Suryaa.co.in

Andhra Pradesh

ప్రపంచం దృష్టిని ఆకర్షించిన జీఐఎస్‌

– గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ సమ్మిట్‌ గ్రాండ్‌ సక్సెస్‌
– సదస్సులో అసాధారణ స్థాయిలో ఎంఓయూలు
– పారిశ్రామికవేత్తల్లో మా ప్రభుత్వంపై అంతులేని విశ్వాసం
– ఎంఓయూల గ్రౌండింగ్‌లో మా ప్రభుత్వం ట్రాక్‌ రికార్డ్‌
– గత మూడున్నర ఏళ్లలో గ్రౌండింగ్ లో 89 శాతం సక్సెస్‌
– ఇప్పటి జీఐఎస్‌ ఎంఓయూల్లోనూ అదే పంథా కొనసాగిస్తాం
– వీలైనంత వేగంగా పరిశ్రమలు మొదలయ్యేలా చూస్తాం
– రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృతమైన వనరులు
– 14 రంగాలలో పెట్టుబడులకు మంచి అవకాశాలు
– అన్నింటికి మించి ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం
– కేవలం 21 రోజుల్లోనే సింగిల్‌ విండోలో 96 క్లియరెన్స్‌లు
– భూమి కేటాయింపులోనూ పక్కా విధానం, ఏర్పాట్లు
– విశాఖపట్నంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

రాష్ట్ర భవిష్యత్తు. యువతకు ఉపాధి:
విశాఖలో రెండు రోజులు నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌) గ్రాండ్‌ సక్సెస్‌ అయింది. పెట్టుబడిదార్ల నుంచి విశేష స్పందన లభించింది. దాదాపు 352 ఎంఓయూలు. రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనకు విశాఖ వేదిక కావడం సంతోషకర విషయం. రాష్ట్ర భవిష్యత్తు, యువతకు ఉపాధికి ఇది దోహద పడుతుంది. అంతే కాకుండా రాష్ట్ర ఆర్థిక స్థితి కూడా మరింత బల పడుతుంది. ప్రభుత్వం దృష్టిలో రెండు ప్రధాన అంశాలు. ఒకటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడం. రెండు యువతకు ఉపాధి, ఉద్యోగాల కల్పన. రాష్ట్ర వనరులకు తగిన ప్రచారం కల్పించడం అవసరం. మా ప్రభుత్వం అదే పని చేసింది.

రాష్ట్రంలో మౌలిక వసతులు:
రాష్ట్రానికి సువిశాలమైన 974 కి.మీ తీర ప్రాంతం ఉంది. ఇంకా 48 ఖనిజ వనరులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. దేశంలో 11 పారిశ్రామిక కారిడార్లు ఉండగా, వాటిలో మూడు రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్ర విభజనతో ప్రధాన నగరం (హైదరాబాద్‌) కోల్పోయాం. ఆ నగరంతో పోటీ పడగలిగిన స్థాయి ఒక్క విశాఖకు మాత్రమే ఉంది. అది మన అదృష్టం. రాష్ట్రానికి ఆనుకుని ఉన్న కొన్ని ప్రధాన నగరాలు.. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి నగరాలతో అనుసంధానం చేస్తూ.. పారిశ్రామిక కారిడార్లు అభివృద్ధి చేయడం కోసం.. విశాఖ–చెన్నై కారిడార్, చెన్నై–బెంగళూరు కారిడార్, బెంగళూరు–హైదరాబాద్‌ కారిడార్‌. వాటిలో పరిశ్రమల ఏర్పాటు కోసం పరిశ్రమల శాఖ దాదాపు 48 వేల ఎకరాలు సేకరించి, భూముల కేటాయింపునకు సిద్ధంగా ఉంది.

ఇండస్ట్రియల్‌ ఫ్రెండ్లీ:
ఏ పారిశ్రామికవేత్త అయినా వివాదాలు లేని భూమి, తగిన నీరు, విద్యుత్‌ సరఫరా కోరుకుంటారు. వాటితో పాటు, రోడ్‌ కనెక్టివిటీ. వాటన్నింటినీ అందించడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. ఇంకా పరిశ్రమలకు చాలా వేగంగా అనుమతులు ఇస్తున్నాం. 23 శాఖలకు సంబంధించి వైయస్సార్‌ ఏపీ వన్‌ సింగిల్‌ క్లియరెన్స్‌ విండో ఏర్పాటు చేశాం. ఏకంగా 96 అనుమతులు (క్లియరెన్స్‌లు) కేవలం 21 రోజుల్లో అనుమతి ఇచ్చేలా సింగిల్‌ విండో ఏర్పాటు చేశాం. వాస్తవానికి 21 రోజులు గడువు పెట్టుకున్నా, 12 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తున్నాం. అలాగే చాలా వేగంగా భూములు కూడా కేటాయిస్తున్నాం.

అపార మానవ వనరులు:
మనం సులభతర వాణిజ్యం (ఈఓబీ)లో గత మూడేళ్లుగా నెంబర్‌ వన్‌గా ఉన్నాం. 2021–22లో రూ.1.44 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేశాం. దేశంలో 8వ అతి పెద్ద రాష్ట్రం. 5.30 కోట్ల ప్రజలు. దాదాపు 70 శాతం వర్కింగ్‌ ఏజ్‌లో ఉన్నారు. స్కిల్‌ వర్క్‌ ఫోర్స్‌ కూడా ఉంది. 300కు పైగా ఇంజనీరింగ్‌ కాలేజీల ద్వారా ఏటా డిగ్రీతో బయటకు వస్తున్న యువత. ఆ విధంగా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులన్నీ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి.

14 రంగాలలో అవకాశాలు:
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం 14 సెకార్ల (రంగాలు)ను ఎంపిక చేసుకుని ఫోకస్‌ చేయాలని నిర్ణయించాం. ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి. ఫార్మా, ఐటీ సహా పలు రంగాల్లో మనకు మంచి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలోని కొన్ని ఫార్మా కంపెనీలు అనేక దేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. మెరైన్‌ ఎగుమతులు. రొయ్యల ఎగుమతులు చాలా ఎక్కువ. దేశం మొత్తం రొయ్యల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 65 శాతం కాగా, మొత్తం చేపల ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 45 శాతం. ఇంకా చాక్లెట తయారీలో వినియోగించే కొకొవా ఎగుమతిలో కూడా దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం. పండ్లలో బొప్పాయి, మామిడి ఎగుమతులు ఎక్కువ.

ఇవన్నీ మన ఘనత:
రాష్ట్రంలో ప్రతి సెకన్‌కు ఒక మొబైల్‌ తయారవుతోంది. ఇదీ రాష్ట్ర ఘనత. జగన్‌ సీఎం అయిన తర్వాత టీసీఎల్‌ కంపెనీకి భూమి ఇచ్చి, పరిశ్రమ ఏర్పాటయ్యేలా చూశారు. శామ్‌శంగ్‌ టీవీ ఇంటర్నల్‌ డిస్‌ప్లే ప్యానెల్స్‌ మన దగ్గరే తయారవుతున్నాయి. మొబైల్‌ ఫోన్ల ఛార్జర్ల వైర్లు, వాటి బ్యాక్‌ కెమెరాల పార్ట్‌లు ఇక్కడే తయారవుతున్నాయి. హెడ్‌ ఫోన్ల వైర్లు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. సీసీ కెమెరాల ఉత్పత్తి. కడప జిల్లాలో సీసీ ప్లస్‌ కంపెనీ వాటిని ఉత్పత్తి చేస్తోంది. నెల్లూరు జిల్లా శ్రీసిటీలో క్యాడ్బరీ చాక్లెట్లు తయారవుతున్నాయి. బ్లూస్టార్‌ ఏసీలు, ప్యానాసొనిక్‌ ఉత్పత్తులు.. వ్యవసాయ ఆధారిత ఉపకరణాలు పెద్ద ఎత్తున తయారవుతున్నాయి. ఇంకా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి కూడా ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఆ స్థాయిలో ఇక్కడ వనరులు ఉన్నాయి. అన్నింటికి మించి పూర్తి సహాయ, సహకారాలు అందించే ప్రభుత్వం ఉంది. గతంలో ఏ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో ఉన్న వనరులు, మౌలిక వసతుల గురించి ప్రచారం చేయలేదు. ఏ కంపెనీకి అనుమతి ఇచ్చినా, ప్రతిదీ పూర్తి పారదర్శకం. అన్నీ ఓపెన్‌ ఫోరమ్‌లో పెడుతున్నాం. చంద్రబాబు కూడా ఇక్కడ సౌర విద్యుత్, పవన విద్యుత్‌ ప్లాంట్‌ పెడతామంటే అనుమతి ఇస్తాం.

పోర్టుల నిర్మాణం, విస్తరణ:
మారిటైమ్‌ బోర్డు ఏర్పాటు చేశాం. 4 పోర్టులు వేగంగా నిర్మిస్తున్నాం. దాదాపు రూ.3200 కోట్లతో రామయ్యపట్నం పోర్టు, 9 బెర్తులతో నిర్మిస్తున్నాం. ఈ ఏడాది డిసెంబరు నాటికి మొదటి దశ అందుబాటులోకి తేవాలని పని చేస్తున్నాం. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన మచిలీపట్నం పోర్టు విస్తరణకు 20 రోజుల్లో పనులు మొదలు పెట్టబోతున్నాం. భావపనాడు పోర్టు, కాకినాడ పోర్టు నిర్మాణాలు కూడా జరుగుతున్నాయి. ఆ విధంగా పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి జరుగుతోంది.

