• పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకే కూటమి ప్రభుత్వం
• “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు: పేద ప్రజల కంట కన్నీరు తుడిచేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
కూటమి ప్రభుత్వ పాలన 100 రోజుల పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం నిడదవోలు రూరల్ మండలం డి. ముప్పవరం గ్రామంలో ఏర్పాటు చేసిన “ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమానికి మంత్రి దుర్గేష్ హాజరయ్యారు.
నేరుగా ప్రజల వద్దకు వెళ్లిన మంత్రి గడిచిన 100 రోజుల్లో ప్రభుత్వం చేసిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకొని ప్రజామోదం తర్వాత ఇంటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను మంత్రి అతికించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు, నేతలు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడం కాదు సాక్షాత్తు గ్రామ ప్రజలే ఇది మంచి ప్రభుత్వం అని మెచ్చుకున్నారన్నారు. “ఇది మంచి ప్రభుత్వం” అని ప్రజలు విశ్వసించారు కాబట్టే భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారని మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం పనితీరు బాగోలేదు కాబట్టే, ప్రజలను వంచించింది కాబట్టే ఇంటికి పంపించారని విమర్శించారు.
గత ప్రభుత్వం 5 ఏళ్ల పాలనా కాలంలో చేయని పనులను కూటమి ప్రభుత్వం కేవలం నెల రోజుల్లోనే చేసి చూపించిందన్నారు. చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయని, ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎక్కడ స్త్రీ ఆనందంగా ఉంటుందో ఆ ఇళ్లు, ఆ గ్రామం, ఆ ప్రాంతం, ఆ రాష్ట్రం అద్భుతంగా విరాజిల్లుతుందన్నారు.