– రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై త్వరలో బ్లూప్రింట్
– మే 15 కే నారుమళ్లకు నీళ్లిచ్చేలా ప్రణాళిక
– నీటి భద్రతపై దీర్ఘకాలిక విజన్ కూటమి ప్రభుత్వానిది
– వెలిగొండకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి గత పాలకుల క్రెడిట్ చోరీ
– సాగునీటి రంగంపై చర్చ సందర్భంగా శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి: రాష్ట్రంలో ప్రతీ ఎకరాకూ నీరందించి తెలుగు తల్లికి జలహారతి ఇవ్వటమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేసే అంశంపై త్వరలోనే బ్లూ ప్రింట్ తయారు చేస్తామని శాసనసభలో వెల్లడించారు. సాగునీటి రంగానికి బడ్జెట్ కేటాయింపులపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రసంగించారు. 2047 స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా పదిసూత్రాలను రూపొందించుకుని నీటి భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆయన అన్నారు. పరిశ్రమలు, పెట్టుబడులు రావాలన్నా నీటి భద్రత అత్యంత కీలకమని ఆయన వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది గోదావరి, మరుసటి ఏడాదిలో కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత కూటమి ప్రభుత్వానికి వచ్చిందని అన్నారు. ప్రకృతిని, నదులు, నీటి వనరులను ఆరాధించే సంస్కృతి ఉన్న నేపథ్యంలో గోదావరి నదికి అఖండ హారతిని, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరులుగా భావించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని సీఎం అన్నారు. ప్రతీ ఏటా గోదావరి నది నుంచి సగటున 3 వేల టీఎంసీల వరద నీరు వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు.
అందుకే రాష్ట్రంలోని వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలోని నదులను అనుసంధానిస్తే నీటి సమస్యలు పరిష్కారం అవుతాయని ముఖ్యమంత్రి తెలిపారు. దేశంలోనూ గంగా- కావేరి నదుల అనుసంధానం జరగాలన్నది తన బలమైన ఆకాంక్ష అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. గతంలో వాజ్ పేయి ప్రభుత్వంలో గంగా- కావేరీ నదుల అనుసంధాన సాధ్యాసాధ్యాలపై చర్చలు జరిగాయన్నారు. అందుకే రాష్ట్రంలో నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
ప్రాజెక్టులన్నీ మా హయాంలో కట్టినవే..
2014-19 మధ్య సాగునీటి రంగానికి రూ.68 వేల కోట్ల వ్యయం చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గడచిన 20 నెలల్లో రూ.20 వేల కోట్లను ఈ రంగానికి వెచ్చించినట్టు తెలిపారు. 738 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువను విస్తరించి కుప్పంలో పరమసముద్రం చెరువు వరకూ నీటిని తీసుకెళ్లామని అన్నారు. మడకశిర వరకూ నీటిని తీసుకెళ్లి ఆ ప్రాంత వాసుల దాహార్తిని తీర్చామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టుల న్నీ టీడీపీ, కూటమి హయాంలో నిర్మించినవేనని సీఎం స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నామని అన్నారు.
ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్ అని సీఎం స్పష్టం చేశారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో 100 టీఎంసీలను రాయలసీమకు తరలించామని.. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారిందన్నారు. వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం, ప్రకాశం జిల్లా సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. 30 ఏళ్లకు ముందు ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని.. ఇప్పుడు ఈ ఏడాది జూలైలోనే మొదటి దశ పూర్తి చేసి నీళ్లు ఇస్తామని అన్నారు. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా రూ.2500 కోట్ల మేర వ్యయం చేయాల్సి ఉందని .. బుధవారమే రూ.456 కోట్ల వ్యయంతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసినట్టు వివరించారు.
వెలిగొండకు నీళ్లు రాకుండానే రిబ్బన్ కట్ చేసి క్రెడిట్ చోరీ చేసే ప్రయత్నం గత పాలకులు చేశారని ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారు. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో నీళ్లు పోశారని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపైనా గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని సీఎం ఆక్షేపించారు. రూ.2 వేల కోట్లతో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులన్నీ దశలవారీగా పూర్తి చేస్తామని వివరించారు. రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును విధ్వంసం చేసి.. డయాఫ్రాం వాల్ ను గోదాట్లో కలిపేశారని సీఎం వ్యాఖ్యానించారు. మళ్లీ ఆ ప్రాజెక్టును పరుగులు పెట్టించి పుష్కరాలకంటే ముందే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. అలాగే చింతలపూడి ఎత్తిపోతలను పూర్తి చేసి ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని ఎగువ భూములకు నీరందేలా చర్యలు చేపడతామన్నారు.
ప్రాజెక్టుల్లో పుష్కలంగా నీరు
రాష్ట్రంలోని అన్ని చిన్నా పెద్ద రిజర్వాయర్లలో 1312 టీఎంసీల మేర నిల్వ చేసుకునే అవకాశం ఉందని ప్రస్తుతం 793 టీఎంసీల మేర నీటితో రిజర్వాయర్లు కళకళ లాడుతున్నాయని సీఎం అన్నారు. అందుకే పంట సీజన్ ను ముందుకు జరిపేలా మే 15 నాటికే నారుమళ్లకు నీరు ఇచ్చేలా ప్రణాళిక చేస్తున్నామన్నారు. దీనికి అనుగుణంగా స్థానిక ప్రజాప్రతినిధులంతా రైతులను చైతన్యవంతులను చేయాలని స్పష్టం చేశారు. 16 లక్షల హెక్టార్ల మైక్రో ఇరిగేషన్ తో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ఉందని ముఖ్యమంత్రి వివరించారు. నీటి నిర్వహణ నుంచి పొదుపు చేసే వరకూ వివిధ కార్యక్రమాలను రైతులతో కూడిన నీటి వినియోగదారుల సంఘాలకు అప్పగిస్తున్నామని సీఎం తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా భూగర్భజలాల పెంపునకు కూడా పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సగటున 7.3 మీటర్ల లోతున భూగర్భజలాలు ఉన్నాయని రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న జల సంరక్షణా చర్యల కారణంగా సగటున 6 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయన్నారు. తద్వారా చాలా ప్రాంతాల్లో విద్యుత్ మోటార్ల ద్వారా విద్యుత్ వినియోగం కూడా తగ్గిందని.. రూ 91 కోట్ల మేర విద్యుత్ కూడా ఆదా అయ్యిందని వివరించారు. నదులు పారే చివరి రాష్ట్రంగా ఏపీకి ఉండే నీటి భద్రత మరే రాష్ట్రానికీ లేదన్నారు. భూమినే జలాశయంగా మార్చి నీటి సంరక్షణ చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50 శాతం గ్రీన్ కవర్ పెంచాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని.. తిరుమలలో 89 శాతం మేర పచ్చదనం ఉందన్నారు.
పోలవరం-నల్లమల సాగర్ లింకు రెండు రాష్ట్రాలకూ లాభమే
పోలవరం – నల్లమల సాగర్ అనుసంధాన ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని.. పొరుగు రాష్ట్రం దీనిపై అభ్యంతరాలను తెలియచేయాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి శాసనసభలో వ్యాఖ్యానించారు. గోదావరి నుంచి వృధాగా సముద్రంలోకి వెళ్లే వరద జలాలను మాత్రమే తరలించేలా ఈ ప్రాజెక్టు చేపట్టామని అన్నారు. గోదావరిపై ఎగువ రాష్ట్రం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినా.. దీనికి తాము ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టుతో రెండు తెలుగు రాష్ట్రాలకూ మేలు జరుగుతుందన్నారు. గత పాలనలో గుండ్లకమ్మ గేట్లు కొట్టుకు పోతే వాటిని పెట్టేందుకు కూడా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదని.. పోలవరం డయాఫ్రాం వాల్ కొట్టుకు పోయినా దానిని గుర్తించలేని పరిస్థితి సీఎం ఎద్దేవా చేశారు.
తాను చేయని తప్పు కు అరెస్టు చేసిన తనను 53 రోజుల పాటు జైల్లో పెట్టారని సీఎం అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకూ నీరు ఇవ్వాలన్న లక్ష్యంతోనే పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. నీటి భద్రతను ప్రతీ ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కొందరు రాజకీయం కోసమే నీటి సమస్యల్ని తీసుకువస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతీ ఎకరాకు సాగునీరు, ప్రతీ ఇంటికీ సాగునీరు, పరిశ్రమలకు నీరు ఇచ్చేలా సంకల్పంతో పనిచేస్తున్నామని సీఎం స్పష్టం చేశారు.