– లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీ ప్రదర్శన ప్రారంభం
– సృజనాత్మకతకు ప్రోత్సాహం, సాంస్కృతిక వారసత్వం లేపాక్షి ధ్యేయం
– లేపాక్షి చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్
విజయవాడ: “గాంధీ శిల్ప్ బజార్, లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీలు మా శిల్పకారుల ప్రతిభను గౌరవించే వేదికలు. ఇవి సృజనాత్మకతకు ప్రోత్సాహం ఇచ్చి, మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నాయి” అని లేపాక్షి చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. నగరంలోని అమ్మ కల్యాణ మండపం ఆవరణలో సోమవారం ఆయన ప్రదర్శనను ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి, ఎటికొప్పాక, కలంకారీ, తోలు బొమ్మల వంటి కళలకు గొప్ప చరిత్ర ఉందని, వాటికి ఆధునిక కాలంలో మరింత అవకాశాలు కల్పించటం ప్రభుత్వ ధర్మమని ఈ సందర్భంగా హరిప్రసాద్ అన్నారు. యాంత్రిక వస్తువులు ఆధిపత్యం చూపుతున్న ఈ కాలంలో, ఇలాంటి ప్రదర్శనలు శిల్పకారుల ప్రతిభను ప్రజల ముందుకు తెస్తాయని, యువతకు చేతిపని విలువ తెలియజేస్తాయని ఆయన అన్నారు.
దేశవ్యాప్తంగా 40మంది కంటే ఎక్కువ శిల్పకారులు, చేతి వృత్తి కళాకారులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. లేపాక్షి హస్తకళల డిజైన్ పోటీలో కొండపల్లి, ఎటికొప్పాక, తోలు బొమ్మలు, వుడ్ కార్వింగ్, కలంకారీ వర్గాల్లో పోటీలు జరిగాయి. విజేతలకు బంగారం, వెండి, కాంస్య పతకాలతో పాటు రూ. 2.5 లక్షల నగదు బహుమతులు అందించనున్నారు. ఏపీహెచ్డీసీ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ మనోహరన్ మాట్లాడుతూ, ఈ ప్రదర్శనలు శిల్పకారుల ఆత్మవిశ్వాసాన్ని పెంచి, వారికి గుర్తింపు, మార్కెట్ అవకాశాలు, ఆర్థిక బలాన్ని అందజేస్తాయని అన్నారు. స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కళాకారులకు అభినందనలు తెలిపారు.