– రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు
రాష్ట్రప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన నిధులు చెల్లించకుండా తీవ్ర జాప్యం చేస్తోందని రాజ్యసభ మాజీ సభ్యులు పి.మధు విమర్శించారు. స్థానిక సంస్థలకు చెందిన రూ.7,659 కోట్లను చట్ట విరుద్ధంగా ప్రభుత్వం వినియోగించుకుందని, వాటిని వెంటనే స్థానిక సంస్థలకు బదిలీ చేయాలని కోరుతూ సిఎంకు లేఖ రాశారు. ఆ లేఖను ఆదివారం మీడియాకు విడుదల చేశారు. మూడేళ్లలో 14, 15వ ఆర్థిక సంఘాల నుంచి గ్రామ పంచాయతీలకు విడుదలైన రూ.7,659 కోట్లను దారిమళ్లించి ప్రభుత్వం వినియోగించుకుందని, పంచాయతీ సంస్థల అకౌంట్లలో జమైన రూ.1,350 కోట్లనూ ప్రభుత్వం ఏకపక్షంగా విద్యుత్ బకాయిల పేర డిస్కామ్‌ల అకౌంట్లకు బదిలీ చేసిందని తెలిపారు.
సిఎఫ్‌ఎంఎస్ (కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) స్థానిక సంస్థలకు శరాఘాతంగా మారిందని, ఆర్థిక స్వేచ్ఛను, స్వతంత్రతను హరించివేస్తోందని, పన్ను, పన్నేతర ఆదాయాలైన ఆస్తి పన్ను, బిల్డింగ్ ప్లాన్, ట్రేడ్ లైసెన్స్ ఫీజులు, ప్రొఫెషనల్ టాక్స్, స్టాంపు డ్యూటీ ఆదాయాలను నేరుగా సిఎఫ్‌ఎంఎస్ ఖాతాలోకి జమేసుకుంటూ, తిరిగి ఆ సొమ్మును స్థానిక సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేయడంలేదని తెలిపారు.ఈ సొమ్మును రాష్ట్రప్రభుత్వం అనైతికంగా వినియోగించుకుంటోందని, ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. స్థానిక సంస్థల అధికారాలను, సార్వభౌమత్వాన్ని దెబ్బతీయడమేనని తెలిపారు.
రాష్ట్రప్రభుత్వం క్రమం తప్పకుండా తన పరిధిలో రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నా చేయడం లేదని, 4వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగిసిపోయినా సిఫార్సులు ఇప్పటివరకు ప్రభుత్వం ఆమోదించలేదని పేర్కొన్నారు. 5వ ఆర్థిక సంఘం కాలపరిమితి రెండేళ్లు దాటినా నేటికీ ఆర్థిక సంఘాన్ని నియమించలేదని, దీనివల్ల గత ఏడేళ్లుగా రాష్ట్ర కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి స్థానిక సంస్థలకు రావలసిన నిధులు బదిలీ కావడం లేదని, తలసరి గ్రాంట్లు ఇవ్వడం లేదని వివరించారు.
రాష్ట్రంలో గ్రామ పంచాయితీలు, పురపాలక సంఘాలు ఎక్కువ భాగం కేంద్ర ఆర్థిక సంఘం, రాష్ట్ర ప్రభుత్వ నిధుల మీద ఆధారపడి పౌరసేవలను ప్రజలకు అందిస్తున్నాయని, పారిశుధ్యం, డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ వంటివన్నీ కేంద్ర, రాష్ట్ర నిధులపైనే ఆధారపడి ఉన్నాయని వివరించారు. ఈ నిధులు బదిలీచేయకపోగా, పన్ను పన్నేతర ఆదాయాలనూ రాష్ట్ర ప్రభుత్వమే వినియోగించుకుంటోందని తెలిపారు. స్థానిక సంస్థల పరిపాలన పూర్తిగా స్తంభించిపోయిందని, పారిశుధ్య నిర్వహణ నిర్వీర్యమై పోయిందని పేర్కొన్నారు. పౌరసేవలన్నీ నీరుగారిపోతున్నాయని, స్థానిక అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిందని తెలిపారు.
కనీసం పాడైన రోడ్ల మరమ్మతులకూ నిధులు లేవని, పారిశుధ్యంపై అత్యవసరంగా చేయాల్సిన ఖర్చులూ చేయకపోవడంతో అనేక పట్టణాలు, నగరాల్లో డయేరియా, డెంగ్యు వంటి ప్రమాదకర జబ్బుల బారినపడుతున్నారని పేర్కొన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల నిధులు సుమారు రూ.600 కోట్ల పైన రాష్ట్రప్రభుత్వం బకాయి ఉండటంతో విశాఖ, కాకినాడ, తిరుపతి, అమరావతి నగరాల్లో స్మార్ట్ సిటీ కింద చేపట్టిన ప్రాజెక్టులు కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయాయని లేఖలో ప్రస్తావించారు. ఎస్‌సి, ఎస్‌టి సబ్ ప్లాన్ కింద స్థానిక సంస్థలకు మంజూరుచేసిన నిధులోనూ ప్రభుత్వం కోతపెట్టిందని పేర్కొన్నారు.
విశాఖ, విజయవాడ నగరాల్లో సబ్ ప్లాన్ కింద చేపట్టిన సుమారు రూ.140 కోట్ల విలువగల పనులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించలేదని తెలిపారు. ఆ భారాన్ని ఈ సంస్థలే భరించాలని జివో జారీ చేసిందని పేర్కొన్నారు. విజయవాడ నగరానికి ముఖ్యమంత్రి అభివృద్ధి నిధుల కింద మంజూరు చేసిన రూ.140 కోట్లకు కూడా నేటికీ అతీగతీ లేదని విమర్శించారు.
73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీలకు దఖలు పడిన 29, పట్టణ సంస్థలకు వచ్చిన 18 అధికారాలను కూడా రాష్ట్రప్రభుత్వం నేటికీ పూర్తిగా బదిలీ చేయలేదని, వున్న అధికారాలను స్వేచ్ఛగా వినియోగించుకోనీయడం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలు ఉపసంహరించాలని, వెంటనే నిధులు, గ్రాంట్లు, ప్రత్యేక నిధులు, తలసరి గ్రాంట్లు విడుదల చేయాలని, సిఎఫ్‌ఎంఎస్ నుంచి స్థానిక సంస్థలను మినహాయించాలని కోరారు.