-పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు
-మత్తు, మాదక ద్రవ్యాల వినిమయ నివారణకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు
-మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు
-సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి
అమరావతి : అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు..
అన్ని వర్గాలకు భరోసా కల్పించే విధంగా మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి మీడియాకు వివరించారు.
1. మెగా డీఎస్సీ :
• మెగా డీఎస్సీ 2024 ద్వారా భర్తీ చేయనున్న 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
• ఇందులో భాగంగా ఎస్జీటీలు – 6,371, పీఈటీలు- 132, స్కూల్ అసిస్టెంట్ లు- 7,725, టీజీటీలు – 1781, పీజీటీలు – 286, ప్రిన్సిపాల్ లు – 52 పోస్టులను భర్తీ చేయనున్నారు.
• గత ప్రభుత్వం 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వగా మన ప్రభుత్వం ఏకంగా 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ పై చేయడం, తదనంతరం మంత్రి మండలిలో ఆమోదింప చేయడం మా ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం.
• డీఎస్సీ నిర్వహణ ఇకపై నిరంతర ప్రక్రియగా ఉంటుందని మంత్రి మండలి నిర్ణయించింది. అంటే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించబడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్ ద్వారా తెలిపారు. గత ప్రభుత్వం టెట్ పరీక్షను ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహించకపోవడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై టెట్ (టీచర్ ఎలిజబులిటీ టెస్ట్) పరీక్షను కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
• నాణ్యత గల విద్యను అందించడమే లక్ష్యంగా టీచర్లకు నియామకం కంటే ముందే శిక్షణ ఇవ్వాలి. ఈ శిక్షణ డిసెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంబంధిత శాఖాధికారులకు సూచించారు. ప్రాథమిక స్థాయి నుంచే నాణ్యమైన విద్యాబోధనకు అవసరమైన విధివిధానాలను నిర్ణయించేందుకు ప్రస్తుత విద్యావిధానంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని కూడా అధ్యయనం చేయాల్సిన అవసరముందని ఆ దిశగా అధికారులు సమాయత్తం అవ్వాలని ఆదేశించారు.
2. ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం (ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్) 2022 రద్దు:
• ఆంధ్రప్రదేశ్ భూహక్కు చట్టం 2022 (యాక్టు సంఖ్య 27 ఆఫ్ 2023) రద్దు చేసే ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
• గత ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజలను భయాందోళనకు గురిచేసిన విషయం మీకందరికి తెలిసిందే.
• గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చే క్రమంలో ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా తీసుకొచ్చినట్లు గుర్తించాం. సరైన అవగాహన లేని టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్స్ అనవసరమైన సమస్యలు సృష్టిస్తారని మేం గ్రహించాం.
• నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టానికి, గత ప్రభుత్వం ఆమోదించిన చట్టానికి తీవ్ర వైరుద్యం ఉంది. కొన్ని వివాదాస్పద నిర్ణయాల వల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం.
• ఈ యాక్ట్ ప్రకారం టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ తర్వాత మధ్యంతర, జిల్లా, న్యాయ వ్యవస్థతో సంబంధం లేకుండా నేరుగా పరిష్కారానికి కక్షిదారులు హైకోర్టుకు ఆశ్రయించే పరిస్థితిని కల్పించారు. అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఏకీకృత నిర్ణయం తీసుకునే భయంకరమైన పరిస్థితి నెలకొన్నందున ఈ చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించాం.
• రిజిస్ట్రేషన్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, న్యాయ వ్యవస్థలను అస్తవ్యస్థం చేసే ఈ చట్టాన్ని రద్దు చేయాలని మేం భావించాం. అంతేగాక భూయజమాని ఒరిజినల్ డాక్యుమెంట్ ను పొందే అవకాశాన్ని కల్పించాలని నిర్ణయించాం.
• ఈ నేపథ్యంలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సదరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసేందుకు మంత్రి మండలి తన ఆమోదం తెలియజేసింది.
3. సామాజిక పింఛన్లకు సంబంధించి గతంలో ఉన్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకంగా పేరు మార్పు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
• ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య, వితంతు, చేనేత, కల్లుగీత, మత్స్యకార, ఒంటరి మహిళలు, డప్పు కళాకారులు తదితర పింఛన్ల మొత్తాన్ని రూ.3 వేల నుంచి రూ.4 వేల రూపాయలకు పెంచుతూ మంత్రి మండలి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెంచిన పెన్షన్ పెంపుదల నిర్ణయంతో 28 కేటగిరీలకు చెందిన దాదాపు 66 లక్షల మంది లబ్ధిదారులకు లబ్ధి చేకూరనుంది. పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఏడాదికి రూ. 33వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది.
