October 8, 2026

త్రిపురను గెలిపించని జెన్‌జీ, రాహుల్ ఉద్యమం

  • త్రిపురలో కనిపించని ‘బొద్దింక’ల ప్రభావం
  • సీఈసీ తొలగింపుపై అట్టుడుకుతున్న ఢిల్లీ
  • రోడ్డెక్కిన రాహుల్, జెన్ జీ.. జెన్ ఆల్ఫా
  • సోషల్‌మీడియాలో హిమాలయమంత పెరిగిన రాహుల్ ఇమేజ్
  • మిలియన్లలోకి వెళ్లిన నెటిజన్ల అభిమానం
  • కానీ తాజా త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఘోర పరాజయం
  • 5 వేల గ్రామ సమితిలో కాంగ్రెస్ ఖాతా 14 మాత్రమే
  • సోషల్‌మీడియా, జెన్‌జీ, జెన్ ఆల్ఫాలను పట్టించుకోని ప్రజలు
  • ఇది రాజకీయ పార్టీలకు హెచ్చరిక సంకేతమా?
  • సోషల్‌మీడియాను నమ్ముకుంటే ప్రచారం తప్ప ‘ఫలితం’ రాదా?
  • రాజకీయ పార్టీలకు త్రిపుర గుణపాఠం

దేశాన్ని ఊపేస్తున్న జెన్ జీ.. జెన్ జెడ్.. జెన్ ఆల్ఫా.. సోషల్‌మీడియా ప్రభావం ప్రజలపై గుండుసున్నాయేనా? అవి కేవలం ప్రచారం తప్ప ఫలితం ఇవ్వవమని తేలిపోయిందా? సోషల్‌మీడియాతో లైకులు, షేర్లు, కామెంట్లు చూసి మురిసిపోవడమే తప్ప అనుకున్న ఫలితం దక్కదా? కార్యకర్తలను పక్కనబెట్టి సోషల్‌మీడియా షోకులు ఇష్టపడే నేటి యువ సారథులకు, తాజా త్రిపుర ఎన్నికల ఫలితాలు హెచ్చరిక సంకేతమా? ఎప్పటికయినా ఈ దేశంలోని రాజకీయ పార్టీలకు.. మనుషులు మనుషులను కలిసే సంప్రదాయ రాజకీయమే శరణ్యమా? సోషల్‌మీడియా పేరుతో.. ఇన్ఫుయెన్సర్లు, యాక్టివిస్టులను కూర్చోబెట్టి మేపుతున్న పార్టీలకు, త్రిపుర ఎన్నికల ఫలితాలు చెంపపెట్టేనా? సీఈసీ తొలగించాలన్న ఉద్యమంతో రోడ్డెక్కిన రాహుల్ కష్టం ‘ఫలితం’ ఇవ్వడం లేదా? రాహుల్‌ను సోషల్‌మీడియా ఎంత ప్రమోట్ చేసినా.. చివరాఖరుకు ‘ఫలితాల్లో’ కాంగ్రెస్ చతికిలబడుతోందా? కార్యకర్తల ద్వారా ప్రజలను కలుస్తున్న కమలం వ్యూహమే మళ్లీ గెలిచిందా? తాజా త్రిపుర స్థానిక ఎన్నికల ఫలితాలు తేల్చింది అదేనా? ‘ఒకనారీ వందతుపాకులు’ మాదిరిగా.. ఒక త్రిపుర- వంద జెన్‌జీల విఫలగాథ ఇది.

రాహుల్ గాంధీకి ఒక గుడ్ న్యూస్.. ఒక బ్యాడ్ న్యూస్

‘సర్’లో ఓటర్ల తొలగింపు ప్రక్రియ.. ఈవీఎంల స్థానంలో మళ్లీ బ్యాలెట్ పేపర్లు పెట్టాలంటూ కాళ్లకు బలపాలు కట్టుకుని.. జంతర్‌మంతర్ నుంచి పార్లమెంటు వరకూ తిరుగుతున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్‌గాంధీకి ఇదో గుడ్ అండ్ బ్యాడ్ న్యూస్.

ఈవీఎం వల్లనే కాంగ్రెస్ ఓడిపోయిందని, లేకపోతే ఈపాటికి రాహుల్ ప్రధాని సీట్లో కూర్చునేవారన్నది.. అదే ఈవీఎంలో తెలంగాణ, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్, జార్ఘండ్ వంటి పెద్ద రాష్ట్రాలు గెలిచిన కాంగేయుల వాదన. ఇక ఒక వర్గానికి చెందిన వారి ఓట్ల తొలగించడం కోసమే సర్ ప్రారంభించారు కాబట్టి, దాన్ని నిలిపివేయాలన్నది కాంగ్రెస్ మేధావుల మరో వాదన. సరే.. ఇంతకూ దేశ ఆశాజ్యోతి రాహుల్‌కు ఒక గుడ్.. మరో బ్యాడ్ న్యూసేంటో చూద్దాం.

మొదటిది గుడ్ న్యూస్

త్రిపుర గ్రామ పంచాయతీ (గ్రామ సమితి), అస్సాంలోని సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో విశేషం ఏమిటంటే… రాహుల్ గాంధీ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నట్లుగా, కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నట్లుగా ఈ ఎన్నికలు ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ పేపర్లతోనే జరిగాయి! సంతోషం. ఈ లెక్కన మళ్లీ బ్యాలెట్ ఓటింగ్ పెట్టాలన్న యువరాజుల వారి కొరిక నెరవేరింది.

బ్యాడ్ న్యూస్

బ్యాలెట్ పేపర్లతో నిర్వహించిన ఈ ఎన్నికల్లో కూడా రెండు చోట్లా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది!

  • త్రిపుర గ్రామ సమితి ఎన్నికల్లో దాదాపు 5,000 స్థానాలకు గాను కాంగ్రెస్‌కు దక్కింది కేవలం 14 సీట్లు మాత్రమే. అదే సమయంలో ఎన్డీఏ కూటమి ఏకంగా 4,320 స్థానాల్లో ఘనవిజయం సాధించింది.
  • మరోవైపు, సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించగా… కాంగ్రెస్ పరిస్థితి కనీసం స్వతంత్ర అభ్యర్థుల కంటే దారుణంగా దిగజారిపోయింది.

అసలు నిజం ఏమిటంటే… ప్రజలు తమకు ఓట్లు వేయడం లేదన్న సత్యం వారికీ తెలుసు. కానీ తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ ఈవీఎంల నిందలు, బ్యాలెట్ పేపర్ల డ్రామాలన్నది జనవాక్యం!అంటే కాంగ్రెస్ వాదనకు సరకు లేదని త్రిపుర ఓటర్లూ తేల్చేశారన్న మాట. ఎగిరెగిరి దంచినా అదే కూలీ. ఎగరకుండా దంచినా అదే కూలీ లెక్కన్నమాట! నిజంగా కాంగ్రెస్ వాదనలో సరుకుంటే, జనం కాంగ్రెస్ కోరుకున్న బ్యాలెట్ పేపర్ ఓటింగులో ఆ పార్టీని గెలిపించేవారు కదా? జెన్ జీలు.. జెన్ జడ్.. జెన్ ఆల్ఫాలు.. సోషల్ మీడియా.. ప్రకాష్‌రాజ్‌లూ ఎన్డీఏను వ్యతిరేకిస్తుంటే, మరి త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాలి కదా? మరి అందుకు భిన్నంగా జరిగిందేమిటి చెప్మా?

ఏతావతా చెప్పొచ్చేదేమిటంటే.. జెన్ జీలు.. జెన్ జడ్.. జెన్ ఆల్ఫాలు.. సోషల్ మీడియా ఉరుములు-పిడుగులన్నీ, ఆ గంట టైమ్‌పాస్ బఠాణీ కబుర్లేనని త్రిపుర తాజా ఎన్నికల ఫలితాలు తేల్చాయి. ఎందుకంటే ఈ జెన్‌జీలు.. జెన్ జడ్‌లు.. జెన్ ఆల్ఫాలు కమ్ రాహుల్‌గాంధీ టీమ్, ఢిల్లీలో గత్తర చేస్తున్న సమయంలో జరిగిన ఎన్నికలివి. మరి ఆ లెక్కన ఆ ప్రభావం త్రిపుర యువతపై ఉండాలి కదా? మీకు అర్ధమవుతోందా?

ఈ ఎన్నికల ఫలితాలు సుదీర్ఘ చరిత్ర గల పార్టీలను శాసిస్తున్న ‘యువ నాయకుల’కు ఓ హెచ్చరిక సంకేతం. సోషల్ మీడియా, ఇన్ఫుయెన్సర్లు, కన్సల్టెంట్లు, సర్వే టీములు, ఉద్యోగులతో పార్టీలు నడవని..వాటితో సరైన ఫలితాలు రావని.. కేవలం మనిషిని మనిషి కలిసే సంప్రదాయ రాజకీయాలు మాత్రమే, పార్టీలను గెలిపిస్తాయని త్రిపుర ఫలితాలు మరోసారి తేల్చాయి.

రాజకీయ పార్టీలకు సోషల్‌మీడియా, ఇన్ఫుయెన్సర్లు ఆ గంటకు.. ఆ రోజుకు పొద్దుపొడిచే వ్యవస్థ. ఉద్యోగాలు లేని కుర్రాళ్లకు ఇప్పుడు ఇదో ఉపాథిహామీ పథకం. వీటిని చూపించి పార్టీల దగ్గర ఎక్కువ సొమ్ములు గుంజే మాస్టర్‌మైండ్లకు నయా ఉపాథి వ్యవస్థ.

