Suryaa.co.in

Andhra Pradesh

నడక మార్గంలో ఇంకా ఐదు చిరుతలు

నడక మార్గంలో చిరుత, ఎలుగు బంటిలు
వ్యర్థ పదార్ధాల కారణంగానే నడక మార్గంలో జంతు సంచారం
నడకమార్గంలో 500 కెమెరా ట్రాప్‌ల ఏర్పాటు
అలిపిరి నడకమార్గంలో వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్‌
సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి

తిరుమల: గత రెండు మాసాల్లో అలిపిరి కాలిబాట మార్గంలో రెండు దురదృష్టకర ఘటనలు జరిగాయని సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన నడకమార్గంలో గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగాయని చెప్పారు. రెండు నెలలుగా అలిపిరి నడకమార్గంలో నిఘా పెంచామని.. త్వరలోనే అలిపిరి నడకమార్గంలో వైల్డ్ లైఫ్ మానిటరింగ్ సెల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.

ట్రాప్ కెమెరాల ద్వారా నడక మార్గంలో చిరుత, ఎలుగు బంటిలు సంచరించడాన్ని గుర్తించామన్నారు. ఇప్పటికే ఐదు చిరుతలను బంధించామని.. ఇంకా ఐదు చిరుతలు సంచరిస్తునట్లు గుర్తించామని చెప్పారు.

వ్యర్థ పదార్ధాల కారణంగానే నడక మార్గంలో జంతు సంచారం పెరిగిందన్నారు. కాలిబాట మార్గంలో ఇరువైపులా 20 మీటర్ల మేర అటవీ ప్రాంతాన్ని చదును చేశామన్నారు. తద్వారా జంతువుల సంచారాన్ని భక్తులు ముందుగానే గుర్తించి అప్రమత్తం అవుతారన్నారు.

త్వరలోనే అత్యధునాతన టెక్నాలజీతో ఉన్న 500 కెమెరా ట్రాప్‌లను నడకమార్గంలో ఏర్పాటు చేస్తామన్నారు. 130 మంది అటవీ సిబ్బందితో నడకమార్గంలో నిఘా ఉంచామన్నారు. ఘాట్ రోడ్డు, నడక మార్గంలో పలు చోట్ల అండర్ పాస్, ఓవర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని తెలిపారు. నడక, ఘాట్ రోడ్డుల్లో ఆంక్షలు కొనసాగుతాయని సీసీఎఫ్ మధు సూదన్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE