– సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు
బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చేపడుతున్న పధకాలు క్షేత్ర స్ధాయిలో ఫలితాలను అందించేలా కృషి చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు అన్నారు. ముఖ్యమంత్రి ఆలోచనల మేరకు ప్రతి ఒక్క అధికారి పనిచేయాలని అప్పుడే ఆశించిన లక్ష్యాలను సాధించగలుగుతామని వివరించారు.
సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా గురువారం సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించిన చంద్రుడు, అనంతరం ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విభాగాధిపతులకు పలు ఆదేశాలు జారీ చేస్తూ, జగనన్న విద్యాదీవెన పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎస్ సిల ఉన్నతికి విద్య మాత్రమే బాటలు వేయగలదని, ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి ఈ పధకం అమలు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని వివరించారు. చేదోడు పథకం కింద మంగలి, చాకలి, దర్జీ వృత్తులలో ఉన్న షేడ్యూలు కులాలకు ఆర్ధిక సహాయం అందించాలన్నారు.
షెడ్యూల్డ్ కులస్తులు ఏ వృత్తులలో ఉన్నప్పటికీ వారి అర్హతను అనుసరించి పధకాలు అందేలా మండల స్ధాయిలో కృషి జరగాలన్నారు. జగనన్న విద్యా దీవన పథకం కింద 3వ త్రైమాసిక రుసుము విడుదల అంశాన్ని తల్లులందరికీ తెలియజేయాలని ఆదేశించారు. కళాశాలలకు సంబంధించి మూడవ త్రైమాసిక
ఫీజులపై వచ్చిన ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. 2021 – 22 విద్యా సంవత్సరానికి సంబంధించి నూతన, పునరుద్ధరణ దరఖాస్తుల నమోదు స్థితిపై నివేదిక సిద్దం చేయాలని గంధం చంద్రుడు స్పష్టం చేసారు. ఈ సమీక్షా సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు హర్హవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న గంధం చంద్రుడు ఇటీవల జరిగిన సాధారణ బదిలీలలో సాంఘిక సంక్షేమ శాఖకు వచ్చారు.