– రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఒక ఆరోగ్యకరమైన పునాది
– మన బిడ్డలకు మనమే ‘బంగారు గిన్నె’లో విషం ఇచ్చి తాగమన్నట్టు ఉంటుంది
– మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి “క్లీన్ ఎన్విరాన్ మెంట్” మాత్రమే
– ‘గ్రిడ్’ పాలసీ పేరిట ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది
– బీజేపీ నాయకులు అప్పుడు ఎక్కడికెళ్లారు?
– హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ ఫార్మేషన్(హిల్ట్)పై శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు సుదీర్ఘ ప్రసంగం
– విపక్షాలపై వివరణాత్మక ఎదురుదాడి
హైదరాబాద్: ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి ప్రాథమిక హక్కులైన గాలిని, నీటిని, ఆహారాన్ని కూడా స్వచ్ఛంగా అందించలేని ఒక అసమర్థ నాగరికతలో ఉన్నామనే చేదు నిజాన్ని మనం గుర్తించడం లేదు.
మనం అభివృద్ధి గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకుంటున్నాం. తప్పేం లేదు. కానీ… ‘Development’ పేరిట జరుగుతున్న పర్యావరణ విధ్వంసం గురించి మనం ఒక్క నిమిషమైనా ఆలోచిస్తున్నామా..?
మన పిల్లల పేరు మీద కోట్ల ఆస్తులు కూడబెట్టొచ్చు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టించొచ్చు. కానీ వారు పీల్చే గాలి కలుషితమైతే, వారు తాగే నీరు విషతుల్యం అయితే, ఆ ఆస్తుల వల్ల ఉపయోగం ఏంటి..? మనం వారసత్వంగా ఇచ్చిన సంపద వారి ప్రాణాలను కాపాడుతుందా? ఇది ఎలా ఉందంటే… మన బిడ్డలకు మనమే ‘బంగారు గిన్నె’లో ‘విషం’ ఇచ్చి తాగమన్నట్టు ఉంటుంది. అవునా… కాదా…?
డబ్బు… సంపద… ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ… ప్రకృతి ఒక్కసారి నాశనమైతే తిరిగి రాదు. మన పిల్లలు… వారి పిల్లలు… ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే వారికి మనం ఇచ్చే అతిపెద్ద బహుమతి “క్లీన్ ఎన్విరాన్ మెంట్” మాత్రమే.
‘ఏదో చోటు’ మనం నిలబడ్డ ఈ పోరాటాల పురిటిగడ్డ ‘తెలంగాణ’ ఎందుకు కాకూడదు..? ఆ “ఎప్పుడో ఒకప్పుడు”… ఇప్పుడే ఎందుకు కాకూడదు? అందుకే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మా ప్రభుత్వం ఆ చారిత్రక బాధ్యతను భుజానికెత్తుకుంది. మన పిల్లల కోసం… రేపటి తరాల భవిష్యత్తు కోసం, ఈ నేల మనుగడ కోసం మేము ‘HILT’ పాలసీ పేరిట ఓ చారిత్రాత్మక మార్పు వైపు మొదటి అడుగు వేశాం. అయినా సరే… కొందరు కావాలని ఈ పాలసీలో ఏదో మతలబు ఉందంటూ మాపై విమర్శలు చేస్తున్నారు.
చాలా మంది దీనిని కేవలం ఒక సాదాసీదా ‘Land Transformation’ గా మాత్రమే చూస్తున్నారు. ‘భూమి వినియోగం మారుతోంది, పారిశ్రామిక ప్రాంతం కాస్తా నివాస ప్రాంతంగా మారుతోంది’ అని కేవలం రెవెన్యూ రికార్డుల కోణంలో మాత్రమే చూస్తున్నారు. కానీ నేను ఈ సభ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలకు… రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓ విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. ఇది కేవలం ‘Change of Land Use’ కాదు, ఇది మన పిల్లల కోసం… రాబోయే తరాల కోసం మా ప్రభుత్వం వేస్తున్న ఒక ‘ఆరోగ్యకరమైన పునాది’.
