-
సింగరేణి సంస్థను ప్రైవేటుపరం కాకుండా కాపాడండి
-
బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పండి
-
మంత్రి కిషన్ రెడ్డితో ఢిల్లీలో సీఐఐ ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఎంపీ వద్దిరాజు మనోగతం
-
సీఐఐ సదస్సులో ఎంపీ వద్దిరాజు
ఢిల్లీ: తెలంగాణ లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం సమగ్రాభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాల్సిందిగా రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
అయోధ్య తర్వాత భగవాన్ శ్రీరాముల వారు నడయాడిన దివ్య క్షేత్రం భద్రాచలం సమగ్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 50కోట్ల రూపాయలు సరిపోవని,ఈ మొత్తాన్ని ఇంకా పెంచాలని ఎంపీ రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఢిల్లీలో తెలంగాణకు చెందిన పార్లమెంట్ సభ్యులను ఆహ్వానించి కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి జేసీ.కిషన్ రెడ్డితో ముఖాముఖి సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర మాట్లాడుతూ,మన రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి ఉక్కు గనుల శాఖ మంత్రిగా ఉండడం సంతోషదాయకమన్నారు.
తెలంగాణకు కొంగు బంగారంగా ఉన్న సింగరేణిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా ఉందని, దీనిని ప్రైవేటుపరం కాకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన ఈ సంస్థను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తన దార్శనికతతో లాభాల బాట పట్టించారని ఎంపీ వద్దిరాజు వివరించారు.మన రాష్ట్రంలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నెలకొల్పాలని, అవసరమైన ఇనుప ఖనిజాన్ని పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి తీసుకోవచ్చని ఎంపీ రవిచంద్ర వివరించారు.