Suryaa.co.in

Editorial

‘సై’ నుంచి ‘నై’ వరకూ

  • తల్లి-చెల్లితో యుద్ధంలో జారిపోతున్న జగనన్న

  • షర్మిలతో యుద్ధం చేయలేక చేతులెత్తేసిన జగన్

  • ‘ఘర్ ఘర్ కీ కహానీ’కి ఫుల్‌స్టాప్ పెట్టాలని వైసీపీ నిర్ణయం

  • ఆస్తుల పంచాయితీ రచ్చ ఆపేద్దామని కార్యకర్తలకు పిలుపు

  • కోర్టులోనే తేల్చుకుందామని హితవు

  • విజయసాయిరెడ్డి ప్రకటనే ఇక ఆఖరిదా?

  • ఎన్నికల ముందు సిద్ధమా అంటూ విపక్షాలకు సవాళ్లు

  • ఇప్పడు యుద్ధం వద్దంటూ హితవచనాలు

  • షర్మిలతో పోరాటంలో జగన్ వెనుకబడుతుండటమే కారణమా?

  • మహిళలు ఆమె వైపే ఉన్నారని గ్రహించిన తర్వాత దిద్దుబాటకు దిగారా?

  • వైసీపీ నేతలు విమర్శలు ఆపినా షర్మిల మౌనంగా ఉంటారా?

  • ఒకవేళ షర్మిల మౌనం వహిస్తే ఆమెపైనా అనుమానాలు వచ్చే అవకాశం

  • ఇప్పటిదాకా మహిళల మద్దతు తల్లి-చెల్లికే

  • ఇక జగన్‌తో జంగ్ ఆపేస్తే అన్నా-చెల్లి రాజీపడ్డారన్న సంకేతాలు

  • దానితో షర్మిల ఇమేజ్‌కి డామేజీ

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఐదునెలల క్రితం వరకూ అన్న పిలుపే ప్రభంజనం. విపక్షాలను ‘సిద్ధమా’ అంటూ తొడగొట్టి సవాలు విసిరిన సింహం అది. ‘సిద్ధం’ నిలువెత్తు ఫ్లెక్సీలు కట్టించిన సీమ సింహంలో, ఇప్పుడు సమరోత్సాహం నీరసించింది. ‘కొట్లాటలు ఎందుకులేప్పా.. కోర్టులో చూసుకుందాము మీ పెతాపము.. నా పెతాపమూ’ అన్న రాజీ స్వరం, సింహం గొంతులో తొంగిచూస్తోంది.

మహామహులకే సమాధానం చెప్పిన అన్నయ్య సింహం.. పాపం చిట్టి చెల్లెలు సంధిస్తున్న ప్రశ్నలు.. విప్పుతున్న ఆస్తుల గుట్టును భరించలేని సీమ సింహం, చివరాఖరకు ‘మనకొద్దీ పంచాయతీ. కోర్టులో చూసుకుందాం. ఇక మీరూ గమ్మునుండండి’’ అని తన పరివారానికి.. తెల్లజెండా ఊపిన ధీరుడి బేలతనం చూసి, జగనాభిమానులు హాశ్చర్యపోతున్నారు. ఘర్‌ఘర్‌కీ కహానీ అని చెప్పిన జగనన్న, ఆ కహానీ ఏదో కోర్టుకే చెబుదామని డిసైడయిన, మడమతిప్పని వీరుడి ‘మడమతిప్పిన’ వైనం. ఇదీ.. పులి, సింహంగా అభిమానులతో జయజయధ్వానాలు అందుకునే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ లేటెస్టు విషాదం.

‘వైఎస్సార్ కుటుంబంలోని వ్యక్తిగత అంశాలను రచ్చకీడ్చి పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రతిష్ఠ దెబ్బతీయాలని చంద్రబాబు చూస్తున్నారు. ఈ వ్యవహారం కోర్టుల్లో ఉంది. వాదనలేమైనా అక్కడే చేసుకునే వెసులుబాటు ఉన్నందున, దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని పార్టీ భావిస్తోంది’’ ఇదీ… వైసీపీ నాయకత్వం కార్యకర్తలకు ఎక్స్ వేదికగా ఇచ్చిన పిలుపు.

ఈ విషయంలో జగన్, చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించినట్లు కనిపిస్తోంది. ఎంపి విజయసాయిరెడ్డితో తన చెల్లిని పాముతో పోల్చి, షర్మిలకు జగన్ ఏమేమి ఇచ్చారన్న జాబితా చెప్పించారు. అసలాంటి చెల్లెలు ప్రపంచంలోనే ఉండరని తిట్టిపోయించారు. ఆమెను విశ్వాసఘాతకురాలిగా చూపించారు. విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్ అయిన తర్వాతనే, వైసీపీ తెల్లజెండా ఎగరవేస్తున్నట్లు ట్వీట్ చేయడం ప్రస్తావనార్హం.

