ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో అసువులు బాసిన అమరావతి అమర వీరుల స్మారక స్థూపాన్ని నిర్మించేందుకు నిర్మాణ కమిటీని ఏర్పాటు చేసినట్లు అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తెలిపారు. శనివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ కమిటీ ప్రతినిధుల వివరాలను ఆయన ప్రకటించారు.
స్మారక కమిటీ గౌరవ అధ్యక్షులుగా యలమంచిలి ప్రసాద్ (చికాగో), సలహాదారుగా ఉన్నం మురళీధరరావు ( సుప్రీం కోర్టు న్యాయవాది), అధ్యక్షులుగా పోతుల బాలకోటయ్య (అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు)ఉపాధ్యక్షులుగా వేనుగుంట రాజర్ ( టెక్సాస్, అమెరికా), ముప్పాళ్ళ నాగేశ్వరరావు ( సిపిఐ), కార్యదర్శిగా రాయపాటి శైలజ ( మహిళా జెఎసి), ధనేకుల రామారావు ( రైతు కార్యాచరణ సమితి), సహ కార్యదర్శులుగా మహా న్యూస్ చానల్ మహాలక్ష్మి ( హైదరాబాద్), ఆలూరి యుగంధర్ (మందడం), ముప్పా అంకమ్మ రావు ( రాజకీయ విశ్లేషకులు, హైదరాబాద్), ప్రతినిధులుగా తుమ్మల ప్రసన్న కుమార్ ( హైదరాబాద్ ఫిలిం చాంబర్ సెక్రటరీ), కొమ్మినేని వరలక్ష్మి (రైతు మహిళా), కంచర్ల గాంధీ ( వెలగపూడి), అబ్బాస్ సలీం ( కోడి కత్తి కేసు న్యాయవాది), సిరంగుల వెంకట రత్నం ( భీమవరం), ఆలూరి రఘునాథ రావు ( అనంతవరం), తక్కెళ్ళపాటి హరిబాబు ( బెహరేన్), గూడపాటి పద్మ శేఖర్ ( గొల్లపూడి), కోశాధికారిగా జెవి శ్రీనివాస్ ( జర్నలిస్టు, విజయవాడ)లను నియమించినట్లు చెప్పారు.
వీరితోపాటు అమరులైన వారి కుటుంబ సభ్యులు, అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచిన పలు రాజకీయ పార్టీల ప్రతినిధులు, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు చెందిన ప్రముఖులు, మేధావులు 25 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయటం జరిగిందన్నారు. స్థూప ఆకృతి ఎలా ఉండాలి? ఎక్కడ నిర్మించాలి? వంటి అంశాలను కమిటీ పరిశీలిస్తుందని పేర్కొన్నారు.
రాజకీయాలకు అతీతంగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు ను కమిటీ ప్రతినిధులు కలిసి అమరవీరుల స్మారక స్థూపం అవశ్యకతను తెలియజేయు నున్నట్లు తెలిపారు. ఒక రాకాసి పాలనకు గుర్తుగా భవిష్యత్ తరాలకు గుర్తుండేలా స్మతి చిహ్నం నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఈ పవిత్ర మైన కార్యక్రమంలో పాల్గొనువారు వారి సలహాలు, సూచనలు స్వీకరించటం జరుగుతుందని బాలకోటయ్య వివరించారు.
ప్రాణాలు పోతే కొత్త ప్రభుత్వం వచ్చింది
రాష్ట్రంలో ఐదేళ్ల వైకాపా పాలనలో రాజధాని రైతులతో పాటు ఎందరో అమాకుల ప్రాణాలు పోతే కూటమి ప్రభుత్వం వచ్చిందని బాలకోటయ్య అభిప్రాయపడ్డారు. ప్రజల్ని పీక్కుతినేలా రాక్షస పాలనను ప్రజలు భరించారని, తుదకు పీడ వదిలించుకున్నారు అని చెప్పారు. రాజకీయ విశ్లేషకులు ముప్పా అంకమ్మ రావు మాట్లాడుతూ అమరావతి అమరవీరుల సంస్మరణ రాష్ట్రంలోని అందరి బాధ్యత అన్నారు. ఏమి ఇచ్చినా వారి పోరాట పటిమ రుణం తీర్చుకోలేనిదని అభిప్రాయపడ్డారు.
రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, మళ్ళీ రాజధాని కోసం ఉద్యమం చేయటం తెలుగు నేలపై కొత్త చరిత్ర అన్నారు. కనకదుర్గ దేవాలయం బోర్డు మాజీ మెంబర్ గూడపాటి పద్మ శేఖర్ మాట్లాడుతూ స్థూపాన్ని నిర్మించేందుకు అందరి సహకారాన్ని తీసుకోనున్నట్లు తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ను కూడా కలిసి కమిటీ కార్యాచరణను వివరిస్తామని తెలిపారు. వెలగపూడి రైతు కంచర్ల గాంధీ మాట్లాడుతూ రాజధానిలో రైతులు పడ్డ బాధలు వర్ణనాతీతం అన్నారు. తనపై 34 కేసులు పెట్టారని చెప్పారు.రెల్లి సంక్షేమ నాయకులు శిరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.