– ఏపీ హోటల్స్ అసోసియేషన్ డిమాండ్
– ముఖేష్ కుమార్ మీనాకు వినతి పత్రం సమర్పించిన ప్రతినిధి బృందం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హోటల్స్, రెస్టారెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేతలు రెవెన్యూ–ఎక్సైజ్ విభాగ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనాను కలసి, జి ఓ: 131 ప్రతి ఫలాలను నాన్స్టార్ హోటళ్లకు సైతం వర్తింపజేయాలని కోరారు.
బుధవారం సచివాలయంలో అసోసియేషన్ అధ్యక్షుడు పర్వతనేని రవికుమార్, జోన్ అధ్యక్షుడు కృష్ణమోహన్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు వీరమాచినేని హేమంత్ కుమార్, ఐలాపురం రాజా తదితరులు మీనాతో సమావేశమయ్యారు.
3-స్టార్ , అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న హోటళ్లకు మాత్రమే జి ఓ: 131 వర్తింప చేస్తున్నారని, కానీ అనేక నాన్స్టార్ హోటళ్లు కూడా సైజు, సౌకర్యాలు, సేవా ప్రమాణాల్లో వాటితో సమానంగా ఉన్నాయని వారు వివరించారు. ఈ హోటళ్లు వేలమందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాయని, లక్షల మంది కస్టమర్లకు సేవలందిస్తున్నాయని, రాష్ట్రానికి మంచి పన్ను ఆదాయం తెస్తున్నాయని చెప్పారు.
ప్రస్తుతం వీటిని 2B బార్ల తరహాలో పరిగణించడం వల్ల అధిక ఖర్చులు, కఠిన లైసెన్స్ నిబంధనలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. 3-స్టార్ హోటళ్లకు వర్తించే రూ.25 లక్షల వార్షిక లైసెన్స్ ఫీ విధానాన్నే వీటికి కూడా వర్తింపజేయాలని, లాటరీ విధానం నుండి మినహాయింపును ఇచ్చి స్వయంచాలక పునరుద్ధరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన ముకేశ్ కుమార్ మీనా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని హామీ ఇచ్చారు.