అంటే ఇకపై పీసీసీ చీఫ్, జగన్ సోదరి వైఎస్ షర్మిలారెడ్డికి సంబంధించిన ఆస్తుల వివాదంపై పార్టీ నాయకులెవరూ మాట్లాడకూడదన్నది, వైసీపీ నాయకత్వం చేసిన ట్వీట్ సారాంశమన్నమాట. చెల్లితో ఆస్తుల గొడవ రోడ్డెక్కి.. ఇప్పటికే ఎవరు ఎవరికి ఏమేమి ఆస్తులు పంచారు? ఇంకా ఎన్ని ఆస్తులు పంచాల్సి ఉంది? అన్న వివరాలు ఇద్దరూ స్పష్టం చేసిన ఫలితంగా.. వైఎస్ తన వారసులకు ఎంతెంత సంపాదించి వెళ్లిపోయారన్న అంశంపై ప్రజలకు స్పష్టత వచ్చింది.

ఇక కేవలం భూములు మాత్రమే ఉండి, కంపెనీ ప్రారంభించని పేపర్ కంపెనీ అయిన సరస్వతీ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ మాత్రమే లెక్క తేలకుండా ఉందని అర్ధమవుతుంది. కాబట్టి షర్మిలకు సంబంధించి చెప్పాల్సిన కొత్త విషయాలేవీ లేనందున, ఇక ఆ అంశానికి తెరదించాలని జగన్ భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది.

అయితే చెల్లి షర్మిల జమిలిగా సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలు, ఆరోపణాస్త్రాలకు జగన్-భారతీరెడ్డి సమాధానమివ్వకుండా, ఇతరులతో మాట్లాడించడం వల్ల.. జగన్‌కు జవాబిచ్చే ధైర్యం లేదన్నది జనాలకు తెలిసిపోయింది. పైగా ఒక తండ్రిలేని ఆడపిల్లను అంతమందితో తిట్టిస్తున్నారంటూ, మహిళలలో సానుభూతి పోగేసేలా చేసింది.

షర్మిల ఆరోపణలకు భార్య భారతీరెడ్డితో సమాధానం ఇప్పించకుండా.. విజయసాయిరెడ్డి. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డి వంటి పార్టీ నేతలతో తిట్టించడంతో, షర్మిలకు సానుభూతి పెంచినట్టయింది. దీనితో ఈ మొత్తం పరిణామాల్లో తాను ముద్దాయిగా, షర్మిలకు హీరోగా ప్రచారం రావడాన్ని గ్రహించిన జగన్.. ఇక ఈ విమర్శలకు తెరదించాలని నిర్ణయించినట్లు ఆ ట్వీట్ స్పష్టం చేసింది.

అయితే కోర్టులోనే వాదనలు వినిపిస్తామని ఇప్పుడు తాపీగా చెప్పిన వైసీపీ నాయకత్వం.. ఆ విషయం తెలిసి కూడా తన పార్టీ నాయకులతో, సొంత చెల్లిని తిట్టించడం ఎందుకో ఎవరికీ అర్ధం కాని ప్రశ్న. అంటే షర్మిలను వీలయినంత డామేజీ చేసి, చివరకు వ్యూహాత్మక మౌనం పాటించాలన్న ఎత్తుగడ, ఈ ట్వీట్‌లో అర్ధమవుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకే షర్మిలను విజయసాయితో తిట్టించాలనుకున్న తిట్లన్నీ తిట్టించి, ఇప్పుడు వ్యూహాత్మకంగా తెల్లజెండా ఎగరవేసినట్లు కనిస్తోంది.

మరి షర్మిల ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఆమె కూడా అన్న తెల్లజెండా చూపి యుద్ధవిరమణ చేసినందున, షర్మిల కూడా తన ఆస్తులపై ఇప్పటిమాదిరిగా మాట్లాడకుండా మౌనవ్రతం పాటిస్తారా? లేక ఎలాగూ అన్యాయం జరిగింది కాబట్టి, కొత్తగా వచ్చే నష్టం ఏమీ లేదు కనుక.. అన్నతో యుద్ధాన్ని కొనసాగిస్తారా అన్నది చూడాలి.

ఎందుకంటే జగన్ అంతటి బలమైన నేతతో ఢీకొని, తనకు జరిగిన అన్యాయాన్ని బహిరంగ పరిచిన తర్వాత, షర్మిలకు మహిళలలో సానుభూతి విపరీతంగా పెరిగింది. షర్మిలను ఒక్కదానిని చేసి పార్టీ నాయకులు ఆమెపై చేసిన మాటల దాడి ఫలితంగా, మహిళాలకు వైసీపీ దూరమయ్యే ప్రమాదం ఏర్పడింది. చివరకు వైసీపీ మహిళా నేతలు సైతం షర్మిలకే మద్దతునివ్వడం విశేషం.

ఈ క్రమంలో ఆస్తుల వివాదంలో బహిరంగ విమర్శలకు జగన్ తెరదింపినందున, షర్మిల కూడా అన్నను అనుసరిస్తే.. అన్నాచెల్లెలుకు రాజీ కుదిరిందని ప్రజలు, ముఖ్యంగా మహిళలు భావించే ప్రమాదం వస్తుంది. అదే జరిగితే షర్మిల ఇప్పటివరకూ ప్రెస్‌మీట్లలో కన్నీళ్లు పెట్టుకుని, సంపాదించుకున్న మహిళల సానుభూతి కాస్తా కొండెక్కే ప్రమాదం ఏర్పడుతుంది.

LEAVE A RESPONSE