Suryaa.co.in

Andhra Pradesh

రాజధాని అమరావతిలో భూములు అమ్మే జి.వో. రద్దు చేయాలి

అమరావతిలో రాజధాని అభివృద్ధికి రైతుల నుండి సమీకరించిన భూములను దశలవారీగా అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 389 జిఓ వెంటనే ఉపసంహరించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

తొలిదశలో 14 ఎకరాలు వేలం ద్వారా అమ్మాలని నిర్ణయించడం శోచనీయం. రానున్న రోజుల్లో ఇది మరింత వేగవంతమయ్యే ప్రమాదం ఉంది. ప్రజలు, రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు ఈ నిర్ణయాన్ని తిరస్కరించాలని సిపిఐ(యం) కోరుతున్నది.

విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. మూడేళ్ల కాలంలో రాజధాని నిర్మాణాన్ని వైఎస్సార్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కేంద్రం నిధులు ఇవ్వకుండా మభ్య పరుస్తోంది. హైకోర్టు ఆదేశాల అనంతరం కూడా నిధుల కొరత పేరుతో రాజధానిని అభివృద్ధి చేయకుండా కాలయాపన చేస్తోంది.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాజధాని అభివృద్ధికి నిధులు సాధించాలి. ఆ నిధులతో రాజధానిని అభివృద్ధి చేయాలి. రాష్ట్ర ప్రభుత్వము తన బడ్జెట్లో నిధులను తోడు చేయాలి. అంతేగాని ప్రజోపయోగమైన కార్యక్రమాలకు వినియోగించాల్సిన భూములను అమ్మకానికి పెట్టడం తగదు.

జీవో నెంబర్‌ 389 రద్దు చేయాలి. రాజధాని అభివృద్ధికి నిధులు కేటాయించాలి. కేంద్రంపై ఒత్తిడి చేయాలి. అభివృద్ధి కార్యక్రమాలు వెంటనే ప్రారంభించాలి. రైతుల ప్లాట్లలో సదుపాయాలు కల్పించాలి. కూలీలు, పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండు చేస్తున్నది.

 

LEAVE A RESPONSE