మంగళగిరి: తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంగళవారం మాజీ స్పీకర్ దివంగత కోడెల శివ ప్రసాద్ ఆరో వర్ధంతిని నిర్వహించారు. ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ షరీష్, ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఏపీ హజ్ కమిటీ చైర్మన్ షేక్ హసన్ భాషా, నేతలు బొద్దులూరి వెంకటేశ్వరరావు, ఏవీ రమణ, పర్చూరి కృష్ణ, సునీల్, మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొని కోడెలకు నివాళులు అర్పించి ఆయన సేవలను కొనియాడారు.
ఈ సందర్భంగా ఏపీ మైనార్టీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ షరీష్ మాట్లాడుతూ.. కోడెల శివప్రసాద్ పల్నాడులో అణచివేతకు వ్యతిరేకంగా పోరాడి, ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారని చెప్పారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివని అన్నారు. కోడెల మరణానికి వైసీపీ నాయకులే కారణమని ఆరోపించారు. వైసీపీ నాయకులు కోడెలను అనేక అవమానాలకు గురి చేశారని, అందుకే ఆయన మరణించారని చెప్పారు. మైనారిటీల సమస్యలను కూడా కోడెల పరిష్కరించారని, ఆయన నాయకత్వంలో శ్మశాన వాటికలు అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు.
అనంతరం ఏపీ అగ్రికల్చరల్ మిషన్ వైస్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కోడెల శివ ప్రసాద్‌ను ‘రూపాయి డాక్టర్’ అని ప్రజలు పిలుచుకునేవారని చెప్పారు. కోడెల పార్టీలో ఎన్నో మంచి విధానాలను అమలు చేశారని, నరసరావుపేట ప్రాంతానికి గొప్ప పేరు తెచ్చారని అన్నారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో కోడెల రాజకీయాల్లోకి వచ్చి నీటిపారుదల, హోంశాఖ వంటి అనేక శాఖలకు మంత్రిగా పని చేశారని తెలిపారు. కోడెల కృషి వల్ల కోటప్పకొండకు రోడ్డు నిర్మించారని, అది ఆయన పరమశివుడి భక్తుడనడానికి నిదర్శనమని చెప్పారు. కోటప్పకొండ ఆయన హయాంలోనే అభివృద్ధి చెందిందని తెలిపారు.