సినిమాటోగ్రాఫ్ బిల్లుపై చర్చలో విజయసాయి రెడ్డి సూచన
న్యూఢిల్లీ, జూలై 27: చలన చిత్ర రంగంలో హీరోలకు చెల్లించే పారితోషకాలు కోట్లలో ఉంటే చిత్ర నిర్మాణం కోసం వివిధ విభాగాల్లో పనిచేసే కార్మికుల వేతనాలు మాత్రం అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ పరిస్థితులలో మార్పు తీసుకువచ్చి సినీ కార్మికుల కష్టానికి తగిన ఫలితం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు వి. విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు.
రాజ్యసభలో గురువారం సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని సవరించేందుకు ప్రవేశపెట్టిన బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ఆయన ఈ సూచన చేశారు. భారతీయ చలన చిత్ర రంగంలో వివిధ విభాగాల్లో రెండు లక్షల మందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. కాని చిత్ర నిర్మాణం వ్యయంలో మూడోవంతు బడ్జెట్ హీరోలు ఇతర అగ్రనటుల పారితోషకాలకే సరిపోతున్నాయి. ఉదాహరణకు టాప్ హీరో సల్మాన్ ఖాన్‌తో 400 కోట్ల వ్యయంతో నిర్మించే బాలీవుడ్ చిత్రంలో ఆయన పారితోషకమే 250 కోట్లని తెలుస్తోంది.
అదిపోగా మిగిలిన బడ్జెట్‌తోనే చిత్ర నిర్మాణం పూర్తి చేయాలి. చిత్ర నిర్మాణంలో రేయింబవళ్ళు కష్టపడే కార్మికులకు వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కడం లేదు. నిర్మాణ వ్యయంలో సింహభాగం పారితోషకం తీసుకుంటున్న హీరోలే నిజమైన లబ్దిదారులవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి సభలో సినిమాటోగ్రఫి మంత్రి అనురాగ్ ఠాకూర్‌కు సూచించారు.
అలాగే భారతీయ చిత్రపరిశ్రమను ఒక్కసారి పరిశీలిస్తే హీరోల కుమారులే హీరోలు అవుతున్నారు. కాని హీరోల కుమార్తెలు మాత్రం హీరోయిన్లు అవుతున్న ఉదంతాలు చాలా తక్కువ కనిపిస్తాయని అన్నారు. హీరోలు అయ్యే హీరోల కుమారులకంటే అందగాళ్ళయిన అబ్బాయిలు దేశంలో లెక్కకు మించి ఉన్న వారికి హీరోగా అవకాశాలు ఎందుకు దక్కడం లేదో అర్ధం కావడం లేదని అన్నారు.
భారత దేశ జనాభా 140 కోట్లతో చైనాను దాటి పోయింది. చైనాలో 80 వేల థియేటర్లు ఉంటే భారత్‌లో మాత్రం 8 వేల థియేటర్లు మాత్రమే ఉన్నాయని విజయసాయి రెడ్డి అన్నారు.
సినిమా అనేది సామాన్యుడికి చౌకగా లభించే వినోదం. దీనిని సామాన్యులందరికి అందుబాటులోకి తీసుకురావడానికి దేశంలో థియేటర్ల సంఖ్యను మరింత పెంచాల్సిన అవసరం ఉంది. అందుకోసం ప్రభుత్వం నుంచి కూడా తగిన ప్రోత్సాహం ఉండాలని ఆయన అన్నారు. ఒక చిత్రం నిర్మాణం పూర్తి చేసుకుని విజయవంతంగా సెన్సార్ సర్టిఫికెట్ పొందినదంటే ఆ చిత్ర లేదా దర్శకుడికి కేసుల నుంచి పూర్తిగా రక్షణ కల్పించినట్లే పరిగణించాలి.
సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ పొందిన చిత్ర నిర్మాత లేదా దర్శకుడిపై ఎలాంటి క్రిమినల్ కేసులు దాఖలు కాకుండా నిరోధించేలా సినిమాటోగ్రాఫ్ చట్టంలో సవరణ చేయాలని శ్రీ విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రైల్వే అప్రెంటీస్లకు న్యాయం చేయండి
నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ చేసిన తప్పిదం కారణంగా వందలాది కోర్సు కంప్లీటెడ్ అప్రెంటీస్ అభ్యర్ధులకు రైల్వే నియాకాలలో తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన ఈ అంశం లేవనెత్తూతూ మాట్లాడారు.
అప్రెంటీస్ పూర్తి చేసిన అభ్యర్ధులను రైల్వే గ్రూప్ డి విభాగంలో నియమిస్తుంది. ఆ మేరకు 1.03,769 ఖాళీలను భర్తీ చేయడానికి రైల్వే 2019 ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మొత్తం ఖాళీలలో 20 శాతం…అంటే 20,734 ఖాళీలు కోర్సు కంప్లీట్ చేసిన అప్రెంటీస్లకు రిజర్వ్ అయ్యాయి. 2017-18లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వందలాది మంది నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సివిటి) పరీక్షకు హాజరై నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్‌ను పొందారని విజయసాయి రెడ్డి తెలిపారు.
