– కోర్టులో ఫార్మా సిటీ ని కొనసాగిస్తున్నాం అని అఫిడవిట్ ఇచ్చారు
– యాచారం మండలంలో నాలుగు గ్రామాల్లో మేడిపల్లి, నానాక్నగర్, తాటిపర్తి, కురమిద్ద లో తీసుకున్న భూములని స్వాదీనపర్చుకోకూడదని హై కోర్టు నుంచి స్టేలు ఉన్నాయి
– ప్రపంచ దేశాల అధినేతలు, పారిశ్రామిక సంస్థలని నమ్మించటం ప్రభుత్వం చేస్తున్న మోసం
– వీళ్ళని నమ్మి మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు కూడా మోస పోతారు
– ఫార్మా సిటీ వ్యతిరేక పోరాట కమిటీ
హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని నమ్మి ఇక్కడ పెట్టుబడులు పెడితే మోసపోతారని ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్‌కు వచ్చిన ప్రపంచదేశాల అధినేతలు, పారిశ్రామికవేత్తలను ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ హెచ్చరించింది. అసలు చట్టపరంగా ఫ్యూచర్ సిటీ చెల్లదన స్పష్టం చేసింది.
ఆ మేరకు ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠమిది.
నేడు, రేపు మీర్ఖంపేట లో జరుగుతున్న ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ లో ఫ్యూచర్ సిటీ విషన్ డాకుమెంట్ విడుదల చేస్తున్నారని పత్రికలలో వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి , ఆయన కాబినెట్ లో ఉన్న మంత్రులు యాచారం మండలం రైతులకి ఫార్మ సిటీ రద్దు చేస్తామని, మాట ఇచ్చి, మేనిఫెస్టో లో పెట్టి ఫార్మా సిటీ రద్దు చేయలేదు. ఒక పక్క ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడతాం అంటూ, కోర్టులో మాత్రం మేము ఫార్మా సిటీ ని కొనసాగిస్తున్నాం అని అఫిడవిట్ ఇచ్చారు. ఎలక్షన్ ముందు రైతుల భూములు కాపాడుతాం అని మాట ఇచ్చి ఇప్పుడు రైతులని మీ భూములు ఇయ్యాల్సిందే అని బెదిరిస్తున్నారు.
చట్ట ప్రకారం ఇక్కడ వేరే ప్రాజెక్ట్ కట్టాలంటే ఇప్పుడు ఉన్న భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చెయ్యాలి. మళ్ళీ ప్రతీ గ్రామంలో కొత్త ప్రాజెక్ట్ రిపోర్టు తెలుగులో ఇచ్చి, ప్రజా అభిప్రాయ సేకరణ చేయాలి. మళ్ళీ కొత్త పర్యావరణ అనుమతులు తెచ్చుకోవాలి. ఇవేవి చెయ్యకుండా ఫార్మా సిటీ కోసం సేకరించిన భూముల్లో మేము ఫ్యూచర్ సిటీ కడతాం అంటే అది చట్ట ప్రకారం చెల్లదు. అంతే కాదు, యాచారం మండలంలో నాలుగు గ్రామాల్లో మేడిపల్లి, నానాక్నగర్, తాటిపర్తి, కురమిద్ద లో తీసుకున్న భూములని స్వాదీనపర్చుకోకూడదని గౌరవ హై కోర్టు నుంచి స్టేలు ఉన్నాయి.
కాబట్టి ఈ భూములని చూపించి ఇక్కడ మేము ఫ్యూచర్ సిటీ కడతాం అని ప్రపంచ దేశాల అధినేతలకి, పారిశ్రామిక సంస్థలని నమ్మించటం ప్రభుత్వం చేస్తున్న మోసం. మేము ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటున్న అతిధులకి తెలియచేసేది: ఈ ప్రభుత్వం మాట ఇచ్చి మమల్ని మోసం చేసి, ఈ రోజు “ప్రజా పాలన” చేస్తున్నాం అని మీ తో ప్రగల్భాలు పలుకుతున్నారు. వీళ్ళని నమ్మి మీరు ఇక్కడ పెట్టుబడులు పెడితే మీరు కూడా మోస పోతారు.