– కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బీ టీమ్ అక్రమ కేసులకు బీఆర్ఎస్ శ్రేణులు భయపడరు
– ఎంపీ వద్దిరాజు రవిచంద్ర
చోటా భాయ్ రేవంత్ రెడ్డి అడగ్గానే బడే భాయ్ ప్రధాని నరేంద్రమోడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావుపై ప్రాసిక్యూషనుకు అనుమతినిచ్చారని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర వ్యాఖ్యానించారు. ఫార్ములా ఈ- కార్ రేస్ తో ఏసీబీకి ఏ మాత్రం సంబంధం లేదన్నారు. ఈ కేసులో కేటీఆర్ గతంలో మూడు సార్లు ఏసీబీ ముందు కేటీఆర్ హాజరయ్యారని, లై డిటెక్టర్ పరీక్షకు కూడా సిద్ధమని ప్రకటించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఎంపీ రవిచంద్ర గురువారం సాయంత్రం బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తదితరులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్ లో విలేకరులతో మాట్లాడారు. ఫార్ములా ఈ-కారు రేస్ కేసు లొట్టపీసు కేసు అని కేటీఆర్ చెప్పారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చలేక, ప్రజలకు సమాధానం చెప్పే ధైర్యం లేక రేవంత్ రెడ్డి “డైవర్షన్ పాలిటిక్స్” చేస్తున్నారని ఎంపీ రవిచంద్ర మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ కు బీజేపీ నాయకుల సహకారం ఎట్లా అందుతున్నదో ప్రజలకు తేటతెల్లంగా తెలిసిపోయింద న్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నదని, ఆధారాలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి ఎన్ని ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోని సందర్భాలను ఎంపీ రవిచంద్ర ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ బీ టీమ్ గా మారిందని, బీఆర్ఎస్ ను,ప్రాంతీయ పార్టీలను చిదిమేసే ప్రయత్నం కాంగ్రెస్,బీజేపీ లు కలిసి చేస్తున్నాయని ఎంపీ వద్దిరాజు చెప్పారు. బీహార్ లో ఆర్జేడీని,ఢిల్లీలో ఆప్ ను అణగదొక్కాయన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ- కార్ రేస్ కు కేంద్ర మంత్రులు కూడా హాజరైన విషయాన్ని ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర గుర్తు చేశారు.
ఆ రేస్ విజయవంతం కావడంతో హైదరాబాద్ నగర ప్రతిష్ఠ మరింత పెరిగి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కూడా తరలి రావడం జరిగిందన్నారు.ఆ స్పూర్తితో ఇక వరుసగా ప్రతి ఏటా కూడా ఈ రేస్ నిర్వహించాలని సంబంధిత శాఖ మంత్రిగా కేటీఆర్ భావించారని ఎంపీ రవిచంద్ర వివరించారు. ఫార్ములా ఈ రేస్ లో లావాదేవీలు, నగదు మార్పిడి జరుగలేదని, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రేవంత్ రెడ్డి తన వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్నారని,అది ఒక అలవాటుగా మారిందని ఎంపీ రవిచంద్ర దుయ్యబట్టారు. కాంగ్రెస్ సర్కార్ తప్పిదాలకు వ్యతిరేకంగా పోరాడే విషయంలో బీఆర్ఎస్ వెనక్కి తగ్గదని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని కేసులు బనాయించినా బీఆర్ఎస్ శ్రేణులు భయపడబోరని, న్యాయవ్యవస్థపై అపార గౌరవం ఉన్న తాము న్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ఎంపీ వద్దిరాజు స్పష్టం చేశారు.