ఈ పాలసీ ద్వారా రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేర్పులు చేయడం కాదు మా ఉద్దేశం. పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించి మన పిల్లలకు… రేపటి తరాలకు పీల్చేందుకు స్వచ్ఛమైన గాలిని, తాగేందుకు స్వచ్ఛమైన నీటిని అందించాలన్నదే మా సంకల్పం.
1970వ దశకంలో IDPL రాకతో హైదరాబాద్ పారిశ్రామిక ప్రస్థానం మొదలయ్యింది. ఆనాడు బాలానగర్, సనత్ నగర్, ఉప్పల్, జీడిమెట్ల, చర్లపల్లి వంటి ప్రాంతాలను కేవలం పరిశ్రమల కోసమే “ప్రత్యేక జోన్లు” గా కేటాయించారు. అప్పట్లో ఇవి నగరం చివర, జనావాసాలకు కిలోమీటర్ల దూరంలో, నిర్మానుష్యమైన ప్రాంతాల్లో ఉండేవి. ఆనాడు అక్కడ పరిశ్రమలు ఉండటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ముప్పు ఉండేది కాదు.
కానీ… ఈ 50 ఏళ్లలో ఏం జరిగింది? హైదరాబాద్ నగరం మనం ఊహించని విధంగా, ప్రపంచపటంలో ఒక మహా నగరంగా విస్తరించింది. ఒకప్పుడు ఎక్కడో “అవుట్ స్కర్ట్స్” లో ఉన్న ఈ పారిశ్రామిక ప్రాంతాలు, నేడు నగరానికి “నడిబొడ్డు” గా మారిపోయాయి. అంటే, అప్పట్లో పరిశ్రమల కోసం కేటాయించిన చోట… నేడు లక్షలాది కుటుంబాలు నివసించే రెసిడెన్షియల్ కాలనీలు వెలిశాయి.
నాడు ఫ్యాక్టరీకి, మన ఇంటికి మధ్య కిలోమీటర్ల దూరం ఉండేది. నేడు ఫ్యాక్టరీ గోడ పక్కనే అపార్ట్మెంట్ ఉంది. చిమ్నీ నుంచి వచ్చే విషపూరిత పొగ గాలిలో కలిసిపోయే అవకాశం లేకుండా, నేరుగా బెడ్ రూమ్‌లోకి ప్రవేశిస్తోంది. ఓవైపు నివాస గృహాలు, మరోవైపు పరిశ్రమలు. ఈ రెండింటి మధ్య ‘బఫర్ జోన్’ అంటూ లేకుండా పోయింది… ఓ రకంగా చెప్పాలంటే… ఇది కేవలం ప్లానింగ్ లోపం కాదు అధ్యక్షా, శాస్త్రీయంగా ఒక పెను ప్రమాదానికి బహిరంగ ఆహ్వానం పలకడమే.
భోపాల్ గ్యాస్ లీకేజీ ఘటన– నివాస ప్రాంతాల మధ్య పరిశ్రమలు ఉంటే ఏమవుతుంది..? అనే ప్రశ్నకు సజీవ సాక్ష్యం. విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ఘటనలో నివాసాలు మరియు పరిశ్రమల మధ్య ‘Buffer Zone’ లేకపోవడం వల్ల ప్రజలు రోడ్లపై పక్షుల్లా రాలిపోయారు.
జపాన్‌లో పారిశ్రామిక వ్యర్థాలు నీటిలో కలవడం వల్ల ఒక తరం మొత్తం నరాల వ్యాధులతో అంగవైకల్యానికి గురైంది. హైదరాబాద్ పారిశ్రామిక బెల్ట్లలో భూగర్భ జలాల పరిస్థితి దీనికి ఏమాత్రం తక్కువ లేదు.
నగరంలోని చాలా ఇండస్ట్రియల్ ఏరియాల్లోని భూగర్భ జలాల్లో ప్రమాదకరమైన’హెవీ మెటల్స్’ స్థాయిలు ఉండాల్సిన దాని కంటే 1000% ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక రసాయన వ్యర్థాలే ఈ దుస్థితికి కారణమని, దీనివల్ల రాబోయే తరాల్లో ‘జెనెటిక్ మ్యుటేషన్స్’ వచ్చే ప్రమాదముందని ఇప్పటికే పలు సైంటిఫిక్ స్టడీస్ తేల్చాయి.
ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు ‘హైదరాబాద్’ కూడా ఢిల్లీలా మారడం ఖాయం. దానికి ఎంతో దూరం లేదని… ఇటీవల జరుగుతున్న పరిణామాలను చూస్తే స్పష్టమవుతోంది. అప్పుడు ప్రతి ఇల్లూ ఒక ఆసుపత్రి అవుతుంది. పిల్లలకు బొమ్మలు, బుక్స్ కొనిపించినట్లుగానే నెబ్యులైజర్లు, ఇన్హేలర్లు కూడా తప్పనిసరిగా కొనివ్వాల్సి వస్తోంది. అవునా… కాదా..? ఇక్కడున్న సభ్యులు రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కసారి ఆలోచించండి.
1952లో లండన్ నగరం ఒక భయంకరమైన ‘గ్రేట్ స్మోగ్’ ను చవిచూసింది. అయిదు రోజుల్లోనే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు ఆ దేశం మేల్కొని, ప్రపంచంలోనే మొట్టమొదటి ‘క్లీన్ ఎయిర్ యాక్ట్’ను తీసుకొచ్చింది. ఆ చట్టం ద్వారా నగర నడిబొడ్డున ఉన్న భారీ పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించారు.
ఆనాడు వారు తీసుకున్న ఆ కఠిన నిర్ణయం వల్లే… ఒకప్పుడు మురికిగా, విషతుల్యంగా ఉన్న థేమ్స్ నది నేడు అత్యంత స్వచ్ఛంగా మారింది. ‘లండన్ తన తప్పుల నుంచి నేర్చుకుని తనను తాను పునర్నిర్మించుకుంది. అదే స్ఫూర్తితో మన మూసీ నదిని కూడా పునరుజ్జీవింపజేసి, భావితరాలకు ఓ జీవనదిగా అందించాలన్నదే మా తాపత్రయం.
బీజింగ్ లాంటి మెగా సిటీలలో కాలుష్యం పెరిగిపోవడంతో వారు ‘బ్లూ స్కై ప్రొటెక్షన్ ప్లాన్’ ) పేరిట ఓ అడుగు ముందుకేశారు. నగరాల మధ్యలో ఉన్న వేలాది భారీ పరిశ్రమలను నిర్ణీత గడువులోగా దూరంగా ఉన్న ఇండస్ట్రియల్ పార్కులకు తరలించారు. కేవలం… అయిదేళ్లలోనే అక్కడి మెగా సిటీస్ లో 30 శాతం నుంచి 40 శాతం వరకు కాలుష్యం తగ్గింది.
బ్రిటన్ ప్రభుత్వం, చైనా లాంటి దేశమే అంత కఠినంగా వ్యవహరించి సక్సెస్ అయినప్పుడు… మన రేపటి భాగ్యనగరం కోసం… మన పిల్లల కోసం రాజకీయాలను పక్కనపెట్టి అందరం ఏకమై కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించలేమా…?
ఎకనామిక్స్ లో ‘ఎక్స్టర్నాలిటీస్’ అంటే ఒకరు చేసే పని వల్ల పరోక్షంగా ఇతరులకు కలిగే నష్టం. దీనిని ఒక ఉదాహరణతో చెబుతాను:
• ఒక పరిశ్రమ యజమాని కొన్ని కెమికల్ బేస్డ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ రూ.కోట్లు ప్రాఫిట్ సంపాదిస్తున్నారు. ఆ లాభం నేరుగా ఆయన జేబులోకి వెళ్తుంది. ఇది ఆయన వ్యక్తిగత లాభం.
• కానీ… అదే ఫ్యాక్టరీ వదిలే విష వాయువుల వల్ల చుట్టుపక్కల ఉన్న సామాన్యులకు శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్ వస్తున్నాయి. ఆ రోగుల ఆసుపత్రి ఖర్చులు, మెడిసిన్ బిల్స్ ఎవరు కడుతున్నారు…? వాళ్ల కుటుంబాలు, లేదా ప్రభుత్వం.
• అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటి…? లాభం యజమాని తీసుకుంటున్నాడు. కానీ… ఆ ‘Cost of Pollution’ను మాత్రం సామాన్య ప్రజలు భరిస్తున్నారు. దీనినే “నెగటివ్ ఎక్స్టర్నాలిటీ” అంటారు.
• మా గవర్నమెంట్ పాలసీ ఏంటంటే…. మీరు ప్రాఫిట్స్ ను ఎర్న్ చేసుకోండి. బిజినెస్ ఇంకా డెవలెప్ చేసుకోండి. కొత్తగా పెట్టుబడులు పెట్టండి. దానికి ప్రభుత్వపరంగా మా మద్దతు ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
కానీ… ప్రజల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. ఈ ప్రజలే మీ కస్టమర్లు… మీ ప్రొడక్ట్ కన్య్సూమర్స్ అని మాత్రం మరిచిపోవొద్దు. అందుకే… మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల సౌకర్యాలను ఓఆర్ఆర్ అవతల కల్పిస్తాం. నిర్భయంగా మీరు వెళ్లొచ్చు. మీ సమస్యలను పరిష్కరించేందుకు… మీతో చర్చించేందుకు… మీ సందేహాలను నివృత్తి చేసేందుకు మా ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధంగా ఉంది.
ఇక్కడ మనం మాట్లాడుతున్నది కేవలం కొన్ని ఫ్యాక్టరీల షిఫ్టింగ్ గురించి కాదు, హైదరాబాద్ నగరం ఎదుర్కొంటున్న “Slow-Motion Biological Disaster” గురించి. ఒక నగరం తన ఆర్థిక ఎదుగుదల కోసం తన ప్రజల ఊపిరితిత్తులను పణంగా పెట్టకూడదు. నేడు హైదరాబాద్ ఒక ‘Ecological Imbalance’ లో ఉంది. దీనిని సరిదిద్దే శస్త్రచికిత్స పేరే ఈ ‘హిల్ట్’ పాలసీ.
పారిశ్రామికీకరణ కంటే ప్రజల ప్రాణానికే ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఢిల్లీలో నివాస ప్రాంతాల మధ్య ఉన్న 168 ప్రమాదకర పరిశ్రమలను తరలించాలని ఇచ్చిన తీర్పు మనకు ప్రాతిపదిక.
కాలుష్యం చేసేవాడే దాని శుద్ధికి ఖర్చు భరించాలి. కానీ నగరంలో ఉన్న పరిశ్రమలు చేస్తున్న కాలుష్యానికి ప్రజలు తమ ఆరోగ్యంతో మూల్యం చెల్లిస్తున్నారు. ఈ అసమతుల్యతను తొలగించడమే ‘హిల్ట్’ ముఖ్య ఉద్దేశ్యం.
‘హిల్ట్’ పాలసీ ముఖ్యోద్దేశం…. కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించడం. నగరవాసులకు క్లీన్, హైజిన్ ఎన్విరాన్ మెంట్ ను అందించడం. మన పిల్లలకు… రేపటి తరాలకు స్వచ్ఛమైన గాలి, నీటిని అందించడం. దీనిపై అవగాహన లేకుండానే కొందరు కావాలని పనిగట్టుకుని ‘పాలసీ’ బయటకు రాక ముందే మాపై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. ఇప్పటికీ అడ్డగోలుగా మాట్లాడుతూనే ఉన్నారు. బాధ్యత లేకుండా దుష్ర్పచారం చేస్తూనే ఉన్నారు.
బీఆర్ఎస్ నాయకులైతే ప్రభుత్వం భూములను తక్కువ ధరకే మేం అమ్మేస్తున్నామంటూ మాపై బురద చల్లడం ప్రారంభించారు. మేమేం తక్కువ తిన్నామా అన్నట్లు… బీజేపీ నాయకులు కూడా వారి బాటలోనే నడిచారు.
