– నిండుతనం స్త్రీకి శత్రువు కాదు.. అది ఆమెకు కవచం
– సంప్రదాయం అణచివేత కోసం కాదు.. స్థిరత్వం కోసం
– గౌరవం డిమాండ్ కాదు.. పరస్పర అవగాహన
నిండుతనం అంటే స్త్రీని అణచివేయడం అనే ఆరోపణగా తరచు వినిపిస్తుంటారు. ఇది సౌకర్యవంతమైన అబద్ధం. నిజానికి నిండుతనం ఎక్కడా స్త్రీని తక్కువగా చూడలేదు. ఆమెను సమాజ కేంద్రంగా చూసింది. తల్లిగా, గృహిణిగా, సంస్కార వాహినిగా ఆమె పాత్రను గౌరవించింది. ఆ గౌరవాన్ని “నియంత్రణ”గా మలిచి చూపించడమే ఆధునిక ఆలోచనల మొదటి తప్పుదారి.
ఈ ఆధునిక స్వేచ్ఛ అనే భావనలో ఒక మౌలిక లోపం ఉంది.ఇది స్వేచ్ఛను బాధ్యత నుంచి విడదీసింది. ఎంపికను విలువలకన్నా గొప్పగా పైకి ఎత్తింది. ఫలితంగా స్త్రీని మానసికంగా శక్తివంతం చేయాల్సిన ప్రయత్నంలో, ఆమె శరీరాన్ని మార్కెట్కు అప్పగించే దిశగా మళ్ళించింది.
తక్కువ వస్త్రధారణను ధైర్యంగా, ప్రదర్శనను ప్రగతిగా, ఆకర్షణను శక్తిగా చూపించడం ఇవి స్త్రీ సాధికారత కాదు. ఇవి వినియోగ సంస్కృతి భాషలో అమ్మబడుతున్న మోసపు కథనాలు.
నిండుగా కప్పుకోవడం స్త్రీని “చూపించాల్సిన వస్తువు”గా ఎప్పుడూ చూడలేదు. కానీ ఆధునిక భావజాలం “నీ శరీరం నీ ఆయుధం” “నీ శరీరం నీ ఇష్టం” అని చెప్పి, ఆ ఆయుధాన్ని మార్కెట్ చేతుల్లో పెట్టింది. దీని వల్ల స్త్రీకి గౌరవం పెరగలేదు. అంచనాలు మాత్రమే పెరిగాయి. రూపం, వయసు, ఆకర్షణ ఇవే విలువలుగా మారాయి. ఇది విముక్తి కాదు ఇది కొత్త రకం బానిసత్వం.
ఇంకో ప్రమాదకర విషయం ఏమిటంటే, ప్రతి సమస్యకూ బాధ్యతను బయట వ్యవస్థల మీదే నెట్టేయడం.
కుటుంబాల క్షీణత, సంబంధాల అస్థిరత, పిల్లలపై ప్రభావం వీటన్నింటికీ స్వేచ్ఛ పేరిట తీసుకున్న అనాలోచిత ఎంపికలు కూడా కారణమే అన్న నిజాన్ని అంగీకరించకపోవడం.
ప్రశ్నించడాన్ని తెలివైన జీవన విధానంగా చూపించి, విమర్శను ద్వేషంగా ముద్ర వేయడం ద్వారా ఆరోగ్యకరమైన చర్చనే మూసేయడం.
సంప్రదాయం సమతుల్యత నేర్పింది. హద్దులు విధించింది అణచివేత కోసం కాదు, స్థిరత్వం కోసం.
స్త్రీ–పురుషుల మధ్య తేడాలను అంగీకరించింది. అసమానత కోసం కాదు, పరస్పర బాధ్యత కోసం.
ఆధునిక ఆలోచనలు మాత్రం తేడాలనే శత్రువులుగా చూసి, సమాజాన్ని శాశ్వత సంఘర్షణలోకి నెట్టాయి. ఫలితంగా సంబంధాలు లావాదేవీలయ్యాయి, కుటుంబం ఒప్పందమైంది, తల్లి పాత్ర “ఐచ్ఛికం”గా తక్కువ చేయబడింది.
నిండుతనం వెనక్కి లాగదు. అది పరీక్షించబడిన విలువలను నిలబెడుతుంది.
ప్రతిదీ బ్రేక్ చేయాలన్న ఉత్సాహం నిర్మాణం లేకుండా కూల్చే ధోరణి మాత్రమే. కూల్చడం సులువు కానీ నిలబెట్టడమే కష్టం.అలా నిలబెట్టే శక్తే సంస్కృతి.
స్త్రీకి నిజమైన శక్తి ఆమె శరీరంలో కాదు, ఆమె నిర్ణయాల్లో, సంబంధాల్లో, బాధ్యతను మోయగల సామర్థ్యంలో ఉంటుంది.మన సంప్రదాయం కూడా ఇదే చెప్పింది. ఆధునిక భావజాలం ఇది మరిచిపోయింది. నిండుతనం స్త్రీకి శత్రువు కాదు అది ఆమెకు కవచం.
“నేను నచ్చినట్టు మాట్లాడతాను, నువ్వు వినకూ”
“నేను నచ్చినట్టు డ్రైవ్ చేస్తాను, నువ్వు జాగ్రత్తపడు”
ఇలా అనుకుంటే నియమాల అవసరమే ఉండదు.
గౌరవం డిమాండ్ కాదు, పరస్పర అవగాహన
గౌరవం అంటే “నువ్వే మారాలి” అనడం కాదు.
“మనిద్దరం సర్దుకుందాం” అనడం.
స్వేచ్ఛ అంటే ఇతరుల్ని తిప్పేయడం కాదు.
స్వేచ్భ అంటే ఇతరులతో కలిసి జీవించడం!
సేకరణ: Clasical Intellectual s Group