– గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్టుకు తరలిస్తే కఠిన చర్యలు
– ఇండక్షన్ స్టవ్స్ వంటి ప్రత్యామ్నాయాలను అన్వేషించండి
– ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది ఉండకూడదు
– గ్యాస్ నిల్వలు, సరఫరాపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
అమరావతి: గృహ వినియోగానికి సంబంధించిన వంట గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలకు ఇబ్బంది రాకుండా నిరంతర సరఫరా ఉండాలని సీఎం సూచించారు. సోమవారం ఆర్టీజీఎస్ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, బుకింగ్, సరఫరా వంటి అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు.
ఈ సమావేశానికి ఓఎన్జీసీతోపాటు భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సహా గ్యాస్ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్రంలోని ఎల్పీజీ నిల్వలు, సరఫరా వంటి అంశాలపై పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 17,209 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ స్టాక్ అందుబాటులో ఉందని ఉన్నతాధికారులు వివరించారు.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన హెచ్ పీసీఎల్,బీపీసీఎల్, ఐఓసీఎల్ సంస్థలకు చెందిన 1154 ఏజెన్సీల నుంచి గ్యాస్ సరఫరా అవుతోందని అధికారుల వెల్లడించారు. ఈ సందర్బంగా ఎల్పీజీ సిలిండర్లు బ్లాక్ మార్కెట్ కు తరలి పోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి వినియోగదారు నుంచి ఓటీపీ తీసుకునే విధానాన్ని అవలంభించడం ద్వారా డొమొస్టిక్ సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు. HPCL సంస్థ 90 శాతానికి పైగా ఓటీపీలతోనే గ్యాస్ సరఫరా చేస్తోందని…ఆ తర్వాత స్థానాల్లో BPCL, IOCL ఉన్నాయని అధికారులు తెలిపారు.
ఓటీపీల విషయంలో ఏమైనా ఇబ్బందులుంటే… స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల ద్వారా సమన్వయం చేసుకుంటూ..ఆర్టీజీఎస్ నుంచి సాంకేతిక సాయాన్ని ఆయా గ్యాస్ సరఫరా కంపెనీలకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు సీఎంకు తెలిపారు. గ్యాస్ డెలివరి విషయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా టెక్నాలజీని ఉపయోగించి పని చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
ఎల్పీజీ గ్యాస్ సిలెండర్ల సరఫరా విషయంలో సాధారణ పరిస్థితుల్లో ఒకటిన్నర రోజుల్లోనే డెలివరి జరిగేదని…కానీ ఇప్పుడు రెండున్నర రోజులు పడుతుందని అధికారులు వెల్లడించారు. గతంతో పోల్చుకుంటే రీఫిల్ బుకింగ్ గడవు పెరిగిందని… ఇలాంటి సమయంలో గతంలో మాదిరిగానే డెలివరిని ఒకటిన్నర రోజుల్లోనే అందించగలిగితే ప్రజల్లో గ్యాస్ సరఫరా విషయంలో ఆందోళన ఉండదని సీఎం చంద్రబాబు సూచించారు. ఎల్పీజీ సరఫరా విషయంలో ప్రజల్లోని ఆందోళనలు తొలగించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
కీలక వ్యవస్థలకు ఇబ్బంది కలగకూడదు
కొన్ని కీలక వ్యవస్థలకు గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అన్నక్యాంటీన్లకు గ్యాస్ సరఫరా విషయంలో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని ముఖ్యమంత్రి ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 సెంట్రల్లీ కిచెన్ల ద్వారా అన్న క్యాంటీన్లకు ఆహారం సరఫరా జరుగుతోందని… వాటికి ఎలాంటి ఇబ్బందుల్లేవని అధికారులు చెప్పారు. ఈ విషయంలో పూర్తి స్థాయిలో మానిటర్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
దీంతో పాటు ఆస్పత్రులు, స్కూళ్లు, దేవాలయాలు వంటి వాటిల్లో రోజు వారీ కార్యాకలాపాలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని..నిరంతరం ఆయా శాఖలకు చెందిన అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ఉండాలని సీఎం ఆదేశించారు. హాస్టళ్లు వంటి వాటిల్లో కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. ఇక ఎల్పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటళ్ల అసోసియేషన్లతో ప్రభుత్వం సంప్రదింపులు జరపాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే హోటళ్ల అసోసియేషన్లకు చెందిన కొందరు ప్రతినిధులతో మాట్లాడుతున్నామని… వాళ్లు ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామన్నారని మంత్రి అచ్చెన్నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు.
ఇక చిన్న చిన్న వ్యాపారులకు రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బందులు పడకుండా.. వారి జీవనోపాధికి ఆటంకం కలగకుండా ఉండేలా కిరోసిన్ సరఫరా చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశంలో ప్రస్తావించారు. ఇక ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు ప్రత్యామ్నాయ విధానాలను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. సంక్షోభ సమయంలోనే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచన చేసి.. వ్యవస్థలను పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి వివరించారు.
యుద్దం జరుగుతున్న సందర్భంలోనే కాకుండా.. యుద్ద విరమణ తర్వాత కూడా కొన్ని రోజులు పాటు ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదని.. వాటిని కూడా అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇక ఓఎన్జీసీ, గెయిల్, బీజీఎల్ వంటి సంస్థలతో ఇంటింటికి గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్లు ఇచ్చే సంస్థలు సమన్వయం చేసుకుని పని చేయాలని సీఎం సూచించారు. ఈ క్రమంలో గ్యాస్ పైప్ లైన్ల విస్తరణకు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు.
ఇండక్షన్ స్టవ్ లను కూడా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు త్వరలోనే మరింత ఎల్పీజీ కేటాయింపులను కేంద్రం చేయనున్నట్టు అధికారులు వెల్లడించారు. వివిధ ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యల పైనా అధికారులు దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షలో వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.