– కేంద్ర మంత్రి నడ్డాతో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి, వద్దిరాజు భేటీ
న్యూఢిల్లీ: తెలంగాణలో రోజురోజుకు మరింత తీవ్రమవుతున్న ఎరువుల సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కే.ఆర్.సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర రసాయనాలు,ఎరువుల శాఖ మంత్రి జే.పీ.నడ్డాకు విజ్ఞప్తి చేశారు. ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచంద్రలు గురువారం ఉదయం నడ్డాతో పార్లమెంట్ లోని ఆయన ఛాంబరులో భేటీ అయ్యారు.
వానలు విస్తారంగా కురిసి వరి నాట్లు పడుతున్న ఈ కీలకమైన సమయంలో ఎరువుల కొరత కారణంగా రైతులు పడుతున్న కష్టాలు,బాధల గురించి కేంద్ర మంత్రి నడ్డాకు సురేష్ రెడ్డి, రవిచంద్రలు వివరించారు.ఖరీఫ్ సీజనులో వ్యవసాయ పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా రైతుల విలువైన కాలమంతా ఎరువుల కోసం క్యూలు కట్టి పడిగాపులు పడాల్సి వస్తున్నదని మంత్రి నడ్డా ముందు ఎంపీలు సురేష్ రెడ్డి, రవిచందద్రలు తమ ఆవేదన వెలిబుచ్చారు. వ్యవసాయ అవసరాలకు సరిపడు ఎరువులను (యూరియా) తెలంగాణకు వెంటనే అందేవిధంగా తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ సురేష్ రెడ్డి, రవిచంద్రలు నడ్డాకు వినతిపత్రం సమర్పించారు.