Suryaa.co.in

Editorial

రోడ్లపై దృష్టి

  • ముఖ్యమైన రోడ్లకు వెంటనే మోక్షం

  • టోల్ నిర్మాణాలపై టీడీపీలో చర్చ

  • కారు,బస్సులు మినహా అన్నింటికీ టోల్ ఉండదు

  • సౌకర్యంగా ఉంటే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తారన్న బాబు

  • పల్లా ఆందోళనను కొట్టిపారేసిన చంద్రబాబు

  • జనాభా నియంత్రణపై ఆసక్తికరమైన చర్చ

  • కేంద్రనిధులు తగ్గుతాయన్న యనమల, సోమిరెడ్డి

  • ఉత్తరాది-దక్షిణాది మధ్య అంతరాలను వివరించిన యనమల

  • పేదరిక నిర్మూలనపై ఆసక్తికరమైన చర్చ

  • గిరిజనుల నిరక్షరాస్యతపై దృష్టి సారించాలన్న సోమిరెడ్డి

  • జిల్లాల్లో పార్టీ ఆఫీసులకు ప్రభుత్వభూములివ్వాలని కోరిన పల్లా

  • జాబితా తయారుచేయాలని సూచించిన చంద్రబాబు

  • త్వరలో పార్టీ సభ్యత్వాలు.. యాప్ ద్వారా నమోదు

  • ఇన్సూరెన్సు పథకం ఉంటుందన్న లోకేష్

  • తొలిదశ నామినేటెడ్ పదవుల జాబితా సిద్ధం

  • కూటమికీ న్యాయం చేయాలన్న చంద్రబాబు

  • కొత్తవారిని పార్టీలో చేర్చుకోవాలని సీనియర్లకు సూచన

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో గత ఐదేళ్ల జగన్ పాలనలో ధ్వంసమయిన రోడ్లపై దృష్టి సారించాలని టీడీపీ నిర్ణయించింది. ఆ మేరకు ధ్వంసమైన రోడ్ల స్థాయిని గుర్తించి, అందులో ముఖ్యమైన రోడ్లను తక్షణమే నిర్మించేందుకు కూటమి సర్కారు సిద్ధమవుతోంది. జాతీయ రహదారుల్లోని పట్టణాలు-నగరాల్లో టోల్‌గేట్ల ఏర్పాటుద్వారా, కొత్త రోడ్లు వేయాలని నిర్ణయింంచింది. ఆ మేరకు మంగళగిరిలోని టీడీపీ ఆఫీసులో జరిగిన పోలిట్‌బ్యూరో సమావేశంలో, సీఎం చంద్రబాబునాయుడుకు సీనియర్ సభ్యులు కొన్ని సూచనలు చేశారు.

అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం.. పొలిట్‌బ్యూరో సమావేశంలో రాష్ట్రంలో రోడ్ల నిర్మాణంపై చర్చ జరిగింది. తక్షణం రోడ్లు వేయాల్సిన అవసరాన్ని బాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఆ క్రమంలో టోల్‌గేట్ నిర్మాణాల అంశం ప్రస్తావనకు వచ్చింది. అయితే టోల్‌గేట్లు నిర్మించి డబ్బు వసూలు చేస్తే, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసయాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.

దానికి స్పందించిన చంద్రబాబు.. ‘మనం ప్రజలకు సౌకర్యం కల్పిస్తున్నాం. వాళ్లు రోడ్లు నిర్మించి టూవీలర్, ట్రాక్టర్లు మినహా కార్లు-బస్సుల నుంచి టోల్ వసూలు చేస్తే సామాన్యులపై ఎలా భారం పడుతుంది? మనం మంచి పనులు చేస్తే ప్రజలు అభినందిస్తారు కదా’ అని చంద్రబాబు పార్టీ అధ్యక్షుడు పల్లా ఆందోళన కొట్టిపారేశారు.

