పవనుడిని గేమ్ చేంజరునిగా తీర్చిదిద్దిన జగన్మోహనుడికి అభినందనలు . 2009 లో ప్రజారాజ్యం పార్టీలో పంచెలు ఊడదీయిస్తా అని తొడలు కొట్టి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినా రిమోట్ రాజకీయానికే పరిమితం అయ్యారు పవన్ కళ్యాణ్ .
కాంగ్రెస్సులో పీఆర్పీ ని విలీనం చేయటం సుతరామూ పవనుడికి ఇష్టం లేదని అంటారు . ఓపిగ్గా వెయిట్ చేసి అయిదేళ్ల తర్వాత 2014 లో జనసేన పార్టీని పెట్టి సైన్యం లేని సేనాధిపతిగా నాటి భాజపాకు తన సపోర్టుని అందించారు . కొద్ది రోజుల్లో తెదేపా ఎన్డీఏ లో కలవటంతో మొత్తం అలయెన్సుకు ప్రచారం చేసారు .
చాలామంది పవనుడికి రాజకీయం తెలియదు అంటారు . తెలియనట్లు కనిపిస్తారు . ఆయనకు తెలిసినట్లుగా యువ రాజకీయవేత్తలలో చాలామందికి రాజకీయం తెలియదు . 2014 లో భాజపాకి సపోర్ట్ చేసిన పవన్ 2019 ఎన్నికల్లో భాజపాకు బధ్ధ ప్రత్యర్ధులయిన కమ్యూనిస్టులతో కలిసి పోటీకి దిగితే రాజకీయం తెలవకపోవటం ఏంటి !?
ఎన్నికలు కాగానే మళ్ళా భాజపాతో జత కడితే రాజకీయం తెలియకపోవటం ఏంటి !? 2019-2024 అంతా మోడీకి అత్యంత ప్రియతముడు అయిన జగన్మోహనుడితో యుధ్ధం చేస్తూనే ఉన్నారు . ఇది మామూలు రాజకీయం కాదు . చాణక్యమే .
మోడీకి ప్రియతముడు అయిన జగన్మోహుడికి వ్యతిరేకంగా చంద్రబాబుతో మోడీని జత కట్టేందుకు ఒప్పించి, 2024 ఎన్నికల్లో గేం చేంజర్ అయ్యారు . ఆ పుణ్యం కూడా జగన్మోహనుడిదే . పవన్ వ్యక్తిగత వివాహం గురించి బహిరంగ సభల్లో కెలికీ కెలికీ పవన్ తిక్కను రేగించాడు .
ఏదో సినిమాలో ఆయనే చెప్పినట్లు నాకు తిక్కుంది. దానికో లెక్కుంది అన్నట్లు 2024 ఎన్నికల్లో ఒక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని శపధం చేసి , తదనుగుణంగా కూటమిని కట్టి 164 సీట్లతో రికార్డుని నెలకొల్పారు . 100% స్ట్రైక్ రేట్ ని సాధించారు . గేమ్ చేంజర్ అయ్యారు .
రాజకీయాల్లో , ఎన్నికల్లో విమర్శలు టచ్ & గో లో ఉండాలి . పవన్ మూడు పెళ్ళిళ్ళను పదేపదే కెలికి , overpoliticking చేసి జగన్మోహనుడు పవనుడిని గేమ్ చేంజర్ ని చేశారు .
2009 లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి 2024 లో గేం చేంజరయి , ఎమ్మెల్యే అయిన మొదటిసారే ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ కు మరోసారి శుభాకాంక్షలు .
– ప్రొఫెసర్ డి ఏ ఆర్ సుబ్రహ్మణ్యం