2019లో సార్వత్రిక ఎన్నికల కారణంగా ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలను నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఆ ఏడాది జూలైలో నిర్వహించింది. కానీ ఎన్‌సివిటి అభ్యర్ధులకు జారీ చేసిన సర్టిఫికెట్లలో మాత్రం వారు ఏప్రిల్ 2019లోనే అర్హత పొందినట్లుగా పేర్కొన్నది. రైల్వే గ్రూప్ డి ఉద్యోగాల నియామకం కోసం ఫిబ్రవరి 2022లో నోటిఫికేషన్ విడుదల చేస్తూ అప్రెంటీస్ సర్టిఫికెట్ పొందిన అభ్యర్దులకు శరీర ధారుడ్య పరీక్ష నుంచి మినహాయింపు ఇస్తూ ఆమేరకు కొన్ని మార్కులను అదనంగా ఇచ్చి వాటిని అప్లోడ్ చేయమని అప్రెంటీస్ అభ్యర్ధులకు సూచించింది. ఆ విధంగా అప్లోడ్ చేసిన అభ్యర్ధులు నియామకానికి అర్హులుగా రైల్వే నిర్ధారించిందని విజయసాయి రెడ్డి చెప్పారు.
ఆయా అభ్యర్ధులు నియామకం కోసం విధించిన 12 ఏప్రిల్ 2019లోగా ఎన్‌సివిటి పరీక్షకు హాజరు కాలేదన్న సాకుతో వారి నియామకాన్ని రైల్వే పెండింగ్‌లో పెట్టిందని విజయసాయి రెడ్డి చెప్పారు. సార్వత్రిక ఎన్నికల కారణంగా డైరెక్టర్ జనరల్ ట్రైనింగ్ అప్రెంటీస్ పరీక్షను 2019 జూలై నిర్వహించినప్పటికీ అభ్యర్ధులు ఏప్రిల్‌లోనే పరీక్ష ఉత్తీర్ణులైనట్లుగా పేర్కొంటూ సర్టిఫికెట్లు జారీ చేసింది.
ఈ వాస్తవాన్ని రైల్వే పరిగణలోకి తీసుకోకపోగా కట్ ఆఫ్ డేట్ తర్వాత నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన 108వ బ్యాచ్ అభ్యర్ధులకు నియామక పత్రాలు జారీ చేసిందని ఆయన అన్నారు. తమ తప్పు ఎంతమాత్రం లేని 109వ బ్యాచ్ కోర్స్ కంప్లీటెడ్ అప్రెంటీస్ అభ్యర్ధులకు నియామక పత్రాలు జారీ చేయడానికి రైల్వే నిరాకరిస్తోంది.
ఈ పరిస్థితుల నేపధ్యంలో వందలాది మంది అభ్యర్ధుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని అన్నారు. వీరి కేసును మానవతాదక్పధంతో పరిశీలించి నాలుగేళ్ళుగా నియామకం కోసం ఎదురు చూస్తున్న అభ్యర్ధులకు న్యాయం చేయవలసిందిగా విజయసాయి రెడ్డి రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అణు రియాక్టర్ల కోసం అమెరికన్ కంపెనీతో చర్చలు
దేశంలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు నిర్మించేందుకు అమెరికన్ కంపెనీతో చర్చలు జరుపుతున్నట్లు పీఎంవో మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్సీపీ సభ్యులు శ్రీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. భారత్-ఫ్రాన్స్ దేశాల మధ్య అణుశక్తి సహకారంపై 2008లో జరిగిన పరస్పర ప్రభుత్వ ఒప్పందానికి అనుగుణంగా మహారాష్ట్రలోని జైతాపూర్‌లో ఒక్కొక్కటి 1650 మెగావాట్ల సామర్ద్యంతో ఆరు అణు విద్యుత్ రియాక్టర్ల ఏర్పాటు కోసం ఫ్రాన్స్‌కు చెందిన ఈడీఎఫ్ కంపెనీతో 2018లో వే ఫార్వర్డ్ అగ్రిమెంట్ జరిగిందని తెలిపారు. ఈడీఎఫ్ కంపెనీ సమర్పించిన టెక్నో కమర్షియల్ ఆఫర్‌పై ప్రస్తుతం విస్తృతంగా చర్చలు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. ప్రాజెక్టు ప్రపోజల్ ఖరారై, ప్రభుత్వం ఆమోదం తెలిపిన అనంతరం ప్రాజెక్టు షెడ్యూల్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలుస్తాయని మంత్రి అన్నారు.
రాబోయేకాలంలో శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించి అణుశక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలన్న ఒత్తిడి మొత్తం ప్రపంచ దేశాలన్నింటిపైనా ఉందని అన్నారు. విద్యుత్ ఉత్పత్తికి అణుశక్తి అత్యంత స్వచ్ఛమైన ఆశాజనకమైన శక్తిగా పరిగణింపబడుతోందని మంత్రి తెలిపారు. పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు స్థాపించేందుకు అనువుగా లేని ప్రదేశాల్లో చిన్న మాడ్యులర్ రియాక్టర్లు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడం ద్వారా తక్కువ కార్బన్ కాలుష్యంతో పెద్ద ఎత్తున విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చని తెలిపారు. శిలాజ ఇంధన వినియోగానికి స్వస్తి పలికేందుకు కాలంచెల్లిన శిలాజ ఇంధన ఆధారిత పవర్ ప్లాంట్లుకు పునః ప్రయోజనం చేకూర్చేందుకు చిన్న మాడ్యులర్ రియాక్టర్లు ఏర్పాటు చేసి నిర్వహించవచ్చని అన్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై విధానపరమైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు.