October 3, 2026

నాడు ఐఎస్‌బి , నల్సార్.. ఇప్పుడు ఐఎస్‌ఏ

  • ఉన్నత విద్యారంగంలో చంద్రబాబు విజన్‌

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సేవలందించిన కాలంలో చంద్రబాబు తన దూరదృష్టితో తీసుకువచ్చిన విద్యాసంస్థలు ఇవాళ దేశ విద్యా, సాంకేతిక రంగాలకే గర్వకారణంగా నిలిచాయి. ప్రపంచ స్థాయి మేనేజ్‌‌మెంట్ విద్యను ఇండియాకు పరిచయం చేయాలనే సంకల్పంతో ఆనాడు ఐఎస్‌బి – ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయగా…ఆ విద్యాసంస్థ ఇవాళ ఆసియాలోనే టాప్ బిజినెస్ స్కూళ్లలో ఒకటిగా ఎదిగింది.

న్యాయ విద్యా రంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ స్థాపించిన నల్సార్ ( నల్సార్ లా యూనివర్శిటీ ) దేశంలోనే అత్యుత్తమ లా యూనివర్సిటీగా పేరుపొందింది. హైదరాబాద్ మహానగరాన్ని గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా మార్చిన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వరుసలోనే…ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం మరొక భారీ ఇనిస్టిట్యూట్‌ను ప్రకటించారు చంద్రబాబు.

తాజాగా అన్నమయ్య జిల్లా మదనపల్లె వేదికగా నిర్వహించిన రాయలసీమ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా ఏపీ ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల భాగస్వామ్యంతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ – ఐఎస్‌ఏ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. రాయలసీమలో రూ. లక్ష కోట్లతో ప్రతిపాదించిన గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రాజెక్టులో ఇది అత్యంత కీలకమైన భాగం. 25 ఏళ్ల క్రితం వ్యాపార, కార్పొరేట్ రంగానికి దిశా నిర్దేశం చేయడానికి ఐఎస్‌బి ఎలాగైతే వచ్చిందో, ఇప్పుడు భారతీయ వ్యవసాయ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ అగ్రికల్చర్ ఐఎస్‌బి రూపుదిద్దుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ కేవలం సాంప్రదాయ వ్యవసాయ కోర్సులకే పరిమితం కాకుండా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతు ముంగిట్లోకి తీసుకెళ్లే గ్లోబల్ రీసెర్చ్ హబ్‌గా పని చేయనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డ్రోన్ టెక్నాలజీ, సేంద్రీయ, ప్రీసిజన్ ఫార్మింగ్ , స్మార్ట్ ఇరిగేషన్ వంటి ఆధునిక పద్ధతులను ఈ సంస్థ ద్వారా క్షేత్రస్థాయికి అనుసంధానించనున్నారు. పంటల దిగుబడిని పెంచడం, నాణ్యమైన మార్కెట్ ఇంటెలిజెన్స్, కోల్డ్ చైన్ నెట్‌వర్క్ నిర్వహణ వంటి అంశాల్లో రైతులకు, అగ్రి-స్టార్టప్‌లకు ఈ సంస్థ అత్యాధునిక మార్గదర్శకత్వం వహిస్తుంది.

వ్యవసాయాన్ని కేవలం జీవనాధారంగానే కాకుండా లాభసాటి వ్యాపారంగా, ఆకర్షణీయమైన వృత్తిగా మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. స్థానిక ఉద్యానవన పంటలకు ప్రపంచ స్థాయి ఎగుమతి అవకాశాలు కల్పించడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం యువతను సాంకేతిక అగ్రి-ప్రెన్యూర్స్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ సైతం..ఆనాడు హైదరాబాద్‌కు ఐఎస్‌బి తెచ్చిన చంద్రబాబు , నేడు రైతుల భవిష్యత్తును మార్చేందుకు రాయలసీమకు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ తెస్తున్నారని కొనియాడారు.

మొత్తానికి ఐఎస్‌బీ, నల్సార్‌లతో నాలెడ్జ్ అండ్ IT విప్లవాన్ని సృష్టించిన చంద్రబాబు, ఇప్పుడు ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా ఏపీ వ్యవసాయ రంగంలో సరికొత్త విప్లవానికి బాటలు వేస్తున్నారు. రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ క్యాపిటల్‌గా మార్చడమే కాకుండా, రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా అగ్రి-టెక్ పరిశోధనలకు ఈ సంస్థ కేంద్ర బిందువుగా మారనుందనడంలో సందేహం లేదు.

Total Visitors: 2,854,736