ఎందుకంటే జనాలకు మతిమరుపు ఎక్కువ. ఒక విషయాన్ని ఎక్కువసేపు గుర్తు పెట్టుకోరు. దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వృధా ప్రయాస. వారి బదులు కార్యకర్తలను నమ్ముకుంటే, నాలుగు ఓట్లు తెచ్చే సైనికులు వాళ్లు. కార్యకర్తలు, నడిపించే నాయకుల మీద నమ్మకం లేక ఈ అరువు మేధావులు, అరువు ఆలోచనలు తెచ్చుకుంటే ‘ఫలితం’ త్రిపుర మాదిరిగానే ఉంటుంది.

గత కొద్దిరోజుల నుంచి సీఈసీని తొలగించాలన్న ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. కాక్రోచ్‌పార్టీ మళ్లీ ఢిల్లీ వీధుల్లో రంకెలు వేస్తోంది. కాంగ్రెస్ యువనేత రాహుల్, ప్రియాంక సహా అంతా గంటకోసారి రోడ్డెక్కి నానా యాగీ చేస్తున్నారు.

ఈ సమయంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా త్రిపురలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 5 వేల స్థానాలకు.. కాంగ్రెస్ పార్టీ కేవలం 14 మాత్రమే గెలిచింది. కమ్యూనిస్టులు పత్తాలేరు. అది మొన్నటివరకూ కమ్యూనిస్టులు ఏలిన గడ్డ. అయినా జెన్‌జీలు, సోషల్‌మీడియా ప్రభావం త్రిపుర ఓటర్లపై ఏమాత్రం పడలేదంటే.. ప్రజలు వాటిని ఎంత లైట్ గా తీసుకుంటున్నారో అర్ధమవుతోంది. మరి జె న్‌జీ.. జెన్ ఆల్ఫాలు త్రిపురలో లేరా? అంతా వృద్ధులే ఉన్నారా ఏంటీ? ఒక్కముక్కలో చెప్పాలంటే.. ప్రజలు సోషల్‌మీడియా, జెన్‌జీ..జెడ్.. ఆల్ఫాలను పులుసులో ముక్కలా తీసేస్తున్నారన్నమాట.

సోషల్‌మీడియా ప్రభావం గురించి మరో ముచ్చట. గత కొద్దిరోజుల నుంచి సీఈసీని తొలగించాలంటూ రాహుల్ ఢిల్లీలో చేస్తున్న ‘ఏకవీర’ ఉద్యమానికి సోషల్‌మీడియా షేకవుతోందట. (కాంగ్రెస్‌ది ఏకవీర ఉద్యమం ఎలా మారిందంటే.. రాహుల్ ధర్నాలకు సమాజ్‌వాదీ, ఆమ్ ఆద్మీ, డీఎంకె, టీఎంసీ, ఎన్సీపీ పార్టీలేవీ పాల్గొనలేదు కాబట్టి. )

అదెలా అంటే.. రాహుల్ ఉద్యమ ప్రభావంతో యవరాజు ఇమేజ్ హిమాలయమంత ఎదిగిందట( సోషల్‌మీడియాలోనే సుమా?) ఈ పరిణామాల తర్వాత రోజుకు 10 నుంచి 15 వేల మంది, ప్రతిరోజూ రాహుల్‌ను కొత్తగా ఫాలో అవుతున్నారట. జెన్ జీ ఇష్టపడే ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్ దూకుడు మామూలుగా లేదట. ‘ఎక్స్’లో 28.6 మిలియన్ల మంది రాహుల్‌ను ఫాలో అవుతుంటే, ఇన్‌స్టాలో 16 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారట. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా ఉత్సాహం ఇస్తోందట.

అంతా బాగానే ఉంది. మరి అంతా బాగుండి.. రాహుల్ ప్రభ సోషల్‌మీడియాలో దేదీప్యమానంగా 33 కెవి సబ్‌స్టేషన్ అంత దివ్యంగా వెలిగిపోతుంటే.. మరి త్రిపుర ఎన్నికల ఫలితాల్లో ఈ నేలచూపుల ఫలితాలేందబ్బా?! కాబట్టి రాజకీయపార్టీలు మనుషులు నమ్ముకోవాలే తప్ప, సోషల్‌మీడియాను నమ్ముకోకూడదని తెలియట్లా?! ఇది సోషల్‌మీడియా మీద ఆధారపడే అన్ని పార్టీలకూ ఒక డేంజర్ సిగ్నల్ బాసూ!

Total Visitors: 2,899,808