలో ఎంపిక చేయాలని కోరారు. సీఎం చంద్రబాబు అందుకు సానుకూలంగా స్పందించినట్లు సిద్దిఖీ వెల్లండించారు.