{63 bytes}
– 17 ఏళ్ల నుంచి చెల్లించని గీతం డీమ్డ్ యూనివర్శిటీ
– గీతం వైఖరిపై హైకోర్డు జడ్జి ఆశ్చర్యం
– గీతం వర్శిటీకి ఆ వెసులుబాటు ఎందుకని ప్రశ్న
– వెయ్యి రూపాయలు కట్టకపోతేనే కరెంట్ కట్ చేస్తారు కదా?
– మరి 118 కోట్లు కట్టకపోతే ఏం చేస్తున్నారు?
– విద్యుత్ శాఖ అధికారులపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
హైదరాబాద్: విద్యుత్ బకాయిలు చెల్లించకపోతే ఇంట్లో సామాన్లు బయటకు విసిరేయడం.. ఇళ్లకు తాళాలు వేయడం.. కొన్ని గ్రామాల్లో అయితే మొండి బకాయిదారుల పేర్లు బహిరంగంగా ప్రకటిస్తూ డప్పు వేయడం.. పత్రికా ప్రకటలు ఇవ్వడం.. వారి కరెంట్ మీటర్లు కట్ చేసే దృశ్యాలు తరచూ పత్రికలు, చానెళ్లలో చూస్తుంటాం.
మంచిదే. ఎందుకంటే నష్టాల్లో ఉండే విద్యుత్‌శాఖకు, మొండి బాకీ వసూళ్లు కీలకమైన సమస్య. దానికోసం బకాయిదారుల దుంపతెంచడమే కాదు. వాళ్ల పరువు కూడా తీసేందుకు విద్యుత్ శాఖ అధికారులు వెనుకాడరు. మరి పదిమంది ముందు మీ బకాయిలు ఎప్పుడు తీరుస్తారని, కరెంట్ కనెక్షన్ కట్ చేస్తే ఎవరికయినా నామర్దానే కదా?
మరి అదే చిత్తశుద్ధి.. అదే లక్ష్యం.. అదే దూకుడు.. వందల కోట్లకు పడగలెత్తిన బడా బాబులకూ వర్తింప చేయాలి కదా? బడా సంస్థలపైనా అదే పద్ధతిలో చర్యల కొరడా ఝళిపించాలి కదా? అసలు పదివేల రూపాయల బిల్లు పెండింగ్‌లో ఉంటేనే ఇంటికొచ్చి, నానా గత్తర చేసి..
చెప్పాపెట్టకుండా కనెక్షన్ కట్ చేయడంలో నిర్దయగా వ్యవహరించే విద్యుత్ శాఖ అధికారులు.. 2008 నాటి నుంచి అక్షరాలా 118 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లు చెల్లించకపోయినా, చాలా దయ.. విశాల హృదయంతో వ్యవహరిస్తారని ఎవరైనా ఊహిస్తారా? లేదు కదా?
అసలు అలాంటి దయతలచే లక్షణమే విద్యుత్ శాఖకు లేదనుకుంటాం కదా? కానీ ఆ నిర్దయ.. ఆ నిర్మొహమాటం.. సామాన్య, మధ్య తరగతి ప్రజలపైనే తప్ప.. బడా బాబులకు మాత్రం కాదంటే నమ్ముతారా? నమ్మి తీరాలి.
ఎందుకుంటే 17 ఏళ్ల నుంచి.. అంటే రాష్ట్ర విభజనకు ముందు నుంచీ.. హైదరాబాద్‌లోని పేరుమోసిన గీతం యూనివర్శిటీ చెల్లించాల్సిన, ‘కేవలం 118 కోట్ల రూపాయల’ పెండింగ్ బిల్లును, విద్యుత్ అధికారులు దయతలచి వదిలేశారు కాబట్టి! ఆశ్చర్యంగా లేదూ? అవును.. హైకోర్టు జడ్జిగారు కూడా ఇలాంటి ఆశ్చర్యమే వ్యక్తం చేశారు. ఆ ముచ్చటే ఈ ముచ్చట!
గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బకాయిలపై తెలంగాణ విద్యుత్‌శాఖ అధికారులపై హైకోర్టు మండిపడింది. సామాన్యులు రూ.1000 బకాయిలు ఉంటే ముక్కు పిండి వసూలు చేసే విద్యుత్ అధికారులు రూ.వందల కోట్ల బకాయిలు ఉన్నా.. ఎందుకు వసూలు చేయలేదంటూ మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ యూనివర్సిటీ విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఎస్పీడీసీఎల్ నోటీసులు పంపింది. 2008 నుంచి ఇప్పటి వరకు రూ.118కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదంటూ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఎస్పీడీసీఎల్ నోటీసులను గీతం యూనివర్సిటీ హైకోర్టులో సవాల్ చేసింది. అయితే, యూనివర్సిటీ దాఖలు చేసిన జస్టిస్ నగేశ్ భీమపాక బెంచ్.. 2008 నుంచి బిల్లులు చెల్లించకపోవడంతోపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గీతం యూనివర్శిటీకి ప్రత్యేక వెసులుబాటు ఎందుకని హైకోర్టు జడ్జి నిలదీశారు.
సామాన్య ప్రజలు రూ.1000 బిల్లు కట్టకపోతేనే కరెంట్ కనెక్షన్‌ను తొలగిస్తున్నారు. అలాంటిది యూనివర్సిటీకి మాత్రం ఎందుకు ప్రత్యేకంగా వెసులుబాటు కల్పించారని ప్రశ్నించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని, సూపరింటెండెంట్ ఇంజినీర్ వ్యక్తిగతంగా హాజరుకావాలని బెంచ్ ఆదేశించింది. పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది.