Suryaa.co.in

Andhra Pradesh

మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

– మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం: సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు.

మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన ట్రాన్స్ఫాండర్లను మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన యజమానులకు అందిస్తున్నామని, రాబోయే రోజుల్లో మిగిలిన అందరికీ ఈ పరికరాలను అందిస్తామన్నారు.

ఈ పరికరం బోట్లకు అమర్చడం ద్వారా అనుకోని పరిస్థితుల్లో బోటు ఆగిపోయిన లేదా తప్పిపోయినా బోట్లను గుర్తించడానికి ఈ పరికరం ఎంతో ఉపయోగపడుతుందని, బోటు యజమానులతో సమాచారం ఇచ్చిపుచ్చుకోవటానికి సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా ఈ పరికరం సముద్రంలోని మత్స్య సంపద లభ్యతను గుర్తించేందుకు సైతం సహాయపడుతుందన్నారు.

మత్స్యకారుల ఇబ్బందులను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని శాటిలైట్ విధానములో పనిచేసే దాదాపు రూ.37 వేల విలువైన ట్రాన్స్పాండర్ పరికరం 60 శాతం కేంద్ర ప్రభుత్వం, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి లబ్ధిదారులకు పూర్తి సబ్సిడీతో ఉచితంగా అందిస్తుందన్నారు.

గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారులకు వలలుగాని, బోట్లు గాని ఎలాంటి సహాయం అందించలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమ అభివృద్ధికి కృషి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యం అందిస్తున్నది మత్సశాఖ ద్వారానే అని, దాన్ని బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు.

మత్స్యకారులు జీవనోపాధికి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కామన్ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అదేవిధంగా త్వరలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి అందిస్తామని, 50 సంవత్సరాలు దాటిన మత్స్యకారులకు పింఛన్లు అందిస్తామన్నారు.

LEAVE A RESPONSE