– ఢిల్లీలో కేంద్ర గిరిజనాభివృద్ది శాఖమంత్రి జుయల్ ఓరమ్‌ను కలిసిన ఎంపీ వేమిరెడ్డి
– సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఎంపీ పర్యటన
– ఇటీవల కేంద్రమంత్రి సూచనతో ఏకలవ్య పాఠశాలను సందర్శించిన ఎంపీ
– అనేక సమస్యలపై కేంద్రమంత్రికి సవివర నివేదిక
– ఆదర్శపాఠశాలగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి
– తప్పకుండా విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి జుయల్ ఓరమ్ హామీ
– ఫలించిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కృషి
జిల్లాకు ఎంతో ప్రత్యేకమైన ఏకలవ్య పాఠశాలలో తిష్ట వేసిన అనేక సమస్యలను తక్షణమే పరిష్కరించి గిరిజనాభివృద్ధికి బాటలు వేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జుయల్ ఓరమ్ ని కోరారు. ఇటీవల కేంద్రమంత్రి జుయల్ ఓరమ్ సూచన మేరకు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి నెల్లూరులోని కొడవలూరు మండలం చంద్రశేఖరపురంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించి అక్కడ ఏళ్లుగా పేరుకుపోయిన సమస్యలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారికి కావాల్సిన వసతులను తెలుసుకున్నారు. ఈ సమస్యలను తప్పకుండా కేంద్రమంత్రి జుయల్ ఓరమ్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని నాడు ఎంపీ స్పష్టం చేశారు.
అనుకున్నదే తడవుగా గురువారం ఢిల్లీ వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి జుయల్ ఓరమ్ ని ఆయన కార్యాలయంలో కలిసి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏకలవ్య పాఠశాలలో ఉన్న సమస్యలపై కేంద్రమంత్రికి సవివర నివేదికను అందించారు. పాఠశాలలో తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.
పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోందని, తెలుగు తెలసిన వ్యక్తులను నియమిస్తే విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్రమంత్రికి వివరించారు. ఆయా విభాగాలకు పర్మనెంట్ స్టాఫ్‌ను నియమించాలని కోరారు. అలాగే నాన్ టీచింగ్ స్టాఫ్ సరిపడా లేకపోవడంతో ఉన్నవారిపై ఒత్తిడి అధికంగా ఉందని, అకౌంటెంట్ దగ్గరి నుంచి స్వీపర్ల వరకు వెంటనే నియమించాల్సిన అవసరం ఉందన్నారు.
గత ఐదు సంవత్సరాలుగా ఆగిపోయిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే పూర్తి చేయించి విద్యార్థులను మేలు చేయాలని కోరారు. విద్యార్థులకు డైనింగ్ హాలు లేకపోవడంతో చెట్ల కిందే భోజనాలు చేస్తున్నారని, నిర్మాణం పూర్తయిన డైనింగ్ హాలు వెంటనే ప్రారంభం అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హాస్టల్ చాలా చోట్ల దెబ్బతిందని, వెంటనే కిటికీలు, ఇతర నిర్మాణాలు పూర్తి చేస్తే మేలు జరుగుతుందని చెప్పారు. అలాగే ఏదైనా ఎమర్జెన్సీ సమయాల్లో విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఒక వాహనం కూడా ఏర్పాటు చేయించాలని కోరారు. దాంతోపాటు పాఠశాల ఆవరణ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్ పలుచోట్ల ధ్వంసమైందని, వెంటనే దానికి మరమ్మతులు చేపట్టాలని వివరించారు.
ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన సమస్యలపై కేంద్రమంత్రి జుయల్ ఓరమ్ సానుకూలంగా స్పందించారు. అనేక సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఎంపీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఎంపీ తెలిపిన ప్రతి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. ఏకలవ్య పాఠశాలను ఆదర్శపాఠశాలగా తీర్చిదిద్దేందుకు తప్పకుండా కృషి చేస్తామని, గిరిజనాభివృద్దికి పాటుపడతామని ఆయన పేర్కొన్నారు.