– రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ లో ప్రయాణించొచ్చు
– సంస్థ వి.సి అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వి.సి. సజ్జనార్ ఆమోదం
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు శత విధాల ప్రయత్నిస్తోంది . వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ గా వి.సి.సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సంస్థ బాగుతో పాటు ప్రయాణీకుల రవాణా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే . ఈ దిశలో వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ మెరుగైన సేవలు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు .
‘ప్రజాదరణ -సంస్థకు ప్రేరణ’ గా భావించిన ఆయన ప్రయాణీకులకు మరో శుభవార్త అందించారు.బస్సు ఛార్జీలు పెంచడమే కానీ తగ్గించడం అనే మాటను తుడిచేశారు . తాజాగా గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు . ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తున్న ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించడం కొసమెరుపు.దీంతో ప్రయాణీకులు ఎంచక్కగా రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చు . ఈ సవరించిన / తగ్గించిన ఛార్జీలు షెడ్యూల్ , ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి . కాగా అంతరాష్ట్ర సర్వీసులో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు మునుపు ఉన్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు .
కర్ణాటక ఆర్టీసీతో సమానంగా ప్లెక్లీ ఛార్జీలు అమలులో ఉన్న హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు.రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ వి.సి అండ్ ఎం.డి సజ్జనార్అన్నారు .
హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ .100 , హైదరాబాద్ – ఆదిలాబాద్ మధ్య రూ .111 , హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ .121 , హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 లు తగ్గినట్లు ఆయన వివరించారు .ప్రయాణీకుల సమస్యలపై ఇప్పటికే ట్విట్టర్ వేదికగా ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం జరుగుతోందని తెలిపారు.
ప్రజా రవాణా సేవల్ని వినియోగించుకుంటున్న ప్రయాణీకులు ఆర్టీసీని మరింత ఆదరించి సంస్థ అభ్యున్నతికి దోహదపడాలని ఆయన కోరారు .