విపక్షం బుద్ధి మారాలి:
అయినా అదే పనిగా పరిశ్రమలపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది గత మూడేళ్లుగా సాగుతోంది. విశాఖలో జీఐఎస్‌లో పారిశ్రామికవేత్తల మాటలను ఇకనైనా విపక్ష నేతలు గమనించాలి. అవాస్తవాలు ప్రచారం చేయడం మానాలి. ఇక్కడి నుంచి కంపెనీలు వెళ్లిపోతున్నాయన్న విమర్శలు వీడాలి. దేశం గర్వపడే ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రపంచంలోనే టాప్‌ టెన్‌లో ధనికులుగా ఉన్న వారు, సీఎం గురించి ఎంత బాగా చెప్పారో చూశాం. ఆయన పారిశ్రామికవేత్తలకు కల్పించిన విశ్వాసం చాలా గొప్పది.

ట్రాక్‌ రికార్డ్‌ నిలబెట్టుకుంటాం:
జీఐఎస్‌లో రూ.13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంఓయూలు, 6 లక్షలకు పైగా ఉద్యోగాల కల్పనపై ప్రతిపక్షాలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాయి. అయితే గత మూడున్నర ఏళ్లుగా పలు పరిశ్రమలతో మేము చేసుకున్న ఎంఓయూల్లో 89 శాతం కార్యరూపం దాల్చాయి. అది మా ఘనత-మా ట్రాక్‌ రికార్డు. అందుకే ఇప్పటి ఎంఓయూలు కూడా తప్పనిసరిగా కార్యరూపం దాలుస్తాయి. ఆ దిశలో ఇప్పటికే సీఎస్‌ గారి నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. పారిశ్రామికవేత్తలకు కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తాం. వారికి ఏ ఇబ్బంది కలగకుండా చూస్తాం. మా ఆహ్వానాన్ని మన్నించి చాలా మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు విశాఖకు వచ్చారు. వారిలో సీఎంగారు మంచి విశ్వాసాన్ని పెంపొందించారు. సీఎస్‌ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ ప్రతి వారం సమావేశం అవుతుంది. ప్రతి నెలా సీఎంగారు స్వయంగా సమీక్షిస్తారు. వచ్చే కొన్ని నెలల్లో, నెలకు కనీసం రెండు పరిశ్రమలు గ్రౌండ్‌ అయ్యే విధంగా చర్యలు చేపడతాం. పారిశ్రామికవేత్తల్లో మా నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. జీఐఎస్‌పై దేశ వ్యాప్తంగా ఇప్పటికే చర్చ మొదలైంది.

మూడు నగరాల అభివృద్ధి:
విశాఖపట్నం, అనంతపురం, చిత్తూరు.. మూడు నగరాలను ఐటీ కాన్సెప్ట్‌ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం. ఇంకా టూరిజమ్, హాస్పిటాలిటీ రంగాలపైనా ప్రత్యేక దృష్టి పెట్టాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా..
ఫస్ట్‌ లీజ్‌ డీడ్‌- తర్వాత సేల్‌ డీడ్‌:
2019లో మేము అధికారంలోకి వచ్చాక, ఏపీఐఐసీకి సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చాం. పరిశ్రమలకు అవసరమైన భూములు ఇవ్వడంలో నిర్దిష్ట విధానాలు రూపొందించాం. గతంలో పరిశ్రమలకు భూమి ఇస్తూ, సేల్‌ డీడ్‌ చేసే వారు. దాని వల్ల కొన్ని ఇబ్బందులు రావడంతో.. ఆ సేల్‌ కాన్సెప్ట్‌ తొలగించి, లీజ్‌ విధానంలో భూములు కేటాయిస్తున్నాం. ఆ మేరకు లీజ్‌ డీడ్‌ చేస్తున్నాం. పరిశ్రమల వారు చెప్పినట్లుగా పెట్టుబడులు, ఉద్యోగాల కల్పన జరిగిన తర్వాతే.. సేల్‌ డీడ్‌ చేస్తున్నాం. ముందు లీజ్‌ డీడ్‌. పరిశ్రమల యాజమాన్యాలు మాట నిలబెట్టుకున్న తర్వాత, సేల్‌ డీడ్‌. అదే మేము తీసుకొచ్చిన విధానం.

విశాఖకు బ్రాండ్‌ ఇమేజ్‌:
ఓవరాల్‌గా ఒక విషయం గర్వంగా చెప్పగలం. విశాఖకు ఈ సదస్సు ద్వారా బ్రాండ్‌ ఇమేజ్‌ ఏర్పడింది. ఇక్కడి వాతావరణం, అనుకూలమైన పరిస్థితులు, మౌలిక వసతులు.. అన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిశాయి. కాబట్టి విశాఖ రానున్న రోజుల్లో దేశంలోని ప్రముఖ నగరాలతో పోటీ పడగలుగుతుంది.
జీఐఎస్‌ ఎంఓయూలు చాలా వేగంగా కార్యరూపం దాల్చేలా చిత్తశుద్ధితో కృషి చేస్తాం.

LEAVE A RESPONSE