• ఈ మేరకు రూ. 4 వేలకు పెంచిన పింఛన్ మొత్తాన్ని ఏప్రిల్, మే, జూన్ లకు పెరిగిన రూ. వెయ్యి రూపాయల చొప్పున కలిపి ప్రతి పింఛన్ దారుకు మొత్తంగా రూ.7 వేల పింఛన్ ల మొత్తాన్ని జూలై 1వ తేదీన సచివాలయ ఉద్యోగులతో ఇంటివద్దనే అందించాలని మంత్రిమండలి నిర్ణయించింది.
• దివ్యాంగులు, క్షయ వ్యాధిగ్రస్తులకు ఇస్తున్న పింఛన్ ను రూ. 3 వేల నుంచి రూ.6 వేల రూపాయలకు పెంచడం జరిగింది.
• అదేవిధంగా పూర్తి అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు ఇస్తున్న రూ.5 వేల పింఛన్ ను రూ.15 వేల రూపాయలకు పెంచడం జరిగింది.
• కిడ్నీ, లివర్, బైలేట్రల్ ఎలిఫెంటాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఇస్తున్న ఫించన్ ను రూ.5 వేల నుంచి రూ.10 వేల రూపాయలకు పెంచడం జరిగింది.
• కిడ్నీ డయాలసిస్, సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా, హెచ్ఐవీ తదితర వ్యాధిగ్రస్తులకు పెన్షన్ పంపిణీ డీబీటీ ద్వారా జరుగుతుందని మంత్రి మండలి నిర్ణయించింది.
• ఈ విధంగా సామాజిక భద్రతా పింఛన్ల పెంపుదల వల్ల ప్రభుత్వంపై నెలకు రూ.819 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది. ఏరియర్స్ తో కలిపి నెలకు రూ. 4,408 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి ఉంది.
4.రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
• ఏ దేశమైనా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే నైపుణ్యం కలిగిన యువత ఎంతో అవసరం. అది గుర్తించిన మన ప్రభుత్వం అందుకనుగుణంగా ఆంధ్రప్రదేశ్ నైపుణ్య సెన్సెస్-2024 నిర్వహణకు తొలి మంత్రి మండలిలోనే ఆమోదం తెలియజేసింది.
• ప్రతి సంవత్సరం రాష్ట్రంలో 310 ఇంజినీరింగ్ కాలేజీలు, 1400 డిగ్రీ కాలేజీలు, 267 పాలిటెక్నిక్ కాలేజీలు, 516 ఐటీఐ కాలేజీ ల నుండి దాదాపు 4.4 లక్షల యువత ఆయా కోర్సులను పూర్తి చేసుకొని బయటకు వస్తున్నారు.
• అయితే డిమాండ్, సప్లై మరియు అందుబాటులో ఉన్న సదుపాయాల ఆధారంగా స్కిల్ గ్యాప్ ను అంచనా వేయడం, ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మన యువతను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా చేసి ప్రపంచ యవనిక పై మన ముద్ర ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
• యువతకు నైపుణ్య అవసరాలు అలాగే పారిశ్రామిక అనుబంధ సంస్థలు, వ్యవసాయ రంగం, మార్కెటింగ్ సంస్థలు, ప్రొడక్షన్ సంస్థలు వారి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆయా సంస్థల అవసరాలకు అనుగుణంగా నైపుణ్య సర్వేని 3 నుంచి 4 నెలల వ్యవధిలో పూర్తి చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
• ఈ సెన్సెస్ లో అందుబాటులో ఉన్న స్కిల్ ప్రొఫైల్స్, స్కిల్ నీడ్స్, స్కిల్ ఇన్ డిమాండ్, స్కిల్ లభ్యత మధ్య అంతరాన్ని గుర్తించడం, అంచనా వేయడం, తదనుగుణంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు డిజైన్ చేసేలా ప్రభుత్వానికి సమాచారం అందించడం, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువత సదరు నైపుణ్యాలను సాధించేలా శిక్షణ అందించడం ఈ సెన్సెస్ ముఖ్య లక్ష్యాలు. అంతిమంగా మన రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడమే ప్రభుత్వ సంకల్పం.
5. రాష్ట్రం లోని పేదవారి ఆకలి దప్పులను తీర్చే లక్ష్యంతో సబ్సిడీ ధరకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు గతంలో మంజూరు చేసిన అన్నా క్యాంటీన్‌లను పున: ప్రారంభించేందుకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.
• గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను కక్షపూరితంగా మూసివేసి నిరుపేదల నోటి దగ్గర ముద్ద తీసేసింది. పేదవాడి ఆకలి దప్పులను తీర్చేందుకు సీఎంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన రోజునే అన్నా క్యాంటీన్ లను పునరుద్ధరిస్తూ సంతకం పెట్టారు.
• ఆ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్ లను పున: ప్రారంభించేందుకు చర్యలు తీసుకోనున్నారు. తొలి దశలో 183 అన్నా క్యాంటీన్లను ఒకేసారి ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. మిగిలిన 20 క్యాంటీన్లను కూడా తదుపరి దశలో ప్రారంభించాలని నిర్ణయించింది.
• ఈ అన్నా క్యాంటీన్ ల ద్వారా పేద అన్నార్తులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం సబ్సిడీ ధరకే అందించడం జరుగుతుంది.
6. విజయవాడలోని డా.వైయస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును డా.ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా పునర్ నామకరణం చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.
• 1986లో నాటి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ను ఏర్పాటు చేసింది.
• 1998లో ఈ చట్టానికి సవరణ చేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా నామకరణం చేసింది.
• అనంతరం 2006లో డా.ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్పు చేసింది. 2022లో ఈ యూనివర్సిటీ పేరును గత ప్రభుత్వం డా.వైయస్సార్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ గా మార్చింది.
• ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరిస్తూ స్వర్గీయ డా. నందమూరి తారక రామారావు గారు ప్రజలకు చేసిన సేవలకు గుర్తింపుగా యూనివర్సిటీకి ఆయన పేరుతో పునర్ నామకరణం చేయాలన్న ప్రతిపాదనకు మండలి ఆమోదం తెలిపింది.
• విదేశాలకు వెళ్ళే వైద్య విద్యార్థులకు కళాశాల పేరు మారడం వలన సాంకేతిక పరమైన సమస్యలు ఎదుర్కొంటున్న కారణంగా తిరిగి అదే పేరును పునరుద్ధరించేందుకు నిర్ణయించడం జరిగింది.
7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గా దమ్మాలపాటి శ్రీనివాస్ ను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
• ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వపు అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల రాజీనామాలను ఆమోదిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
ఇతర అంశాలు :
• ప్రజల్లో గత ప్రభుత్వం అనుసరించిన విధానాలపై అవగాహన కల్పించేందుకు 7 శ్వేత పత్రాలను విడుదల చేయాల్సిందిగా మంత్రి వర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
• పోలవరం, అమరావతి, విద్యుత్, పర్యావరణం( ల్యాండ్, శాండ్, మైన్స్, జియాలజీ మొదలైనవి), లిక్కర్ అండ్ ఎక్సైజ్, లా అండ్ ఆర్డర్ మరియు ఆర్థిక శాఖల పై శ్వేత పత్రాలను విడుదల చేసి ప్రజలకు అవగాహన కల్పించారు.
• ఈ నెల 28 నుండి జులై 18 వరకు రెండు మూడు రోజులకొకసారి శ్వేత పత్రాలు విడుదల చేయడం జరుగుతుంది.
• గత 5 సంవత్సరాల్లో సంస్థలు ఏ విధంగా కుంటు పడ్డాయన్న విషయాన్ని ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులకు ఉందన్నారు.
• ఇవే గాక అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీల పారిశుద్ధ్య పనులను వెంటనే ప్రారంభించాలి.
• చివరి ఆయకట్టుకు నీరు అందించే దిశలో కాల్వలు, చెరువుల్లో పూడిక, డెక్క తొలగించే కార్యక్రమాన్ని సత్వరమే చేపట్టాలి.
• వర్షాకాలం ప్రారంభం అయినందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లతో సమాయత్తం కావాలని మంత్రి వర్గానికి సూచనలు జారీ
• అధ్వాన్నంగా మారిన రోడ్లు, రహదారులు గతుకులమయం అయినందున వెంటనే పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్ అండ్ బీకి ఆదేశాలు జారీ..
• మత్తు, మాదక ద్రవ్యాల వినిమయం రాష్ట్రంలో అధికమైన నేపథ్యంలో వాటి నుండి యువతను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేందుకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, హోం, ఎక్సైజ్, ట్రైబల్ వెల్ఫేర్ వంటి శాఖల మంత్రులు ఉంటారు. భావితరాల భవిష్యత్ కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది