• రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత
• 26 జిల్లా కేంద్రాల్లోనూ డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు
• 2 నెలల పాటు శిక్షణ..నెలకు రూ.1500ల చొప్పున స్టయి ఫండ్
• పుస్తకాల కోసం మరో రూ.1000 అందజేత
• త్వరలో ఆన్ లైన్ లోనూ కోచింగ్ : మంత్రి సవిత
అమరావతి : రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల డీఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వనుంది. దీనిలో నేటి నుంచి(శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్లు ప్రారంభించనుంది. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు.
. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలి సంతకంగా సీఎం చంద్రబాబునాయుడు మెగా డీఎస్సీ నిర్వహణపై సంతకం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించారన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన తరగతుల అభ్యర్థులకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉచిత డీఎస్సీ కోచింగ్ ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 26 జిల్లా కేంద్రాల్లోనూ ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్ల ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నామన్నారు. ఈ కేంద్రాల ద్వారా డీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యే వెనుకబడిన తరగతుల నిరుద్యోగ యువతకు ఆర్థిక దన్ను కలిగిస్తూ, సబ్జెక్టుల వారీగా నిష్ణాతులైన అధ్యాపకులతో శిక్షణివ్వాలని నిర్ణయించామన్నారు. నేటి నుంచి (శనివారం) రాష్ట్ర వ్యాప్తంగా బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ప్రారంభించామన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశామన్నారు. గుంటూరులో డీఎస్సీ కోచింగ్ సెంటర్ ను ముఖ్య అతిథుల సమక్షంలో ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు.
శిక్షణ సమయంలో స్టయిఫండ్
రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో ఉచిత డీఎస్సీ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని మంతరి సవిత వెల్లడించారు. ఈ కోచింగ్ సెంటర్లలో బీసీలతో ఇతర సామాజిక వర్గాలకుచెందని అభ్యర్థులకు కూడా ఉచిత శిక్షణ ఇవ్వనున్నామన్నారు. బీసీలకు 66 శాతం, ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 14 శాతం చొప్పున సీట్లు కేటాయించామన్నారు. వారితో పాటు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో 10 శాతం సీట్లు కేటాయించామన్నారు. 2 నెలల పాటు సాగనున్న ఈ ఉచిత డీఎస్సీ కోచింగ్ సమయంలో అభ్యర్థులకు నెలకు 1500 రూపాయి చొప్పున స్టయి ఫండ్ అందజేయనున్నామన్నారు. మెటీరియల్ కోసం మరో రూ.1000లు ఇవ్వనున్నామన్నారు.
త్వరలో ఆన్ లైన్లోనూ కోచింగ్..
ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ డీఎస్సీ ఉచిత కోచింగ్ ఇవ్వనున్నామని మంత్రి సవిత తెలిపారు. ఆఫ్ లైన్ లో అవకాశం లభించని వారితో పాటు ఆసక్తి చూపిన వారందరికీ ఆన్ లైన్ లోనూ ఉచిత శిక్షణివ్వనున్నామన్నారు. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందిస్తున్నామన్నారు. ఈ వెబ్ సైట్ లో సబ్జెక్టుల వారీగా నిపుణులైన వారితో క్లాసుల నిర్వహిస్తున్నామన్నారు. క్లాసులతో పాటు పాత క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
బీఈడీ అర్హతతో పాటు టెట్ లో ఉత్తీర్ణత సాధించిన వారికే ఆన్ లైన్, ఆఫ్ లైన్ కోచింగ్ ఇవ్వనున్నామని మంత్రి తెలిపారు. ఆన్ లైన్ అభ్యర్థులకు తమ కిష్టమైన సమయాల్లో క్లాసులు వినే అవకాశం కలిగేలా వెబ్ సైట్ ను రూపొందిస్తున్నా మన్నారు. ఆన్ లైన్ కోచింగ్ తో గృహిణులకు, ప్రైవేటు, ప్రభుత్వ రంగంలో పనిచేసే పార్ట్ టైమ్ ఉద్యోగులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. ఆఫ్ లైన్…ఆన్ లైన్…ఏదో ఒకే విధానంలో మాత్రమే అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అవకాశం ఇవ్వనున్నట్లు ఆ ప్రకటనలో మంత్రి సవిత వెల్లడించారు.