2013లోనే అప్పటి మా ప్రభుత్వం నగరం లోపల ఉన్న రెడ్, ఆరెంజ్ కేటగిరీ పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించాలని ‘మాండేట్’ ఇవ్వడం జరిగింది. అయితే… ఆ తర్వాత అధికారంలోకొచ్చిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలికి తరలించకుండా మాటలతో కాలక్షేపం చేసింది.
లీజ్ ల్యాండ్స్ (ప్రభుత్వానికి పూర్తిస్థాయి హక్కులు కలిగిన భూములు… లీజ్ వ్యవధి 99 ఏళ్లు మాత్రమే)పై ప్రైవేట్ వ్యక్తులకు ఫ్రీ హోల్డ్ రైట్స్ ను కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 29-08-2023న జీవో ఎంస్ 19ను తీసుకొచ్చింది. ప్రభుత్వ భూములపై ప్రైవేట్ వ్యక్తులకు హక్కులను కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ జీవో వెనుక మతలబు ఏంటి…? దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఎందుకు మాట్లడటం లేదు?
అంతకు ముందే ‘గ్రిడ్’ పాలసీ (తేదీ; 10-12-2020) పేరిట ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రయత్నించింది. మరి ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్న బీజేపీ నాయకులు అప్పుడు ఎక్కడికెళ్లారు..? ఎందుకు మాట్లాడలేదు…? మీ రెండు పార్టీల మధ్య ఉన్న దోస్తానా ఏంటి..?
నిపుణులతో చర్చించిన తర్వాతే…. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకున్న తర్వాతే… డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క నేతృత్వంలోని కేబినేట్ సబ్ కమిటీ(సభ్యులు; ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్ బాబు) ఈ ‘హిల్ట్’ పాలసీని రూపొందించింది. నిబంధనల మేరకు… అందర్నీ సంప్రందించిన తర్వాతే కన్వర్షన్ ఫీజును నిర్ణయించాం.
‘హిల్ట్’ పాలసీ విషయంలో మా ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తోంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఈ పాలసీ కింద కన్వర్ట్ చేసే భూములు ప్రభుత్వానికి చెందినవి కావు. ఆ భూములు పరిశ్రమల యజమానులవే. ఆ ల్యాండ్స్ పై హోల్ అండ్ సోల్ రైట్స్ వారివే. ఈ విషయంలో కావాలనే పనిగట్టుకుని బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు దుష్ర్పచారం చేస్తున్నారు.
ఈ పాలసీ కింద భూముల కన్వర్షన్ ‘స్వచ్ఛందం’ మాత్రమే. తప్పనిసరి కాదు. ప్రభుత్వం ఎవర్నీ బలవంతపెట్టదు. ఎవరిపై ఒత్తిడి తీసుకరాదు. పైగా… ఇది కాలపరిమితితో కూడుకున్న పాలసీ. తమ భూములను కన్వర్షన్ చేసుకోవాలనుకునే పరిశ్రమల యజమానులు ‘6’ నెలల్లోపు ‘టీజీఐపాస్ ’ పోర్టల్ ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది.
మీరెన్ని విమర్శలు చేసిన మేం వెనక్కి తగ్గం. ప్రజలకు మంచి చేయడం ఆపం. ఆ స్థలాలను వీలైనంత మేరకు ప్రజలకు ఉపయోగడపడేలా అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం.చాలా ఇండస్ట్రియల్ ఏరియాస్ లో ఖాయిలా పడ్డ పరిశ్రమలు, మూతపడిన పరిశ్రమల వల్ల ఆ స్థలాలు నిరుపయోగంగా ఉన్నాయి. అలా వృథాగా మారిన స్థలాలను పునర్వియోగంలోకి తేవడమే లక్ష్యం.
టెక్నాలజీ రోజురోజుకీ మారుతోంది. అయినా… కొన్ని పరిశ్రమలు ఇంకా కాలం చెల్లిన టెక్నాలజీనే వినియోగిస్తున్నాయి. ఫలితంగా పరిసరాల్లో కాలుష్యం పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలనే సంకల్పంతోనే ఈ పాలసీని రూపొందించాం.