జిల్లాల్లో పార్టీ ఆఫీసు లేని చోట్ల, ఆఫీసు నిర్మాణం కోసం ప్రభుత్వ భూములు కేటాయించాలని పల్లా సూచించారు. దానికి స్పందించిన చంద్రబాబు ఎక్కడ అవసరం ఉందో గుర్తించి, దరఖాస్తు చేయమని సూచించారు.

ఇక పేదరిక నిర్మూలన అంశంపై జరిగిన చర్చలో, జనాభా పెరుగుదలపై ఆసక్తికరమైన చర్చ జరిగింది. గతంలో మనం జనాభా పెంచాలని పిలుపునిచ్చామని, కానీ ఇప్పుడు నియోజకవర్గ డీలిమిటేషన్ నేపథ్యంలో జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రాలు దెబ్బతినే ప్రమాదం వచ్చిందని.. మాజీ మంత్రులు యనమల, సోమిరెడ్డి పోలిట్‌బ్యూరో సభ్యులకు వివరించారు. ఈ ప్రకియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలు లాభపడుతుండగా, ద క్షిణాది రాష్ట్రాలు దారుణంగా నష్టపోతాయని వివరించారు. జనాభా ప్రాతిపదిక ఆధారంగా నిధులు ఇవ్వడం వల్ల, రాష్ట్రాలకు నిధులు గణనీయంగా దెబ్బతినే ప్రమాదం ఉందని వివరించారు.

ఈ సందర్భంగా మనం సింగపూర్ విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలని యనమల సూచించారు. అసలు ఏమీ ఉత్పత్తి కాని సింగపూర్.. కేవలం ఒకే ఒక్క నాయకుడి విజన్-ఆలోచన వల్ల ప్రపంచంలో టాప్-5 దేశంగా ఎదిగిందని ఉదహరించారు.

తర్వాత పేదరిక నిర్మూలన అంశంపై మాట్లాడిన సోమిరెడ్డి.. పేదరిక – నిరక్షరాస్యత నిర్మూలనపై దృష్టి సారించడం మంచిదే అయినప్పటికీ, ఆ కార్యక్రమాన్ని గిరిజన ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడ ం అవసరమని సోమిరెడ్డి సూచించారు. గిరిజనుల నిరక్షరాస్యత – అమాయకత్వం వల్ల దోపిడీ అక్కడే ఎక్కువగా జరుగుతోందని, అందుకే గత ప్రభుత్వంలో నెల్లూరుకు తాను ఐటిడిఏ తీసుకువచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తాను ఇప్పటికే ఒక గ్రామం దత్తత తీసుకున్నామని, మరో గ్రామం దత్తత తీసుకోనున్నట్లు బాబుకు వివరించారు.

ఇక పార్టీ సభ్యత్వాలపై మంత్రి లోకేష్ సభ్యులకు వివరించారు. త్వరలో పార్టీ సభ్యత్వాలు చేపడుతున్నామని, వంద రూపాయల సభ్యత్యంతో యాప్ ద్వారా సభ్యత్వం పొందే సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. వారికి జీవితబీమా సౌకర్యం కూడా కల్పిస్తున్నామన్నారు.

అతి త్వరలో నామినేటెడ్ పదవుల పంపిణీ తొలి దశ ప్రక్రియ ప్రారంభం అవుతుందని, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు. కూటమిలోని పార్టీలకూ న్యాయం చేయాల్సి ఉన్నందున, సర్దుకుపోవలసిన అవసరం ఉందన్నారు. ఆ మేరకు కసరత్తు పూర్తి చేశామని, అతిత్వరలో ఆ జాబితా వెల్లడిస్తామన్నారు. ఇక కొత్తగా పార్టీలో చేరాలనుకునేవారిని చేర్పించుకోవాలని సూచించారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో, వైసీపీ నుంచి వస్తున్న వారిని చేర్చుకోవాలన్నారు.

LEAVE A RESPONSE