– ఆ ఐదు డీఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలి
– రెండున్నరేండ్లు కావొస్తున్నా పీఆర్సీ లేదు
– ఐఆర్ పెంచి ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తారా?
– రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా ? లేక మనసు లేదా?
– అసెంబ్లీలో ఉద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని నిలదీసిన మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి నా ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఏకంగా ఐదు డీఏలు పెండింగ్ లో పెట్టారు. ఆ ఐదు డీఏలు ఎప్పట్లోగా చెల్లిస్తారో మంత్రి సూటిగా సమాధానం చెప్పాలి.
పీఆర్సీ కమిటీకి మార్చి 31, 2026 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ గడువు ముగియడానికి ఇంకో వారం, ఎనిమిది రోజులు మాత్రమే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోగా కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావొస్తున్నా పీఆర్సీ లేదు. మళ్లీ ఎక్స్టెన్షన్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్ట్ తీసుకుని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారో స్పష్టంగా చెప్పాలి.
గతంలో కేసీఆర్ ఐఆర్ ఇచ్చి ఆదుకున్నారు. మీరైనా ఐఆర్ పెంచి ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తారా? 30, 35 ఏళ్ల పాటు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగుల వెతలు అంతా ఇంతా కాదు. జీవిత చరమాంకంలో వైద్యం అందక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయ్యారు? వాళ్లకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఎంత? ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత చెల్లించింది? మిగతా బకాయిలు ఎప్పట్లోగా పూర్తిగా చెల్లిస్తారో మంత్రి చెప్పాలి.
రిటైర్ అయిన తర్వాత ప్రశాంతంగా జీవితం గడపాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు.. తమ బకాయిల కోసం సెక్రటేరియట్ చుట్టూ, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ పాపం రోజూ తిరుగుతున్నారు. ఇవాళ రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిటైర్డ్ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వడానికి మీ దగ్గర నిధులు లేవా ?లేక మనసు లేదా? నాకైతే అర్థం కావడం లేదు.
ఫ్యూచర్ సిటీకి లక్ష కోట్లు ఉన్నాయి అంటారు. మూసీకి లక్ష కోట్లు ఉన్నాయి అంటారు. అందాల పోటీలకు, ఫుట్ బాల్ షోలకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు భట్టి మూడో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు వాటన్నిటికీ డబ్బులు ఉంటాయి కానీ.. ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు డబ్బులు లేవంటారు.