•మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని రూపొందిస్తాం
•నిర్మాణ రంగాన్ని పునరుద్దరిస్తాం, అందరికీ ఉపాధికల్పిస్తాం
రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
అమరావతి, జులై 3: రానున్న మూడు మాసాల్లో ఉచిత ఇసుక పాలసీని తీసుకువచ్చి ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, భూగర్బవనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంధ్ర పేర్కొన్నారు.
బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని అమల్లోకి తేవడం ద్వారా నిర్మాణ రంగాన్ని పునరుద్దరించి, ఆ రంగంపై ఆధారపడిన కార్మికులు అందరికీ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉన్నారన్నారు. ఇందుకై రానున్న మూడు మాసాల్లో మార్గదర్శకాలను రూపొందించి పటిష్టమైన ఉచిత ఇసుక విధానాన్ని రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించినట్లు ఆయన తెలిపారు.
గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానం వల్ల రాష్ట్రంలో నిర్మాణ రంగమంతా కుధేలు అయిందని, ఆ రంగంపై ఆధారపడ్డ 40 రంగాలకు చెందిన కార్మికులు రోడ్డున పడటం జరిగిందన్నారు. ప్రైవేటు ఏజన్సీలకు గత ప్రభుత్వం ఇసుకను అమ్ముకోవడం ద్వారా ఆధాయాన్ని సమకూర్చుకునే అంశంపైనే దృష్టి సారించడం వల్ల కోట్లాది మంది కార్మికులు ఎంతగానో నష్టపోయారన్నారు.
అటు వంటి పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉచితంగా ఇసుకను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి నిరంతరాయంగా నిర్మాణ రంగం కొనసాగేలా చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానాన్ని నిలుపుదల చేయడంలో ఎదురయ్యే సాంకేతిక సమస్యలను త్వరలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం వర్షాకాలం అవ్వడం వల్ల సెప్టెంబరు లోపు రీచ్ ల నుండి ఇసుక త్రవ్వకాలకు వీలుండదన్నారు. రానున్న పది పదిహేను రోజుల్లోపు రాష్ట్రంలో అధికారికంగా, అనధికారికంగా ఉన్న ఇసుక స్టాక్ పాయింట్లను గుర్తించి వాటిల్లో అందుబాటులో ఉన్న ఇసుకను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రానున్న మూడు మాసాల పాటు దాదాపు కోటి టన్నుల ఇసుక అవసరం అవుతుందని అంచనావేయడం జరిగిందన్నారు.
స్టాక్ పాయింట్ల నుండి ఇసుక రవాణా చేసే వాహనాల చార్జీలను కూడా నియంత్రించి అతి తక్కువ చార్జీలకే ఇసుక రవాణా అయ్యే విధంగా, ఇసుక బ్లాక్ మార్కెటింగ్ కాకుండా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు