హైదరాబాద్: రాష్ట్రంలో 503 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీకి ఈ నెల 11న నిర్వహించనున్న ప్రిలిమినరీ పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఉదయం 10.15 గంటల తర్వాత అభ్యర్థులను ఎవరినీ అనుమతించబోమని తెలిపింది. ఈ మేరకు అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ పలు సూచనలు చేసింది.
”ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేస్తే, దానికి బదులుగా కొత్తది ఇవ్వబోం. ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలు, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌తో సక్రమంగా బబ్లింగ్ చేయాలి. సరైన వివరాలు బబ్లింగ్ చేయని, పెన్సిల్, ఇంక్‌పెన్, జెల్పెన్ ఉపయోగించిన, డబుల్ బబ్లింగ్ చేసిన పత్రాలు చెల్లుబాటు కావు. అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆ గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపుకార్డులు తీసుకురావాలి. వీటి విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తాం” అని వివరించింది.