– రైతు దేశానికి వెన్నుముక-రైతే రారాజు
– సేంద్రియ వ్యవసాయం సమాజానికి అవసరం
– ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడు రైతులకు అండగా ఉంటుంది..హోం మంత్రి అనిత
పాయకరావుపేట: పాయకరావుపేట మండలంలోని పెద రామభద్రపురం గ్రామంలో జరుగుతున్న రైతు వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని రైతులతో నేరుగా ముఖాముఖీ మాట్లాడి, వ్యవసాయానికి సంబంధించిన పలు అంశాలపై సమగ్రంగా చర్చించారు.
మంత్రి అనిత పొలం పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా డ్రోన్ సాయంతో సేంద్రీయ ఎరువుల పిచికారీ చేయడంతో పాటు, వరి పొలంలోకి దిగి స్వయంగా డ్రోన్‌ను ఆపరేట్ చేస్తూ పంట పరిస్థితులను వివరంగా పరిశీలించారు. అనంతరం రైతు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా పరిశీలించారు.
అన్నదాత – సుఖీభవ – పీఎం కిసాన్ లో భాగంగా పాయకరావుపేట నియోజకవర్గ రైతులకు ₹25 కోట్లు 60 లక్షల విలువైన చెక్కును జిల్లా అధికారులతో కలిసి మంత్రి అనిత రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ… రైతు దేశానికి వెన్నుముక… రైతు ఎప్పుడూ రారాజే అని పేర్కొన్నారు. రైతులు వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయడం అభినందనీయమని చెప్పారు. రామభద్రపురం గ్రామం ఎరువులు అడగని గ్రామంగా నిలుస్తుండటం గర్వకారణమని పేర్కొన్నారు.
ఆరోగ్యానికి మించి ఆస్తి ఏదీ లేదని, సేంద్రీయ పంటలు ప్రజలకు నిజమైన ఆరోగ్యం అందిస్తున్నాయని తెలిపారు. సేంద్రీయ వ్యవసాయం సమాజానికి, భవిష్యత్తు తరాలకు అత్యవసరమని, ప్రతి రైతు దీన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పిల్లల్లోనూ వ్యవసాయం పట్ల ఆసక్తి పెంపొదించాలని, విద్యార్థి దశ నుండే సేంద్రీయ వ్యవసాయంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎన్డియే ప్రభుత్వం రైతుల కోసం ఎప్పుడు అండగా ఉండి, రైతుల సంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి అనిత స్పష్టం చేశారు.



